Trump on India : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు. ‘‘భారత్ అత్యధిక టారిఫ్‌లతో అమెరికాను చంపేస్తోంది’’ అంటూ మండిపడ్డారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియా, చైనా, బ్రెజిల్‌లు భారీ సుంకాలు విధిస్తున్నాయంటూ ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు వసూలు చేసే దేశం భారత్ అని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. Trump on India
స్కాట్ జెన్సింగ్స్ రేడియో షోలో మాట్లాడిన ట్రంప్.. ‘‘ఇకపై టారిఫ్‌లు విధించబోమని భారత్ మాటిచ్చింది. కానీ అది నేను అమెరికా ఉత్పత్తులపై సుంకాలు భారీగా పెంచిన తర్వాతే సాధ్యమైంది. లేకుంటే అలాంటి ఆఫర్ వచ్చేది కాదు’’ అని వ్యాఖ్యానించారు.
భారత్–అమెరికా వాణిజ్యం “ఏకపక్షం”
వైట్‌హౌస్ నుంచి మీడియాతో మాట్లాడుతూ ట్రంప్.. ‘‘భారత్‌తో మాకున్న ఆర్థిక బంధం సంవత్సరాలుగా ఏకపక్షంగానే ఉంది. ఇండియా మా ఉత్పత్తులపై వందశాతం సుంకాలు వేసింది. అందుకే ఇండియా దిగుమతులను ఆపేశాం. కానీ అమెరికాలో మాత్రం వారికి ఎలాంటి అడ్డంకులు లేవు. వారి ఉత్పత్తులు సులభంగా విక్రయమవుతున్నాయి. దీంతో అమెరికా తయారీదారులకు నష్టం తప్పింది లేదు’’ అని అన్నారు.
హార్లీ–డేవిడ్సన్ ఉదాహరణ
‘‘హార్లీ–డేవిడ్సన్ బైక్‌లపై ఇండియా 200% సుంకం వేసింది. దాంతో ఆ కంపెనీ భారత్‌లోనే ప్లాంట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విధానాలే అమెరికా కంపెనీలను విదేశాలకు నెడుతున్నాయి. అందుకే నేను అధికారంలోకి రాగానే ఈ అన్యాయ వాణిజ్య విధానాలను ఎదుర్కొన్నా’’ అని ట్రంప్ తెలిపారు.
అమెరికా వైపు కంపెనీల రాక
‘‘మా కొత్త వాణిజ్య విధానాలతో అనేక కార్ల కంపెనీలు, ఏఐ సంస్థలు అమెరికాలో ప్లాంట్లు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో విదేశీ దిగుమతులు తగ్గి దేశీయ ఉత్పత్తి పెరుగుతోంది. సుంకాల మోత తప్పి కంపెనీలకూ లాభమవుతోంది’’ అని ఆయన వివరించారు.
“ఏడు యుద్ధాలు ఆపేశా”
ట్రంప్ తన పాత వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ.. ‘‘నా టారిఫ్ విధానాల వల్ల అమెరికా ఆర్థికంగా బలపడింది. అంతేకాదు, ఏడు యుద్ధాలను పరిష్కరించాను. అమెరికా లేకపోతే ప్రపంచం ముందుకు కదలదు’’ అని గర్వంగా అన్నారు.
ఆరోగ్యంపై వదంతులు
ఇటీవలి కాలంలో వచ్చిన తన అనారోగ్య వార్తలపై ట్రంప్ స్పందించారు. ‘‘నా మరణం గురించిన పుకార్లు విన్నా. అవన్నీ వదంతులే. నేను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నా. ఇంతకుముందెన్నడూ లేనంత బలంగా ఉన్నాను’’ అని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: Donald Trump : నేను చచ్చిపోయానా? ట్రంప్ రియాక్షన్ చూడండి!
Trump : కథ అడ్డం తిరిగిందా? భారత్ చర్యలతో ట్రంప్ రూటెటు?
