Jersey Sponsor : భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికింది. ప్రముఖ టైర్ల సంస్థ అపోలో టైర్స్ రికార్డు స్థాయిలో బిడ్ వేసి ఈ డీల్‌ను గెలుచుకుంది. ఈ ఒప్పందం రూ. 579 కోట్లకు ఖరారైంది, ఇది వచ్చే రెండున్నర సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ వ్యవధిలో భారత జట్టు 121 ద్వైపాక్షిక మ్యాచ్‌లు, 21 మల్టీ-నేషన్ టోర్నమెంట్‌లలో ఆడనుంది. ప్రతి మ్యాచ్‌లో టీమ్ ఇండియా జెర్సీపై అపోలో టైర్స్ బ్రాండింగ్ కనిపించనుంది. దీంతో బీసీసీఐకు రికార్డు స్థాయి ఆదాయం రాబోతోంది.
పాకిస్తాన్ జెర్సీ స్పాన్సర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ పెప్సీ. అనేక సంవత్సరాలుగా పీసీబీ, పెప్సీ మధ్య సంబంధం కొనసాగుతోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 48 కోట్లుగా సమాచారం. అయితే ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. కానీ ఈ లెక్కలు చూస్తే భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల బ్రాండ్ విలువల్లో ఉన్న విపరీతమైన తేడా స్పష్టమవుతుంది.
జెర్సీ స్పాన్సర్ చరిత్ర
టీమ్ ఇండియా జెర్సీకి గతంలో అనేక కంపెనీలు స్పాన్సర్‌గా వ్యవహరించాయి. సహారా, స్టార్, ఓపో, బైజూస్, డ్రీమ్11 వంటి సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. మొదటగా ఐటీసీ లిమిటెడ్ 8 సంవత్సరాల పాటు స్పాన్సర్‌గా ఉండగా, 2001 నుండి 2013 వరకు సహారా, ఆ తర్వాత స్టార్ ఇండియా, ఓపో, బైజూస్, డ్రీమ్11 వరుసగా జట్టు జెర్సీకి స్పాన్సర్‌గా నిలిచాయి. తాజాగా ఈ జాబితాలో అపోలో టైర్స్ చేరింది. ఇదే మొదటిసారి ఒక టైర్ కంపెనీ భారత జట్టుతో భాగస్వామ్యం కావడం విశేషం.
ప్రతి మ్యాచ్‌కు కోట్ల రూపాయల ఆదాయం
అపోలో టైర్స్ – బీసీసీఐ ఒప్పందం ప్రకారం, బోర్డుకు ప్రతి మ్యాచ్‌కు సగటున రూ. 4.77 కోట్లు లభిస్తాయి. ద్వైపాక్షిక మ్యాచ్‌లలో రూ. 3.5 కోట్లు, ప్రపంచ కప్ మ్యాచ్‌లలో రూ. 1.5 కోట్లు బేస్ ధరగా నిర్ణయించారు. దీంతో రాబోయే రెండు సంవత్సరాల్లో బీసీసీఐకి జెర్సీ స్పాన్సర్‌షిప్ ద్వారా భారీ ఆదాయం వస్తుంది.
ఇవీ చదవండి: Apollo Tyres : టీమిండియా జెర్సీకి అపోలో టైర్స్.. డ్రీమ్11కు షాక్!
