YS Jagan PC : సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకోవడమేంటని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, యూరియా కోసం రైతుల కష్టాలు, సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభపై మాట్లాడారు. ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే..
ఎవరి కోసం ఈ పాలన?
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అన్న సందేహం కలుగుతోంది. ఎందుకంటే అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రొటీన్‌గా చేయాల్సిన బాధ్యతలు.. శాంతి భద్రతల పరిరక్షణ లేదు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, గొంతు నొక్కుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి లేదు. ఆర్థికంగా తిరోగమన పరిస్థితి. ప్రజలకు కనీసం అందుబాటులో ఉంచాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం.. మొత్తం ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి గురవుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ కనీస బాధ్యతలు. కానీ, దురదృష్టవశాత్తూ ఇక్కడ ప్రభుత్వంలో కనిపించడం లేదు. అందుకే అడుగుతున్నాం. ఇక్కడ పాలన ప్రజల కోసం సాగుతోందా? లేక దోపిడీదారుల కోసమా?
యూరియా కొరత.. అర్జీలు కూడా ఇవ్వొద్దా?
రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ స్కామ్‌లు చేస్తున్నారు. దాన్ని నిరసిస్తూ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ, వారి పక్షాన వారితో కలిసి ఆర్డీఓలకు అర్జీ ఇచ్చే కార్యక్రమం ‘అన్నదాత పోరు’ చేశారు. దాన్ని కూడా అడ్డుకుంటూ, పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేశారు.
యూరియా కోసం రైతులతో కలిసి ఆర్డీఓకు అర్జీలు ఇవ్వడం తప్పా? రైతుల తరపున మాట్లాడొద్దా? ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు. మీరు అవసరమైన ఎరువులు అందిస్తే, ఏ రైతు కూడా రోడ్డెక్కడు కదా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు స్కామ్‌లు చేశారు. అందుకే ఈ పరిస్థితి. ఏకంగా రెండు నెలల నుంచి రైతులు యూరియా కోసం నానా అగచాట్లు పడుతున్నారు. అది మీ దారుణ పాలనకు సాక్ష్యం కాదా?. మీ అవినీతి పాలనకు నిదర్శనం కాదా?
నాడు ఈ దుస్థితి లేదు
నేను ఒకటే అడుగుతున్నాను. ప్రజలంతా ఆలోచించాలి. మా పాలనలో 5 ఏళ్లలో ఎక్కడైనా, ఎప్పుడైనా రైతులు ఇలా ఎరువుల కోసం అగచాట్లు పడ్డారా? రోడ్డెక్కారా? మరి ఆ పరిస్థితి ఎందుకు రాలేదు? ఇప్పుడు చంద్రబాబు హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతోంది? అదీ ప్రభుత్వమే. ఇదీ ప్రభుత్వమే. అప్పుడు, ఇప్పుడూ ఆ అధికారులే ఉన్నారు.
ఇప్పటి పరిస్థితికి కారణం.. జగన్ అనే వ్యక్తికి రైతుల మీద ఆపేక్ష. వారికి మంచి చేయాలన్న తపన, తాపత్రయం. నాటి సీఎంకు, ఇప్పటి సీఎంకూ అదే తేడా. ఎరువుల సరఫరాలో కూడా స్కామ్ చేస్తున్నారు. అందుకే ఈ దుస్థితి. ఇందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి. రాష్ట్రంలో ఏటా సీజన్‌లో పంటల సాగు అంచనా వేసి, అవసరమైన ఎరువులపై లెక్కలు కడతారు కదా? మరి ఎరువులు ఎందుకు అందడం లేదు?
సీఎం నోట అసత్యాలు
ఇటీవలే సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారో చూడండి. ఈ ఖరీఫ్‌లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియ సరఫరా చేశామని, గత ఏడాదితో పోలిస్తే 97 వేల టన్నులు ఎక్కువ సరఫరా చేశామని చెప్పారు.
మరి చంద్రబాబు చెబుతున్నట్లుగా ఎరువులు అంది ఉంటే, రైతులు రోడ్కెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? వారికి యూరియా అందలేదు కాబట్టే, ఈ పరిస్థితి వచ్చింది కదా?. ఆర్బీకేలు, ఈ–క్రాప్ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. చివరకు పీఏసీలను కూడా నిర్వీర్యం చేసి, ఎరువులను వాటి ద్వారా కాకుండా ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చారు. మరోవైపు యూరియా దారి మళ్లించి, టీడీపీ నాయకులు తీసుకుపోయి, ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
యూరియా కొరత. రూ.250 కోట్ల స్కామ్
రాష్ట్రానికి వస్తున్న యూరియాను టీడీపీ నాయకులు దారి మళ్లించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులకు ఎక్కువగా ఇచ్చేశారు. వారు కొరత సృష్టించి బస్తాకు రూ.200 వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇలా బ్లాక్‌మార్కెట్‌లో ఎరువులు అమ్ముతూ దాదాపు రూ.250 కోట్ల వరకు స్కామ్ చేస్తున్నారు. రైతులను పీడించి, స్కామ్‌లు చేసి అందరూ పంచుకుంటున్నారు.
మా ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఎందుకు జరగలేదు. కారణం, అప్పుడు తప్పు చేయాలంటే భయపడేవారు. అదే ఈరోజు చంద్రబాబు దగ్గరుండి, స్కామ్‌లో భాగస్వామి అయి, ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడా చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు. ఎవరిపైనా చర్యలు ఉండవు. మా ప్రభుత్వంలో ప్రతి నెలా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాల్ కాన్ఫరెన్స్ ఉండేది. బ్లాక్ మార్కెట్‌పై చాలా గట్టిగా హెచ్చరించే వాళ్లం. ఈరోజు ఏకంగా సీఎం భాగస్వామి అయ్యాడు. అందుకే అంతా ‘దోచుకో. పంచుకో. తినుకో’.. ‘నాకింత. నీకింత’ అని రైతులను ఇబ్బంది పెడుతూ, స్కామ్‌లు చేస్తున్న వీరసలు మనుషులేనా?
చంద్రబాబుది అంతా తూతూ మంత్రం
నేను అడుగుతున్నా.. మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదు? కారణం.. ఆ రోజుల్లో ఒక భయముండేది. తప్పు చేయాలంటే భయ పడేవాళ్లు. ఈరోజు చంద్రబాబు డైరెక్టుగా భాగస్వామి అయ్యి దీన్ని ప్రోత్సహిస్తున్నాడు. పైపైన మాటలు మాట్లాడతారు. తూతూ మంత్రమే తప్ప.. ఎక్కడా తనిఖీలు ఉండవు. ఎక్కడా చిత్తశుద్ధితో ఎవరి మీదా చర్యలు ఉండవు. మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు, ఎస్పీలతో నెల నెలా వీడియో కాన్ఫరెన్స్ జరిగేది. ఎస్పీలు, కలెక్టర్లకు స్పష్టంగా చెప్పేవాళ్లం. బ్లాక్ మార్కెటింగ్ కనిపిస్తే మీ ఉద్యోగాలు పోతాయని.
అదే ఈరోజు ఏం జరుగుతోంది? దగ్గరుండి స్కాంలో మీరు కూడా భాగస్వాములయ్యారు. కాబట్టి విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ జరగనిస్తున్నారు. దానిపై ఏదో తూతూ మంత్రంగా మాట్లాడుతున్నారు. ఎక్కడా చిత్తశుద్ధి లేదు. ఎవరి మీదా చర్యలు ఉండవు. అంతా ‘దోచుకో పంచుకో తినుకో’. ‘నాకింత. నీకింత. ఇంకొకరికింత’. ‘సిస్టమేటిక్ పద్ధతుల్లో దోచుకోవడం. పంచుకోవడం. తినడం’. కంటికి కనబడుతూనే ఉంది.
రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులకు గురి చేస్తూ.. వారి జీవితాలతో చెలగాటమాడుతూ.. స్కాములు చేస్తున్న.. ఈ పెద్ద మనుషులు అసలు మనుషులేనా? అని అడుగుతున్నా.
గిట్టుబాటు ధరలూ లేవు
మరోవైపు ఏ పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కోకో, పొగాకు, మామిడి. ఏ పంటలకూ కూడా గిట్టుబాటు ధరలు లేవు. గత ఏడాది లేవు. ఇప్పుడూ అదే పరిస్థితి. ఇంకా ఉల్లి, టమోటా, చీనీ కాయల పరిస్థితి కూడా అదే.
ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. కానీ చంద్రబాబుగారు పట్టించుకుంటాడా అంటే లేదు.. తూతూ మంత్రంగా స్టేట్‌మెంట్ ఇస్తాడు. ముందు అసలు ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా నాయనా అంటే.. కాదంటాడు. రేట్లు బాగా ఉన్నాయంటాడు. రైతులు కేరింతలు కొడుతున్నారంటాడు. చివరకు ఒప్పుకోక తప్పదు అన్నప్పుడు.. మోసం చేసేందుకు తూతూ మంత్రంగా స్టేట్‌మెంట్ ఇస్తారు. ఆయనిచ్చిన ఆ స్టేట్‌మెంట్‌ను ఎల్లో మీడియాలో పెద్ద అక్షరాలతో అచ్చేస్తారు. అంతా తూతూ మంత్రమే.
ఏ రైతుకు సమస్యలు తీరవు. మిర్చి విషయంలోనూ అంతే. పొగాకు విషయంలోనూ అంతే. మామిడి విషయంలోనూ అంతే. చివరకు ఉల్లి విషయంలోనూ అంతే. అంతా తూతూ మంత్రమే. ఈరోజు ఉల్లి క్వింటాలు సగటు ధర రూ.200 నుంచి రూ.400 వరకు ఉంది. ధర అంత క్షీణించినా పట్టించుకునే నాథుడే లేదు. అదే ఉల్లి బహిరంగ మార్కెట్‌లో, ఒక ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థలో కిలో ఉల్లి ధర రూ.34 ఉంది.
అంటే అక్కడ మార్కెట్‌లో రైతులకు దక్కే ధర క్వింటాలుకు రూ.200 నుంచి రూ.400 వరకైతే, ఇక్కడ మార్కెట్‌లో అమ్మేది కిలో ఏకంగా రూ.34. అంటే క్వింటాలు «ఉల్లి ధర రూ.3,400. అంటే రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో చెప్పడానికి నిదర్శనాలు ఇవి.
అదే మా ప్రభుత్వ హయాంలో చూస్తే..
మా వైయస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కేజీ ఉల్లి రూ.40 నుంచి రూ.125కు తగ్గలేదు. ఒకసారి ఎక్కడో ఏదో జరిగితే, 9 వేల టన్నులు ప్రొక్యూర్ చేసి సరఫరా చేశాం. కోవిడ్ సంక్షోభంలో కూడా రైతులను ఆదుకున్నాం. చీనీ కాయల ధర ఈరోజు టన్ను రూ.7 వేల నుంచి గరిష్టంగా రూ.14 వేలు మాత్రమే. అదే వైయస్సార్ సీపీ హయాంలో… కనిష్ట ధర రూ.30 వేలు కాగా, గరిష్ట ధర ఏకంగా లక్ష రూపాయలు.
ఈ తేడాకు కారణం.. మా ప్రభుత్వంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మొత్తం రూ.7,802 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్‌లో జోక్యం చేసుకున్నాం. మార్కెట్‌లో పంటల ధరలు తగ్గితే వెంటనే «సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్) ద్వారా ప్రభుత్వం రంగంలోకి దిగి వాటిని కొనుగోలు చేసేది.
ఇప్పుడు అన్నీ నిర్వీర్యం. అంతా మోసం
నేడు ఆర్బీకేలు, ఈ–క్రాప్‌లు నిర్వీర్యం. రైతులకు ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్ ముగిసేలోగా ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. మేము క్రమం తప్పకుండా రైతు భరోసా ఇచ్చాం.
అదే ఈ ప్రభుత్వంలో.. ముందు ఏం చెప్పారు?. పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా, అన్నదాత సుఖీభవ అన్న పేరు పెట్టి రూ.20 వేలు ఇస్తామన్నారు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి.. రెండో ఏడాది కూడా కలుపుకుని రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. అదే కాకుండా 7 లక్షల రైతులకు ఎగ్గొట్టారు.
ఇలా చంద్రబాబుగారి హయాంలో అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారు. ఇబ్బంది పడుతున్నారు. అందుకు కారణం ఆయనకు చిత్తశుద్ధి లేదు. ప్రతి దాంట్లో దోచుకోవడమే ఆయన పని.
ప్రజారోగ్య రంగం
రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని కూడా చంద్రబాబు దారుణంగా దెబ్బ తీస్తున్నాడు. సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలు, బెల్లానికి అమ్ముకంటున్నారు. తన మనుషులకు దోచి పెడుతున్నారు.
ఆ ప్రైవేటీకరణ స్కామ్‌ల్లో పరాకాష్ట
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. తారాస్థాయికి చేరిన చంద్రబాబు అవినీతి, స్కామ్‌లకు పరాకాష్ట. నాది ఒక ప్రశ్న. ప్రజలు కూడా ఆలోచించాలి. అసలు ప్రభుత్వం స్కూళ్లు నడుపుతోంది? దాదాపు 45 వేల స్కూళ్లు. బస్సులను కూడా ప్రభుత్వం ఎందుకు నడుపుతోంది? ఎందుకంటే, ప్రభుత్వం వాటిని చేయకపోతే, పేదలు, మధ్యతరగతి ప్రజలు బ్రతకలేరు. ప్రైవేటు వారి ఛార్జీలను వారు తట్టుకోగలరా? అందుకే ఏ ప్రభుత్వమైనా వాటిని తన బాధ్యతగా చేస్తుంది. లేకపోతే ప్రైవేటు రంగం దోచేస్తుంది.
2019 వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 11. పద్మావతి వర్సిటీ కాలేజీ కూడా కలుపుకుంటే, వాటి సం«ఖ్య 12. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో కనీసం ఒక్కటంటే, ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? కనీసం ఆ ఆలోచన అయినా చేశాడా?.
ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం
అదే మా ప్రభుత్వం, కేవలం 5 ఏళ్ల అతికొద్ది కాలంలోనే, ప్రతి జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకురావాలని, ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని చూశాం. జిల్లాలు 13 నుంచి 26కు పెంచి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఒక జిల్లాలో మెడికల్ కాలేజీలో భాగస్వామ్యంగా టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటైతే, అక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఆ స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారు. ఒక మెడికల్ కాలేజీ అందుకు హబ్‌గా పని చేస్తూ, ఆ జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఒక గైడింగ్‌గా పని చేస్తుంది. మంచి వైద్యం ఉచితంగా అందుతుంది. దాంతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి ఆగిపోతుంది. ఎక్కువ ఫీజులు గుంజితే, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తారు. ఇంకా దాని వల్ల ప్రతి జిల్లాలో అదనంగా మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒకవైపు నాణ్యతతో కూడిన వైద్య విద్య, మరోవైపు ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వైద్య సేవలందుతాయి.
దీన్నే విజన్ అంటారు. ప్రజలకు ఏది అవసరం? ఏది ముఖ్యం? ఏది కచ్చితంగా చేయాలి? అనేది ఒక విజన్. మా హయాంలో 17 మెడికల్ కాలేజీల పనులు. ఒక్కో దానికి రూ.500 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కాలేజీని 50 ఎకరాల్లో చేపట్టాం. అన్ని హంగులతో వాటి నిర్మాణం చేపట్టాం. అవన్నీ అందుబాటులోకి వస్తే, వ్యాధులు వ్యాప్తి చెందితే, మంచి వైద్య సేవలు అందుతాయి. మెడికల్ సీట్లు పెరుగుతాయి. రెండేళ్లు కోవిడ్‌తో ఇబ్బంది పడినా వెనక్కు తగ్గలేదు.
చిత్తశుద్ధి చూపాం.. అందుకే..
అంత అంకితభావంతో పని చేశాం కాబట్టే.. 2023–24లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. తరగతులు కూడా మొదలయ్యాయి. అవే కాకుండా, గత ఏడాది ఎన్నికల నాటికి, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేశాం. అడ్మిషన్లకు సిద్ధం చేశాం. పులివెందుల కాలేజీని ప్రారంభించాం ఎన్నికలు ముగిశాక, పాడేరు మెడికల్ కాలేజీ కూడా సిద్ధమైంది. అంటే, మా హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలను పూర్తి చేశాం.
చంద్రబాబు దుర్మార్గం
చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ (జాతీయ వైద్య కమిషన్) 50 సీట్లు కేటాయించి, భర్తీ చేయడానికి అనుమతి ఇస్తే, ఆ సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాశాడు. అంత మంచి కాలేజీలో సీట్లు వద్దని చంద్రబాబు లేఖ రాశాడు. అలాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉంటాడా?. చంద్రబాబు అసలు మనిషా? లేక రాక్షసుడా? ఆలోచించండి.
అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే..
మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం, చంద్రబాబు కూడా చొరవ చూపి ఉంటే.. 2024–25లో మరో 4 కాలేజీలు.. అదోని, మదనపల్లె, మార్కాపురం, పిడుగురాళ్లలో క్లాస్‌లు మొదలై ఉండేవి. ఆ మేరకు నిర్మాణాలు కొనసాగించాం. గత ఏడాది మేం దిగిపోయే నాటికి ఆయా కాలేజీల పనులు ఏ దశలో ఉన్నాయో చూపాం. ఇంకా మా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే, మరో 6 మెడికల్ కాలేజీలు.. అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో మెడికల్ కాలేజీలు 2025–26 విద్యా సంవత్సరంలో మొదలై ఉండేవి. ఆ దిశలో పక్కా ప్రణాళిక ప్రకారం మేము పనులు చేశాం.
మెడికల్ సీట్లు పెరిగేవి:
మా ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న మెడికల్ సీట్లు 2360. కొత్త కాలేజీల ద్వారా మరో 2550 మెడికల్ సీట్లు పెరిగేవి. మొత్తం 4,910కి మెడికల్ సీట్లు చేరుకునేవి. మా హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీల ద్వారా 800 సీట్లు భర్తీ అయ్యాయి. వైద్య విద్యలో ఇది అద్భుత ఘట్టం. నాకు క్రెడిట్ వస్తుందని, దెబ్బ తీయడం, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత వరకు ధర్మం? ఇక్కడ మెడికల్ సీట్లు దొరక్క, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడెక్కడికో పంపిస్తున్నారు. జార్జియా, రష్యా వంటి దేశాలకు పంపిస్తున్నారు.
వాటి విలువ లక్ష కోట్లకు చేరుతుంది
ఆలోచన మాది. ఆచరణ మాది. భూముల సేకరణ మాది. నిధుల సమీకరణ మాది. అన్నీ రెడీ. అయినా చంద్రబాబునాయుడు వాటిని ఎందుకు ముందుకు తీసుకుపోవడం లేదు. మేం దిగిపోయే నాటికి దాదాపు రూ.3 వేల కోట్ల పనులు జరగ్గా, మిగిలిన రూ.5 వేల కోట్లకు కూడా నాబార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా కానీ, ఇతర సంస్థల ద్వారా నిధుల సమీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. మరి చంద్రబాబు రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టలేడా? దాని వల్ల ఎంత మందికి మేలు జరిగి ఉండేది.
ఒక మెడికల్ కాలేజీ లేదా వైద్య సంస్థ కట్టాలంటే ఎన్నేళ్లు పడుతుంది?. మంగళగిరిలో ఎయిమ్స్ కట్టడానికి ఎన్నేళ్లు పట్టిందో మనకు తెలియదా?. ఈ కొత్త కాలేజీల వల్ల భూమలు విలువ బాగా పెరిగింది. మొత్తం కాలేజీల విలువ కూడా పెరిగింది. భవిష్యత్తులో దాని విలువ లక్ష కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడబడతాయి. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి అరికట్టబడుతుంది. తక్కువ ఫీజులతో వైద్య సేవలు అందుతాయి.
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
చంద్రబాబునాయుడుగారి హయాంలో వైద్య రంగం పూర్తిగా నాశనం అయిపోతోంది. నాడు మా ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో 3,257 ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు వైద్యం వ్యయ పరిమితి. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారికి కూడా పథకాన్ని వర్తింప చేయడం వల్ల దాదాపు 95 శాతం కవర్ అయ్యారు.
ఆరోగ్యశ్రీ పథకం కోసం నెలకు రూ.300 కోట్లు కావాలి. 15 నెలలకు రూ.4500 కోట్లు కావాల్సి ఉంటే, చంద్రబాబు ఇచ్చింది రూ.600 కోట్లు మాత్రమే. దాంతో కార్పొరేట్ ఆస్పత్రులు పథకంలో వైద్యం చేయడం లేదు. ఇంకా మా హయాంలో అమలు చేసిన ఆరోగ్య ఆసరా పూర్తిగా ఎత్తేశారు.
ఇన్సూరెన్స్ పేరుతో మోసం
ఇన్ని చేసిన చంద్రబాబు, మరో మోసం కోసం డ్రామా చేస్తున్నాడు. కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకొచ్చాడు. దానిలో వైద్యం ఖర్చును కేవలం రూ.2.5 లక్షలకే పరిమితం చేయడంతో పాటు, ప్రొసీజర్లను 2500కు తగ్గించారు. అంటే ఖరీదైన క్యాన్సర్ ట్రీట్‌మెంట్ వంటి ప్రొసీజర్లు కట్ చేశారు ఆరోగ్యశ్రీకి ఏటా రూ.3600 కోట్లు ఖర్చు చేయడానికి మనసు రాని వ్యక్తి.. నిజంగానే రూ.25 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేయాలంటే ప్రీమియమ్ దాదాపు రూ.6 వేల కోట్లు అవుతుంది. ఇది మరో మోసం కాదా? విలేజ్ క్లినిక్స్ లేవు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవు. చివరకు దూది కూడా లేదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. నాడు–నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి.
ఇప్పుడు ప్రభుత్వ కొత్త కాలేజీల ప్రైవేటీకరిస్తున్నారు.
చంద్రబాబు వైద్య రంగాన్ని నాశనం చేసిన తీరుకు.. తురకపాలెం ఘటనలు ఒక ఉదాహరణ. 2 నెలల్లో 43 మంది చనిపోతే, ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితి. ఇది సీఎం ఇంటికి చాలా చేరువలోనే ఉంది. అయినా కనీసం గుర్తించలేదు. కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. వేగంగా నష్ట నివారణ చర్యలూ లేవు.
ఎన్నో చేశాం. కానీ చెప్పుకోలేకపోయాం
నిజంగా మా హయాంలో మేం చేసింది ఎక్కువ, చెప్పుకున్నది తక్కువ. మాకు చేత కాలేదు. మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మినెంట్ సొల్యూషన్ చూపించాం. దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు.
ఎస్వీ మెడికల్ కాలేజీలో బాలికల హాస్టల్.. కడప జీజీహెచ్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్.. కడపలో క్యాన్సర్ కేర్ సెంటర్.. రిమ్స్ జీజీహెచ్ కడపలో అండర్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచాం.. కర్నూలులో డయాగ్నొస్టిక్ బ్లాక్, యూజీ, పీజీ బాలికల హాస్టల్.. ట్రామా కేర్ బ్లాక్ ఎట్ కాకినాడ.. సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ విశాఖ ప్రభుత్వ ఆస్పత్రి.. సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ ఎట్ విజయవాడ.. పీజీ మెన్స్ హాస్టల్, ఎస్వీ మెడికల్ కాలేజీ ఎట్ తిరుపతి.. సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్, రీజనల్ డ్రగ్స్ స్టోర్ ఎట్ తిరుపతి.. బర్న్స్ వార్డు ఇన్ అనంతపురం హాస్పిటల్.. స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఎట్ కర్నూలు, రిమ్స్ జీజీహెచ్ శ్రీకాకుళం.. సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్ రీజనల్ డ్రగ్స్ స్టోర్ విశాఖపట్నం, బర్న్స్ వార్డు జీజీహెచ్ కర్నూలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు.. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ఇంకా పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్స్ కూడా ఉన్నాయి.
మేం చేసింది మేం చెప్పుకోవడం చేతకాదు. అదే ప్రాబ్లమ్. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, తిరుపతిలో ఛైల్డ్ పీడియాట్రిక్ సెంటర్, ఐటీడీఏ పరిధిలో కట్టిన ఆస్పత్రులు వంటివి చాలా ఉన్నాయి.
‘సూపర్‌హిట్’ పేరుతో సంబరాలు
చంద్రబాబుకు ఉన్న నైపుణ్యం. కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం. అది ఆయనకు మాత్రమే తెలుసు. ఒకవైపు పథకాల అమలు లేదు. మరోవైపు మోసం. అయినా సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అంటూ వేడుక. ఇది అట్టర్‌ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవం చేసినట్లు ఉంది. చంద్రబాబు అబద్దాలు, మోసాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. ఒకసారి చూడండి.
ఇవి అమలు చేయకుండా చంద్రబాబు మోసాలు
20 లక్షల యువతకు ఉపాధి అవకాశాలు. నెలకు రూ.3 వేల నిరుద్యోగభృతి. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు. ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500. ఇంకా 50 ఏళ్లకే పెన్షన్.
మరి ఈరోజు ఇచ్చిన ప్రకటన చూస్తే..
ఈ ప్రకటనలో ఆడబిడ్డ నిధి ప్రస్తావన లేదు. అంటే నెలకు రూ.1500 ఇవ్వడం లేదు. అలాగే నిరుద్యోగ భృతి లేదు. ఇంకా 50 ఏళ్లకే పెన్షన్ ప్రస్తావన లేదు. వాటి స్థానంలో 204 క్యాంటీన్ల ప్రస్తావన.
ఇవన్నీ మోసాలు కాదా?
ఇప్పుడు నేను అడుగుతున్నాను. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా?. ఆడబిడ్డ నిధి కింద రెండేళ్లకు రూ.36 వేలు బాకీ. ఈరోజు అనంతపురంలో సూపర్‌హిట్ పేరుతో సభ పెట్టావు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అవి ఇవ్వనప్పుడు అది మోసం కాదా? అది నీ సూపర్‌సిక్స్ హామీ కాదా? 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.4 వేలు. ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇది మోసం కాదా?
పెన్షన్ల సంఖ్య గత ఏడాది మార్చి నాటికి 66,34,742 ఉంటే, ఈనెలలో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,864. అంటే దాదాపు 5 లక్షలు కోత. ఇది మోసం కాదా?. ఇంకా రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోవాలన్నా మహిళలకు ఫ్రీ అన్నావు. కానీ పరిమిత బస్సుల్లోనే అనుమతి. ఇది మోసం కాదా?. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. కానీ గత ఏడాది ఒక్కటే ఇచ్చావు. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అంటే 6 సిలిండర్లకు గానూ, కేవలం ఒక్కటే ఇవ్వడం మోసం కాదా?.
పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నావు. అలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?. తల్లికి వందనం కింద రెండేళ్లకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, 30 లక్షల మందికి ఎగ్గొట్టి కేవలం రూ.13 వేలు మాత్రమే, ఇంకా చాలా మందికి రూ.8 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?.
ఇంకా గత ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దు చేయడం మోసం కాదా? చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు, ఉచిత పంటల బీమా, విద్యాదీవెన, వసతిదీవెన, పిల్లలకు ట్యాబ్‌లు రద్దు చేశావు. ఇది మోసం కాదా? చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, ఆయన చేసిన మోసంతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. ఆయన సూపర్‌హిట్ పేరుతో బలవంతపు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇది దారుణం.
రికార్డు స్థాయిలో అప్పు. అదెక్కడికి పోతోంది?
నేను ఒక్కటే అడుగుతున్నాను. 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఎవరి జేబులోకి పోతోంది ఆ మొత్తం. ఇది రాష్ట్ర చరిత్రలోనే లేదు. 2014లో రాష్ట్రం విడిపోయేనాటికి గ్యారెంటీడ్, నాన్ గ్యారెంటీడ్‌తో కలిపి మొత్తం అప్పులు రూ.1,40,717 కోట్లు. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఆ అప్పు ఏకంగా రూ.3,90,247 కోట్లకు చేరింది. అంటే ఏటా అప్పుల సగటు పెరుగుదల (సీఏజీఆర్) 22.63 శాతం.
ఇక మా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు రూ.3,90,247 కోట్లు కాగా, గత ఏడాది మేము దిగిపోయే నాటికి ఆ మొత్తం రూ.7,21,918 కోట్లు. అంటే మా హయాంలో ఏటా అప్పుల సగటు పెరుగుదల (సీఏజీఆర్) 13.57 శాతం మాత్రమే. మా ప్రభుత్వ హయాంలో ఆ 5 ఏళ్లలో మేము చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం, చంద్రబాబు కేవలం ఈ 15 నెలల్లోనే చేశారు.
ఎక్కడికక్కడ యథేచ్ఛ దోపిడి
ఈ ప్రభుత్వంలో ఇసుక, మట్టి దోచేస్తున్నారు. ఇసుక ఉచితం లేనే లేదు. లిక్కర్ మాఫియా. పర్మిట్‌రూంలు, బెల్టు షాప్‌లు విచ్చలవిడిగా. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. ఇంకా సిలికా, క్వార్ట్›్జ దోపిడి.
అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. అదో దోపిడి. నిజానికి చదరపు అడుగుకు రూ.4500తో బెంగళూరు వంటి నగరంలో కూడా లగ్జరీ నిర్మాణం చేయొచ్చు. ఇంకా శనక్కాయలు, బెల్లానికి ఇష్టం వచ్చినట్లుగా.. ఉర్సా, లులూకు భూముల కేటాయింపు చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది. మరోవైపు మీ ఆదాయం, మీ అనుయాయుల సంపద పెరుగుతోంది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం
స్కామ్‌ల్లో పరాకాష్ట. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దీన్ని గట్టిగా అడ్డుకుంటాం. నిరసనలు, ర్యాలీలు చేస్తాం. నేనూ అక్కడక్కడా పాల్గొంటా. రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరిని, పార్టీని కోరుతున్నా. అందరూ కలిసి రండి. కొత్త మెడికల్ కాలేజీలు మన సంపద. రాష్ట్ర సంపద. అందరం కలిసి పోరాడుదాం. వాటిని కాపాడుకుంటాం. అయినా ఆ ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరిస్తే, రేపు మా ప్రభుత్వం రాగానే, అన్నీ రద్దు చేస్తాం. కాలేజీలు వెనక్కు తీసుకుంటాం.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
ఎన్నికల్లో అక్రమాలకు ఈవీఎంలు పరిష్కారం కాదు. లోకల్ బాడీ ఎన్నికల్లో. మొన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం. యూరియా కొరత. రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. అసలు ప్రభుత్వానికి ప్రణాళిక ఉందా? పంటచేలకు ఎన్నిసార్లు, ఎంత యూరియా వేస్తారో తెలియదు.
అసెంబ్లీలో మాకు ఇంత సమయం ఇస్తేనే, ప్రజా సమస్యలు ప్రస్తావించగలుగుతాం. లేదు, మీ సంఖ్యకు తగినట్లు కొంత సమయమే ఇస్తామంటే ఎలా మాట్లాడగలం. ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావించగలం? ఈ అసెంబ్లీలో ఉన్నది ఒకటే ప్రతిపక్షం. అది మాదే. అయినా మాకు ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. ఆయనకు అది ఇష్టం లేదు. అందుకు కారణం ప్రజల సమస్యలు కనిపించొద్దు. ప్రజల గొంతు వినిపించొద్దు అనేదే ఆయన ఉద్దేశం. మాకు ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించడం లేదన్న దానిపై హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. దానికి ఇప్పటికీ స్పీకర్ సమాధానం చెప్పడం లేదు.
తురకపాలెంలో వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం ఏ విషయమూ స్పష్టంగా చెప్పడం లేదు. నేను ఎక్కడికైనా వెళ్తానంటే, అర్ధంలేని విమర్శలు చేస్తున్నారు. నిందలు వేస్తున్నారు. అందుకే అక్కడ, ఏం జరిగిందనేది స్పష్టంగా తేలితే, నేను వెళ్తాను.
సోషల్ మీడియా అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. అది పూర్తిగా కేంద్రం పరి«ధిలో ఉంది. కాబట్టి, దానికి సంబంధించి చట్టం సాధ్యం కాదు. నిజానికి ఆ అంశంలో గతంలో కేంద్రం ఒక సవరణ చేసినా, కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది అందరి హక్కు అనేది సుస్పష్టం.’’ అని జగన్ ప్రెస్ మీట్ ముగించారు.
ఇవీ చదవండి: Medical Colleges : సంపద సృష్టి అంటే పప్పూబెల్లాల్లా దోచుకోవడమా? : జగన్
YS Jagan : చంద్రబాబు రైతులను గాలికి వదిలేశారు: జగన్
