Kamma Community : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై బీఆర్ఎస్ చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలో ప్రాబల్యం కలిగిన కమ్మ సామాజిక వర్గం ప్రజలు బీఆర్ఎస్‌కు దూరమవ్వడం ఆ పార్టీని కలవరపెడుతోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకొనేందుకే చంద్రబాబు మంచి సీఎం అంటూ కేటీఆర్ కొత్త పల్లవి ఎత్తుకున్నారనే వాదనలు వినిపిస్తున్నారు.
ముందు నుంచి కూడా కమ్మ సామాజిక వర్గంపై కేటీఆర్‌కు మంచి అభిప్రాయం లేదనే ప్రచారం ఇప్పటికీ పెద్ద ఎత్తున నడుస్తున్నది. దీనికి ప్రధానంగా కేటీఆర్ వ్యవహారశైలి కారణమని ఆ పార్టీ నేతలు చెబుతారు. ఈ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలపై కేటీఆర్ గతంలో అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారనే వాదన ఉంది. కమ్మ సామాజిక వర్గం నేతలపై కేటీఆర్‌కు ఉన్న వైఖరిపై ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఉదాహరిస్తున్నారు.
దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ సహా సెటిలర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో 7% ఓటర్లతో కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగానే ఉంది. ఇప్పటికే పార్టీకి దూరమైన ఈ వర్గం వారిని ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరిగి ఎలాగైన ప్రసన్నం చేసుకోవాలని కేటీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. అందుకే వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన చంద్రబాబు జపం చేశారనే చర్చ జోరందుకుంది. ఎన్నడూ చంద్రబాబు పేరెత్తడానికి ఇష్టపడి కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పుడు ఉపఎన్నికల వేళ ఆయన నామస్మరణ అందుకోవడానికి కమ్మ సామాజిక వర్గం బీఆర్ఎస్‌కు దూరమవ్వడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు, కేసీఆర్-కేటీఆర్ అహంకారపూరిత వైఖరితో అనేక వర్గాలు బీఆర్ఎస్‌కు దూరమైన పరిస్థితి. బీజేపీతో అంతర్గత పొత్తు ఉన్నదనే చర్చ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు మైనారిటీలు సైతం దూరమయ్యారనే చర్చ నడుస్తోంది. దీంతో తగిన ప్రాబల్యం కలిగిన కమ్మ సామాజిక వర్గం ఓటర్లనైనా తమ వైపు తిప్పుకోవడానికే కేటీఆర్‌కు ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబు గుర్తుకొచ్చారనే వాదన తెరపైకి వస్తోంది.
కమ్మ సామాజిక వర్గం బీఆర్ఎస్‌కు దూరమయ్యారనడానికి వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని పలువురు గుర్తు చేస్తున్నారు. పార్టీలో కలహాలకు, అభిప్రాయ భేదాలకు స్వస్తి పలకాలని, తాను నియోజకవర్గంలో పర్యటించడానికి ముందే పార్టీ నేతలు ఈ విషయాల్ని కొలిక్కి తీసుకురావాలని ఆదేశించడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గంపై కేటీఆర్‌కు ఉన్న వైఖరిని స్థానికులు ప్రశ్నిస్తారని, నిలదీస్తారని తెలిసే ఇప్పటి నుంచే వారిని శాంతింపజేయాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశామని నిత్యం డప్పుకొట్టుకొనే బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో డిపాజిట్ రాలేదనే విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి తప్పదనే విషయం కేటీఆర్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి: BRS : తెలంగాణను మరోసారి అవమానించిన బీఆర్ఎస్!
BRS Attack on Mahaa News : మహా న్యూస్ టీవీ ఆఫీస్‌పై దాడి.. హైదరాబాద్‌లో కలకలం
