Paddy Farmers : కనీస మద్దతు ధరల నిర్ణయం విషయంలో వరి రైతులకు ఎందుకు అన్యాయం జరుగుతున్నది? కనీసం గోధుమతో సమానంగా నైనా ధాన్యానికి కూడా కనీస మద్దత్తు ధర ఇవ్వాలని వ్యవసాయ రంగ నిపుణులు ఎంవీఎస్ నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. రేషనలైజేషన్ లేకుండా నిర్ణయిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు.. నష్ట పోతున్న వరి రైతులు.. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వరి రైతుల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దత్తు ధరలు.. వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులు, ధరల కమీషన్ రికమండేషన్లపై కేంద్ర కాబినెట్ ఆమోదంతో ప్రతి సంవత్సరం నిర్ణయించ బడతాయి..
దేశంలో ప్రధాన ఆహార పంటలు వరి, గోధుమలు..దేశానికి ఆహార భద్రతనిస్తున్న ప్రధాన పంటలు
వరి ప్రధానంగా ఖరీఫ్ పంట..ఖరీఫ్ లో తుఫాన్ ల తాకిడి మూలంగా పంట నష్ట పోవడం, చీడ..పీడల తాకిడి, రాత్రి కన్నా పగలు ఎండ సమయం తక్కువగా ఉండటం మూలంగా దిగుబడులు తక్కువగా ఉంటాయి..ఎంతో పరిశోధనల తరువాత కూడా పూర్తి యంత్రీ కరణ సాధ్యం గాక పోవడం..మూలంగా ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటుంది..
గోధుమ రబీ పంట..రబీ లో తుఫాన్ ల తాకిడి తక్కువగా ఉంటుంది, విత్తనం నాటు దగ్గర నుండి హార్వెస్ట్ వరకు యాంత్రీకరణ, రాత్రి కన్నా పగలు ఎండ సమయం ఎక్కువగా ఉండటం మూలంగా సహజం గానే సరాసరి దిగుబడి పెరిగి క్వింటాలు ఉత్పత్తి వ్యయం ఖరీఫ్ లో పండే వరి తో పోల్చితే తక్కువ అవుతుంది..ప్రభుత్వ అధికారిక లెక్కలు కూడా అదే చూపిస్తున్నాయి..
ఏ పంట కైనా కనీస మద్దత్తు ధరల నిర్ణయానికి వివిధ రాష్ట్రాలలో ఉత్పత్తి వ్యయం లో హెచ్చు తగ్గులు ఉంటాయి, అందుకోసం అన్ని రాష్ట్రాల ఉత్పత్తి వ్యాయాలను కలపి సంచిత సగటు (Cumulative Average) ను లెక్క కట్టి దాన్ని ప్రధానంగా తీసుకుంటారు..
దీని మూలంగా ఉత్పత్తి వ్యయం ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు, తక్కువ ఉన్న రాష్ట్రాలకు ఓకే కనీస మద్దత్తు ధర వస్తుంది.. తద్వారా ఉత్పత్తి వ్యయం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు రైతులు నష్ట పోతున్నారు.
వరి విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి వ్యయం ఎక్కువ.. అందువలన ఆంధ్రప్రదేశ్ వరి రైతులు ఈ కనీస మద్దత్తు ధర మూలంగా నష్ట పోతున్నారు.
సిఎసిపి కనీస మద్దతు ధరలను సూచించే విషయంలో కేంద్ర ప్రభుత్వం 5 విషయాలు సూచిస్తే అందులో ఒకటి మాత్రమే ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవడం, మిగిలిన అన్ని కూడా వినియోగదారుడి ధరలు, దేశ ఆహార అవసరాలు, ఎగుమతులు, దిగుమతులు వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటున్నారు. కష్టపడి పంట పండించి దేశానికి ఆహార భద్రతనిస్తున్న రైతు కుటుంబ ఆర్ధిక భద్రతను ప్రధానంగా తీసుకోక పోవడం బాధాకరం..
గోధుమకు, ధాన్యానికి ప్రకటించిన మద్దత్తు ధర లను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది..
2024-25 లో దేశం మొత్తం బియ్యం ఉత్పత్తి 149 మిలియన్ మెట్రిక్ టన్నులు (డి ఇ యస్ మూడవ ముందస్తు అంచనాల ప్రకారం), ఇందులో ఎగుమతులు 19.36 మిలియన్ మెట్రిక్ టన్నులు.. ఇంటర్నేషనల్ గ్రయిన్ కౌన్సిల్ (IGC) అంచనాల ప్రకారం *2025-26* సీజన్ లో ఈ ఎగుమతులు 23.4 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండవచ్చని అంచనా.. బియ్యం దేశ అవసరాలకు మించి ఉండటం మూలంగా కనీస మద్దత్తు ధర గత సంవత్సరం కంటే కేవలం రూ.69 3 శాతం పెంచి, ఉత్పత్తి వ్యయం A2 కంటే (C3 కాదు) 50% ఉండేలా గ్రేడ్ రకానికి క్వింటాలకు రూ.2389 మాత్రమే నిర్ణయించారు..
అదే గోధుమలు దేశ ఆహార అవసరాలకే సరిపడా లేవు అని దేశ ఆహార భధ్రత దేశ ఆహార ఇన్లేషన్ ను నియంత్రించటానికి 2022 మే నెల నుండి ఎగుమతులు బాన్ చేశారు. అందువలన గోధుమకు కనీస మద్దత్తు ధర గత సంవత్సరం కంటే 160 రూ. (6.6%) పెంచి, ఉత్పత్తి వ్యయం కంటే 109 శాతం ఉండేలా 2585 రూ. నిర్ణయించారు..
ఇది ఒక ఎత్తు అయితే ఒకప్పుడు వరి, గోధుమ కనీస మద్దత్తు ధరలు సమానంగా ఉండేయి లేదా వరి కనీస మద్దత్తు ధరే కొంచెం ఎక్కువ ఉండేది.. ఇప్పటికీ ఉత్పత్తి వ్యయం గోధుమ కంటే వరికే ఎక్కువ ఉన్నప్పటికీ క్రమేణా గోధుమ మద్దత్తు ధర ను వరి మద్దత్తు ధర కంటే ఎక్కువ చేశారు..
గోధుమ- గ్రేడ్ A రకం వరి
ఒకసారి 2025-26 సంవత్సరానికి ఈ రెండు పంటల ఉత్పత్తి వ్యయం, పెంచిన మద్దత్తు ధరలు, పెరిగిన శాతం ను పరిశీలిద్దాం..
వరి గోధుమ
ఉత్పత్తి వ్యయం 1579 1239
యం యస్ పి 2389 2585
పెంపు 69 160
MSP/ఉత్పత్తి
వ్యయం 50% 109%
ఇవి కేంద్ర ప్రభుత్వ అధికారిక ఘణాంకాలు..
ఉత్పత్తి వ్యయం రూ.1239/క్వింటాలు ఉన్న గోధుమ కు ఈ సంవత్సరం 160 రూ. పెంచి 2585 రూ. కనీస మద్దత్తు ధర, ఉత్పత్తి వ్యయం కంటే 109% ఎక్కువగా నిర్ణయించారు..
వరి విషయంలో ఉత్పత్తి వ్యయం 1579 రూ./క్వింటాలు ఉంటే ఈ సంవత్సరం కేవలం 69 రూ పెంచి 2389 రూ. కనీస మద్దత్తు ధర, ఉత్పత్తి వ్యయం కంటే 50% ఎక్కువగా మాత్రమే నిర్ణయించారు..
1239 రూ. ఉత్పత్తి వ్యయం ఉన్న గోధుమకు 2585 రూ. కనీస మద్దత్తు ధర నిర్ణయించడం
1579 రూ. ఉత్పత్తి వ్యయం ఉన్న వరికి 2389 రూ. కనీస మద్దత్తు ధర నిర్ణయించడంలో వరి రైతులకు అన్యాయం జరుగుతున్నది..
ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తున్నది.. దేశ అవసరాలకు మించి ఉత్పత్తి జరిగితే ఎగుమతుల మూలంగా ఎగుమతి పన్ను, విదేశీ కరెన్ సీ వస్తున్నప్పటికి కనీస మద్దత్తు ధరల పెంపు కంటి తుడుపు చర్యలా కొద్దిగా మాత్రమే ఉంటుంది..
రైతుకు కొంతైనా గిట్టుబాటు ధర కావాలంటే దేశ అవసరాలకు చాల కుండా ఉత్పత్తి చెయ్యాలని రైతులకు చెబుతున్నట్లుగా ఉన్నది.
ఇప్పటికే గోదుమలు దేశ అవసరాలకు మించి లేవని ఎగుమతులు బాన్ చేసాము.. పప్పు ధాన్యాలు దిగుమతులలోనే ఉన్నాము..ఎగుమతులలో ఉన్న ధాన్యానికి సరిఅయిన కనీస మద్దత్తు ధర ప్రకటించి, ఆ మద్దత్తు ధరకు కొనుగోలు జరిగేలా చూడకుంటే దేశ ఆహార భద్రత కే ప్రమాదం వస్తుంది..
సిఎసిపి లెక్కల ప్రకారం వేసిన ఉత్పత్తి వ్యయమే క్షేత్ర స్థాయి లో వాస్తవంగా అవుతున్న ఉత్పత్తి వ్యాయానికి అనుగుణంగా లేదు..
గోధుమ రైతులకు ఎక్కువ ఇచ్చారని మేము అనటం లేదు..దేశ వ్యాప్తంగా అన్ని పంటలకు పెరుగుతున్న ఖర్చుల కనుగుణంగా కనీస మద్దత్తు ధరలు పెరగక రైతాంగం సంక్షోభం లోనికి వెళుతున్నారని రైతు సంఘాలన్నీ ఆందోళన చేస్తున్న పరిస్థితిలో వరి రైతులకు కూడా న్యాయం జరగాలని మా కోరిక..
ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు ను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పంటల సాగు 1/10/2025 వరకు 68.57 లక్షల ఎకరాలు జరిగితే ఇందులో 37.21 లక్షల ఎకరాలు 54% వరి సాగు జరిగినది.. దేశవ్యాప్తంగా కూడా అన్ని పంటలలో 39.64% వరి సాగు జరిగినది..
1950 లో మన దేశ జనాభా 35 కోట్లు..ఆహార ధాన్యాల ఉత్పత్తి 35 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఒక కోటి జనాభా కి ఒక మిలియన్ మెట్రిక్ టన్నులు. దేశ ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలు లేక రష్యా నుండి గోధుమలు దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు తిండి పెట్టలేని పరిస్థితి..
2024-25 లో దేశ జనాభా 146 కోట్లు ఆహార ధాన్యాల ఉత్పత్తి 332 మిలియన్ మెట్రిక్ టన్నులు.. ఒక కోటి జనాభా కి 2.27 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి.ఇందులో బియ్యం ఉత్పత్తి 149 మిలియన్ మెట్రిక్ టన్నులు (44.87%).. అంటే దేశానికి ఆహార భద్రత నందించటం లో ప్రధాన పాత్ర వరి రైతులది..
రైతు కు ఆదాయం తాను పండించిన పంటకు ఉత్పత్తి వ్యయానికి.. అమ్మకం ధర కు మధ్య నున్న వ్యత్యాసం మాత్రమే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ సిఎసిపికి సమర్పించిన ఉత్పత్తి వ్యయం అంచనాలు Grade A రకానికి 2024-25 ఖరీఫ్ ఖర్చుల ప్రకారం 2025-26 ఖరీఫ్ లో కనీస మద్దత్తు ధరల నిర్ణయం కోసం..
హెక్టారు నెట్ ఖర్చు C3 ప్రకారం 1,37,451 రూ.
హెక్టారు సరాసరి దిగుబడి 54 క్విన్టాళ్ల చొప్పున ఒక క్వింటాలు ఉత్పత్తి వ్యయం 2,545 రూ..దీనిపై స్వామినాధన్ కమిటీ రికమండేషన్ ల ప్రకారం ఉత్పత్తి వ్యయానికి 50% అదనంగా కలిపి 3818 రూ ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సిఎసిపికి ప్రతి పాదించినది..
హెక్టారు నెట్ ఖర్చు గ్రేడ్ A రకానికి A2 ప్రకారం అయినా 1,00,710 రూ..ఒక క్వింటాలు ఉత్పత్తి వ్యయం 1,865 రూ.. దీనికి గాను ఆంధ్రప్రదేశ్ రైతులకు వచ్చిన కనీస మద్దత్తు ధర 2389 రూ. A2 మీద కేవలం 27 శాతం మాత్రమే..
ఈ వ్యత్యాసం తక్కువగా ఉండటం మూలంగా ఖరీఫ్ లో వరి పంట ప్రధాన మైన రాష్ట్రం గా, ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కువ నష్ట పోతున్నారు.




ఆంధ్రప్రదేశ్ లో వరి పంట సాగు చేసేది 80% కౌలు రైతులు.. ఇప్పటికే ఈ వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదని కవులు డిమాండ్ తగ్గి పోతున్నది. కృష్ణ, గోదావరి, పెన్నా డెల్టాలలో KC కెనాల్, నాగార్జున సాగర్ కాలువ లలో నీరు పారుతున్నంత వరకు ఖరీఫ్ లో వరి పంట కు ప్రత్యామ్నాయం లేదు..
అత్యంత సారవంత మైన, అత్యంత సాగునీటి వనరులు గలిగిన గోదావరి డెల్టా లో దేశ చరిత్ర లోనే మొట్టమొదటిగా లక్ష ఎకరాలలో 2011 ఖరీఫ్ లో ఈ పంట మాకు గిట్టుబాటు గావటం లేదు అని వరి రైతులు సాగు సమ్మె చేసిన విషయం మనకు తెలిసినదే..
అందువలన కనీసం గోధుమతో సమానంగా నైనా వరి కనీస మద్దత్తు ధర ను కూడా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 2025-26 ఖరీఫ్ కు కనీస మద్దత్తు ధరలు ప్రకటించేసినందున ధాన్యానికి క్వింటాలుకు 200 రూ బోనస్ ఈ సంవత్సరానికి ప్రకటించవలసినదిగా కోరుచున్నాను..
పెరుగుతున్న కూలీల ఖర్చు, ఎరువుల ఖర్చు, పురుగుమందుల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ల కనుగుణం గా కనీస మద్దత్తు ధరలు పెరగక పోతే, ప్రకటించిన మద్దత్తు ధరలకు కొనుగోలు జరగక పోతే వ్యవసాయ రంగం మనుగడే ప్రస్నార్ధకం కానున్నది..
రైతు లాభ దాయకతే ప్రధానంగా రెండవ హరిత విప్లవం వైపు రైతు సంఘాలుగా మేము, శాస్త్ర వేత్తలు, ప్రజా ప్రతి నిధులు, మీడియా మిత్రులు, మేధావి వర్గాలు సీరియస్ గా ఆలోచించవలసిన సమయం వచ్చినది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిథులు స్పందించవలసినదిగా, అలానే ఈ డిమాండ్ కు సంపూర్ణ సహకారం అందించ వలసినదిగా మీడియా మిత్రులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
అలానే వరి పండించే ప్రధాన రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా ధాన్యమ్ ఉత్పత్తి లో దేశం లో రెండవ స్థానం లో ఉన్న తెలంగాణా రాష్ట్ర ప్రజా ప్రతి నిధులు అందరు స్పందించ వలసిన అవసరం ఉన్నది..

– ఎంవీఎస్ నాగిరెడ్డి, MSc,
YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం-రైతు సంక్షేమం),
వైస్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ (2019-24)
రైతుబంధు సభ్యులు (2011-14)
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR), New Delhi.
ఇవీ చదవండి: Paddy : వరి రైతుకు గిట్టుబాటు ధర ఏదీ? నెల్లూరు, సీమ రైతుల అగచాట్లు
Andhra Pradesh : సర్కారు ప్రకటనలేమో ఘనం.. క్షేత్రస్థాయిలో రైతు కంట కన్నీరే!
