Pakistan: ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టు వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. భారత్ మ్యాచ్ తర్వాత హ్యాండ్‌షేక్ ఇష్యూ ఐసీసీ వరకు వెళ్లగా, ఇప్పుడు తమ సొంత మాజీ క్రికెటర్ చేసిన ఆరోపణలతో పీసీబీ (PCB) మరోసారి ఇబ్బందుల్లో పడింది.
పాకిస్తాన్ మాజీ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ అతీక్-ఉజ్-జమాన్, ఆటగాళ్లు ధరిస్తున్న జెర్సీల నాణ్యత చాలా తక్కువ స్థాయిలో ఉందని సోషల్ మీడియాలో విమర్శించారు. దీనికి కారణం పీసీబీలో ఉన్న అవినీతి అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
అతీక్-ఉజ్-జమాన్ ఆరోపణలు
తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, “పాకిస్తాన్ ఆటగాళ్లు చెమటలు పట్టించేలా నాసిరకం జెర్సీలు ధరిస్తున్నారు. కానీ ఇతర దేశాల ఆటగాళ్లు డ్రై-ఫిట్ జెర్సీలు వేసుకుంటున్నారు. టెండర్లు నిపుణులకు కాకుండా స్నేహితులకు ఇస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఆటగాళ్లు చెమట కంటే అవినీతి ఎక్కువగా అనుభవిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. అలాగే, తక్కువ క్వాలిటీ జెర్సీలు ప్లేయర్ల ప్రదర్శనకే ఆటంకం కలిగిస్తాయని ఆయన చెప్పారు.
అతీక్-ఉజ్-జమాన్ ఎవరు?
అతీక్-ఉజ్-జమాన్ పాకిస్తాన్ తరపున ఒక టెస్ట్, మూడు వన్డేలు ఆడిన మాజీ క్రికెటర్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 69 మ్యాచ్‌లు ఆడి, 2521 పరుగులు, మూడు సెంచరీలు సాధించారు. ప్రస్తుతం జర్మనీ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నారు.
పాకిస్తాన్ వివాదాలు కొనసాగుతూనే
ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఆట కంటే వివాదాలతోనే ఎక్కువగా హైలైట్ అవుతోంది. భారత్ మ్యాచ్ తర్వాత హ్యాండ్‌షేక్ వివాదంపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పీసీబీకి ఎలాంటి మద్దతు రాలేదు. ఇదిలా ఉండగా, జెర్సీ క్వాలిటీపై మాజీ క్రికెటర్ చేసిన ఆరోపణలు పీసీబీకి కొత్త తలనొప్పిని తెచ్చాయి.
ఇవీ చదవండి: Jersey Sponsor : భారత్-పాక్ జెర్సీ డీల్‌లలో బ్రాండ్ విలువ తేడా తెలుసా?
IND vs PAK: సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం – పాక్ జట్టుతో హ్యాండ్‌షేక్‌కు నిరాకరణ
