HomeAndhra PradeshVallabhaneni Vamsi : 4 నెలల జైలు జీవితానికి తెర.. వల్లభనేని వంశీకి భారీ ఊరట

Vallabhaneni Vamsi : 4 నెలల జైలు జీవితానికి తెర.. వల్లభనేని వంశీకి భారీ ఊరట

Vallabhaneni Vamsi : వైయస్సార్ సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi)కి ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది. సుమారు నాలుగు నెలల సుదీర్ఘ రిమాండ్ ఖైదీ జీవితానికి తెర పడింది. ఆయన విడుదలకు సుప్రీంకోర్టులో మార్గం సుగమమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంశీపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయించి వేధించారని వైయస్సార్ సీపీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయనపై కేసుల మీద కేసులు బుక్ చేసి, ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరో కేసు బనాయిస్తున్నారని విమర్శించింది.

వల్లభనేని వంశీకి బెయిల్ ఇస్తూ హైకోర్టులో తీర్పు రావడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు వంశీ బెయిల్ రద్దు చేయాలని సుంకర సీతామహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

ఇక మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వం పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. ఇప్పటికే అనేక కేసుల్లో వంశీని అరెస్టు చేశారు కదా? అని ఏపీ ప్రభుత్వాన్ని అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. బెయిల్ రద్దు చేసేందుకు ధర్మాసనం ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

మైనింగ్ వాల్యూయేషన్ పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా.. తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని సుప్రీంకోర్టుకు తెలిపారు. రూ.195 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని లూత్రా తెలిపారు.

సీల్డ్ కవర్లో నివేదిక ఇస్తామని సిద్ధార్థ లూత్ర పేర్కొన్నారు. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా పడింది. మైనింగ్ కేసులో జస్టిస్ ఎం.ఎం .సుందరేష్, జస్టిస్ వినోద్ చంద్రన్ విచారణ జరిపారు.

వంశీపై కక్ష సాధింపులు : వైయస్సార్ సీపీ
గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందనే కేసులో వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టారని వైయస్సార్ సీపీ ఆరోపిస్తోంది. ‘‘సత్యవర్థన్‌ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో పని చేస్తున్నాడు. ఆ వ్యక్తి సాక్షాత్తూ తానే న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని అందులో ఆయన చెప్పినప్పటికీ తప్పుడు కేసు బనాయించారు. 2023 ఫిబ్రవరి 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీని చంద్రబాబు బూతులు తిట్టించారు. మర్నాడు కూడా తిట్టించాడు. మనుషులను వెంటబెట్టుకుని పట్టాభి ప్రదర్శనగా వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ వద్దకు చేరుకుని అక్కడ శీనయ్య అనే దళిత సర్పంచ్‌పై దాడి చేశారు.

దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావుపైనా వారు దాడి చేయడంతో ఆయన తల పగిలింది. ఘర్షణలో పోలీసులు ఇరువైపుల వారిపై కేసులు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌పై దాడికి ప్రయత్నించిన టీడీపీ నేతలు మూడు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. అయితే వాటిలో ఎక్కడా వంశీ పేరు లేదు. కారణం.. ఆ ఘటన జరిగినప్పుడు వంశీ అక్కడ లేరు. అది జరిగిన రెండు రోజుల తర్వాత సత్యవర్ధన్ ను పిలిపించి తెల్లకాగితంపై సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు.

దాని ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అందులోనూ వంశీ పేరు లేదు. 2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్థన్‌ నుంచి 161 స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అందులోనూ వంశీ పేరు, ప్రసావన లేదు. 2024 జూలై 10న ఆ కేసును రీ ఓపెన్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇదే సత్యవర్థన్‌తో రెండోసారి 161 స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. అయితే అందులో కూడా తనను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ లేడని ఆయన స్పష్టంగా చెప్పాడు. అయినా ఈ కేసులో వంశీని 71వ నిందితుడిగా చేర్చి, ఎట్టి పరిస్థితుల్లో వంశీకి బెయిల్ రాకూడదని గన్నవరం టీడీపీ ఆఫీస్ ను తగలబెట్టే ప్రయత్నం చేశారని మరో తప్పుడు కేసు నమోదు చేశారు.’’ అని మాజీ సీఎం జగన్ ఇటీవల మీడియా సమావేశం సందర్భంగా వివరించారు.

ఇవీ చదవండి: YS Jagan Press Meet : ప్రశ్నిస్తే ఇంత అసహనమా? చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
Junior NTR Flex: జూనియర్‌ను డైరెక్ట్‌గానే టార్గెట్‌ చేసిన చంద్రబాబు? బాలయ్య చేష్టలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఏంటంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు