Largest Residential Building : చైనాలోని హాంగ్‌జౌలో ఉన్న ఓ అద్భుత భవనం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ‘రీజెంట్ ఇంటర్నేషనల్’ పేరుతో ఉన్న ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనంగా గుర్తింపు పొందింది. దీని ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే నిజంగానే ఆశ్చర్యపోతారు. (Largest Residential Building)
దాదాపు 1.47 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ భవనం మొత్తం 39 అంతస్తులు కలిగి ఉంది. ఇక్కడ ఏకంగా 20,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఈ భవనం లోపలే సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, స్కూల్, స్విమ్మింగ్ పూల్, ఫుడ్ కోర్ట్, ఇంటర్నెట్ కేఫ్, బ్యూటీ సలోన్లు వరకు అన్నీ ఉన్నాయి. అంటే, ఇక్కడ నివసించే వారికి బయటకు వెళ్లాల్సిన అవసరం చాలా తక్కువ. అందుకే దీనిని ‘స్వయం సమృద్ధి పట్టణం’ అని కూడా పిలుస్తారు.
ఒకే భవనంలో చిన్న ప్రపంచం
ఈ భవనంలోని ప్రతి అంతస్తు విభిన్న జీవనశైలికి ప్రతిబింబం. యువ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వృద్ధ జంటలు—అందరూ ఇక్కడే కలిసి జీవిస్తున్నారు. అద్దెలు కూడా విభిన్నంగా ఉంటాయి. కిటికీలు లేని చిన్న అపార్ట్‌మెంట్ అద్దె సుమారు 1,500 RMB (రూ.17,000) ఉంటే, బాల్కనీ, విశాల స్థలంతో ఉన్న పెద్ద ఫ్లాట్‌కి 4,000 RMB (రూ.45,000 పైగా) చెల్లించాలి.
నిర్మాణంలో ప్రత్యేకత
ఈ భారీ నిర్మాణం S-ఆకారంలో ఉండటం దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. అంతేకాకుండా భవనాన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దారు. స్మార్ట్ డిజైన్, ఆధునిక సదుపాయాలతో నిలువుగా జీవించడం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో ఈ ప్రాజెక్ట్ చూపిస్తోంది.
ప్రస్తుతం ఈ భవనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇవీ చదవండి: International Tiger Day : అంతర్జాతీయ పులుల దినోత్సవం.. బెబ్బులి పవర్!
Hindu Population: దేశంలో తగ్గిపోతున్న హిందూ జనాభా.. పెరిగిన ఇతర మతాల సెన్సస్!
India Census : వృద్ధులు పెరుగుతున్నారు.. పిల్లలు తగ్గుతున్నారు!
