Small Car : ఎస్‌యూవీల దుమ్ము ధూళిలో చిన్న కార్ల డిమాండ్ తగ్గిపోతున్న తరుణంలో, జీఎస్‌టీ రేటు తగ్గింపు మళ్లీ ఎంట్రీ లెవల్ కార్ల మార్కెట్‌కు ఊపును తీసుకురానుందనే నమ్మకం ఆటోమొబైల్ రంగంలో వ్యక్తమవుతోంది. (Small Car)
ధరలు తగ్గనున్నాయి
ప్రస్తుతం వాహనాలపై 28% జీఎస్‌టీ వసూలు చేస్తుంటే, దాన్ని 18%కి తగ్గించారు. దీని ఫలితంగా చిన్న కార్ల ధర సుమారు రూ. 1 లక్ష వరకు తగ్గనుంది. దీంతో మధ్యతరగతి, మొదటిసారి వాహనం కొనుగోలు చేసే వారికి ఇవి మరింత చేరువ కానున్నాయి.
విక్రయాల పెరుగుదలపై ఆశలు
2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో చిన్న కార్ల వాటా 31%గా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్యలో అది 27%కి పడిపోయింది. కొత్త జీఎస్‌టీ రేట్లతో మళ్లీ డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గ్రాంట్ థార్న్‌టన్ భారత్ భాగస్వామి సాకేత్ మెహ్రా మాట్లాడుతూ, “రేటు తగ్గింపు వల్ల వినియోగదారులకు రూ.1 లక్ష వరకు ఆదా అవుతుంది. పండుగ సీజన్‌లో అమ్మకాలు బాగా పెరుగుతాయి. మధ్య, విలాస కార్లపై కూడా ధరలు తగ్గుతాయి” అని అభిప్రాయపడ్డారు.
పరిశ్రమ నుంచి స్పందనలు
సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర – “వాహనాలు మరింత చౌకగా మారతాయి. మధ్యతరగతి కుటుంబాలు, కొత్తగా వాహనం కొనాలనుకునే వారికి ఇది బహు మేలైన నిర్ణయం.”
ఫాడా అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ – “జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవి. వాహన ధరలు అందుబాటులోకి వస్తాయి, డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది.”
టయోటా కిర్లోస్కర్ డీఎండీ స్వప్నేష్ – “చిన్న కార్లపై రేటు తగ్గించడం వల్ల సామాన్యులకు వాహనాలు చేరువ అవుతాయి.”
బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో హర్‌దీప్ సింగ్ బ్రార్ – “ప్రీమియం కార్లపై సెస్సు లేకుండా 40% జీఎస్‌టీ అమలు చేయడం విక్రయాలను పెంచుతుంది.”
ఆనంద్ మహీంద్రా సందేశం
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ – “ఈ సంస్కరణలు వినియోగం, పెట్టుబడులను పెంచుతాయి. భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలపరుస్తాయి. స్వామి వివేకానంద చెప్పినట్టు – ‘లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి’ అనే సందేశాన్ని మనం గుర్తుంచుకోవాలి.”
ఇవీ చదవండి: Fahadh Faasil: ఫెరారీ కారు కొన్న షెకావత్.. ధర ఎంత? గ్యారేజ్‌లో ఎన్నికార్లో!
