HomeTelanganaBC Reservations : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై అధిష్టాన పెద్ద‌ల‌తో చ‌ర్చించిన‌ బీజేపీ నేత‌లు?

BC Reservations : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై అధిష్టాన పెద్ద‌ల‌తో చ‌ర్చించిన‌ బీజేపీ నేత‌లు?

BC Reservations : తెలంగాణ రాష్ట్ర‌ బీజేపీ నేత‌లు అధిష్టానం పెద్ద‌ల ముందు బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఉపరాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీలు, ఇత‌ర ముఖ్యనేత‌లు అధిష్టాన పెద్ద‌ల‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా ఈ అంశంపైనే ప్ర‌ధానంగా చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. బీసీల‌కు విద్య‌, ఉపాధి, రాజ‌కీయ రంగాల్లో 42% రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న‌కు ఉద్దేశించిన రెండు బిల్లులు, ఆర్డినెన్స్‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెచ్చిన విష‌యం తెలిసిందే. వీటిని నెల‌ల త‌ర‌బ‌డి రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద పెండింగ్‌లో ఉంచ‌డం వ‌ల్ల క్షేత్ర స్థాయిలో బీజేపీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌నే విష‌యాన్ని రాష్ట్ర పార్టీ నేత‌లు వివ‌రించిన‌ట్టు స‌మాచారం. (BC Reservatoins)

బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లులు ఆమోదం పొంద‌కుండా బీజేపీ అడ్డుకుంటోంద‌నే భావ‌న‌ ప్ర‌జ‌ల్లో వేగంగా వ్యాపిస్తోంద‌ని, గ్రామ‌గ్రామాన దీనిపై చ‌ర్చ జ‌ర‌గుతోంద‌ని వివ‌రించిన‌ట్టు స‌మాచారం. దీనికితోడు బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ ఆమోదం కోసం గ‌త ఆగ‌స్టు 6న ఢిల్లీ వేదిక‌గా కాంగ్రెస్ చేప‌ట్టిన ధ‌ర్నా సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా బీజేపీ అడ్డుప‌డింద‌నే చ‌ర్చ జోరందుకుంద‌ని వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ల అమ‌లు విష‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ప్ర‌క‌టించిన‌ కామారెడ్డి డిక్ల‌రేష‌న్ మేర‌కు గ‌త‌ మార్చి 17, 18 తేదీల్లో అసెంబ్లీ, కౌన్సిల్‌లో బిల్లులు ఆమోదించి పంపిద‌ని వివ‌రించిన‌ట్టు స‌మాచారం. వీటిని రాష్ట్ర‌ప‌తి ఆమోదించ‌క‌పోవ‌డంతో రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకు ఆర్డినెన్స్ జారీ చేసిందని, అవి కూడా ఆమోదం పొంద‌క‌పోవ‌డంతో రాష్ట్ర పంచాయ‌తీరాజ్ చ‌ట్టం- 2018, మున్సిప‌ల్ చ‌ట్టం- 2019కి ఆగ‌స్టు 31న‌ స‌వ‌ర‌ణ‌లు చేసింద‌ని అధిష్టానానికి బీజేపీ నేత‌లు వివ‌రించిన‌ట్టు ఢిల్లీ మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. రిజ‌ర్వేష‌న్ల అమ‌లు కోసం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏ అవ‌కాశాన్ని వ‌ద‌ల‌డం లేద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డుతోంద‌ని, ఈ విష‌యంలో బీజేపీ ఇరుకున ప‌డుతోంద‌ని వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది.

మ‌న వాద‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు..!
బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో బీజేపీ అనుస‌రిస్తున్న వైఖ‌రికి క్షేత్ర స్థాయిలో ఆశించిన‌ మ‌ద్ద‌తు ద‌క్క‌డం లేద‌ని రాష్ట్ర పార్టీ నేత‌లు వివ‌రించిన‌ట్టు స‌మాచారం. బీసీ రిజ‌ర్వేష‌న్ల పేరుతో ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తున్నార‌ని చేస్తున్న ప్రచారానికి ఆద‌ర‌ణ కొర‌వ‌డింద‌ని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వెనుబ‌డిన ముస్లిం కులాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయ‌న్న‌ వాస్త‌వ‌మే దీనికి కార‌ణ‌మ‌ని గుర్తు చేసిన‌ట్టు తెలుస్తోంది. వెనుక‌బ‌డిన ముస్లిం కులాల‌ను చ‌ట్ట‌ప్ర‌కారం ఓబీసీ జాబితాలో చేర్చే వెసులుబాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉండ‌డంతో ఈ విష‌యంలో బీజేపీ చేసిన ఆరోపణ‌లు నిల‌వ‌డం లేద‌ని వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

కాంగ్రెస్ కామారెడ్డి స‌భ‌పై బీజేపీ అధిష్టానం ఆరా!
ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించ‌ త‌ల‌పెట్టిన కామ‌రెడ్డి స‌భ‌పై బీజేపీ అధిష్టానం ఆరా తీసిన‌ట్టు తెలుస్తోంది. రెండు ల‌క్ష‌ల మందితో కాంగ్రెస్ ఈ స‌భ‌ను త‌ల‌పెట్టింద‌ని, బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న‌కు ఇప్ప‌టిదాకా చేసిన కృషిని ఈ స‌భ ద్వారా యావ‌త్తు తెలంగాణ‌ స‌మాజానికి కాంగ్రెస్‌ చాటిచెప్పే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

రాష్ట్రంలో బీఆర్ఎస్‌ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతుండ‌డంతో, కాంగ్రెస్‌ ఈ స‌భను ప్ర‌ధానంగా బీజేపీ ల‌క్ష్యంగా త‌ల‌పెట్టింద‌ని వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది. బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లుల‌ను ఆమోదింకుండా బీజేపీ అడ్డుప‌డుతోంద‌నే వాద‌న‌ను మ‌రింత బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే ప్ర‌య‌త్నాల్లో భాగంగా కాంగ్రెస్ ఈ స‌భ‌ నిర్వ‌హిస్తోంద‌ని బీజేపీ అధిష్టాన పెద్ద‌ల‌కు రాష్ట్ర నేత‌లు వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

ఇవీ చదవండి: MLC Kavitha : హరీష్‌రావు, సంతోష్‌ల వల్లే.. కవిత సంచలనం
BJP on Kavitha : క‌విత విష‌యంలో బీజేపీ అదే వ్యూహాన్ని అమ‌లు చేస్తుందా..?
BRS : తెలంగాణ‌ను మ‌రోసారి అవ‌మానించిన బీఆర్ఎస్‌!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు