BRS : తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ మరోసారి అవమానించింది. ఇప్పటికే పార్టీ పేరు నుంచి తెలంగాణను వదిలించుకొని బీఆర్ఎస్‌గా (BRS) మారిన గులాబీ పార్టీ.. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయించి తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవి కోసం పోటీపడుతున్న తెలంగాణ బిడ్డకు బాహాటంగా మద్దతు తెలిపాల్సిందిపోయి, ఎన్నికలను బహిష్కరించిన తీరుపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
ఇదంతా కూడా బీజేపీకి మేలు చేయడానికే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. తాము తప్ప తెలంగాణ బిడ్డలు ఇంకెవరూ పదవులు అనుభవించకూడదనే కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ఇదే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీతో ఉన్న లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఎన్డీయే అభ్యర్థికి గెలుపునకు బీఆర్ఎస్ పరోక్షంగా కృషి చేస్తోందని టీపీసీసీ నేతలు ఆరోపిస్తున్నారు.
రైతు కుటుంబంలో పుట్టిన తెలంగాణ బిడ్డ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఇప్పటికే పార్టీని కుటుంబ సంస్థగా మార్చేశారని, పార్టీలో ఇతరుల్ని ఎదగనివ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ బిడ్డ ఓటమికి పరోక్షంగా చేస్తున్న ప్రయత్నాలు సర్వత్రా విస్మయం కలిగిస్తున్నాయి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవేత్త. రంగారెడ్డి జిల్లా కందుకూరు దగ్గరలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన వ్యక్తి. రైతు కుటుంబంలో పుట్టి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు. ఇండియా కూటమి ఆయనను అభ్యర్థిగా ప్రకటించడం తెలంగాణకు గర్వకారణమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం “తోటి హైదరాబాదీ”గా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బాహాటంగా మద్దతు ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఆయన గెలుపునకు కృషి చేయాల్సిందిపోయి, ఎన్నికలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం తెలంగాణ పౌర సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. ఇంటి పార్టీ అని చెప్పుకుంటూ రాజకీయ పబ్బంగడుపుకుంటున్న బీఆర్ఎస్.. తెలంగాణ నుంచి ఒక వ్యక్తి అత్యున్నత పదవికి పోటీ పడుతుంటే గెలిపించాల్సింది పోయి, ఆయన ఓటమికి పరోక్షంగా కృషి చేస్తున్న తీరు తెలంగాణ సమాజాన్ని బాధిస్తోంది.
కేజ్రీవాల్‌కు ఉన్న విజ్ఞత, కేసీఆర్‌కు లేకపాయే:
ఇటీవల ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని నిర్ణయించడం గమనార్హం. నాలుగు రాష్ట్రాల్లో నేరుగా కాంగ్రెస్‌తో తలపడుతున్న ఆప్ లాంటి పార్టీ కూడా దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించింది. రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడుతున్న దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించాయి.
తెలుగు వారి గౌరవం పెరిగేలా అందరూ అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలవాలని, జాతీయ స్థాయిలో అత్యధికంగా మాట్లాడే భాషల జాబితాలో తెలుగు భాష రెండో స్థానంలో ఉన్నప్పుడు తెలుగువారు కూడా ఆ స్థాయిలో ఉండాలని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ బిడ్డ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోవడం తెలంగాణను ఘోరంగా అవమానించడమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయించడం ద్వారా తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపునకు కృషి చేయకపోవడం బీఆర్ఎస్ చారిత్రక తప్పిదం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: BJP on Kavitha : కవిత విషయంలో బీజేపీ అదే వ్యూహాన్ని అమలు చేస్తుందా..?
Kavitha : కవిత వ్యూహాత్మక ఎత్తుగడలు.. బీఆర్ఎస్‌కు మరింత నష్టం చేసేలా స్కెచ్..!
