Purandeswari Amaravati : రాజధాని అమరావతి పనుల పున: ప్రారంభోత్సవ కార్యక్రమం తాజాగా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భారీ జనసందోహం మధ్య లాంఛనంగా పనులను పున: ప్రారంభించారు ప్రధాని మోదీ. అయితే, ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari Amaravati) గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.
రాజధాని పనుల పున: ప్రారంభ కార్యక్రమం ఈనెల 2న అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇంకా బీజేపీ తరఫున కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వేదికను అలంకరించారు. టీడీపీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరయ్యారు.
గత ఐదేళ్లలో అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు మళ్లీ పురుడు పోసుకుందంటూ నేతలు మాట్లాడారు. ప్రధాని మోదీ సైతం ఈ సభలో మాట్లాడుతూ గత పదేళ్లుగా అమరావతికి సహాయం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ లు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో అమరావతిలో విధ్వంసం జరిగిందన్నారు.
అయితే, ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు వరకు కూటమి పార్టీలు కలవడంలో అన్నీతానై వ్యవహరించిన పురందేశ్వరి.. ఇప్పుడు అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి ఎందుకు రాలేదన్న ప్రశ్న ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో గుసగుసలాడుకుంటున్నారు.
కొన్నాళ్లుగా బీజేపీలో పురందేశ్వరి మాట చెల్లుబాటు కాలేదన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల వైయస్సార్ సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి స్థానంలో తనవర్గానికి చెందిన వారికి ఆ పదవి దక్కించుకోవాలని అటు సీఎం చంద్రబాబు, ఇటు పురందేశ్వరి విశ్వప్రయత్నాలు చేశారని పొలిటికల్ సర్కిళ్లలో గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలో మందకృష్ణ మాదిగ పేరు, తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు, మరికొందరి పేర్లు వినిపించాయి. విజయసాయిరెడ్డే బీజేపీలో చేరి మరోసారి ఎంపీ అవుతారన్న టాక్ కూడా వినిపించింది. ఈ క్రమంలో పురందేశ్వరి చెప్పిన మాటకు ఢిల్లీలో ఆలకించేవారు కరువయ్యారంటూ గుసగుసలు వినిపించాయి.
అంతకు ముందు కూడా ఒరిజినల్ బీజేపీ నేతలకు కాకుండా టీడీపీతో సన్నిహితంగా మెలిగే వారికి, టీడీపీ, జనసేన నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలకు పదవులు, నామినేటెడ్ పోస్టులు దక్కేలా పురందేశ్వరి పావులు కదుపుతున్నారని, ఈ విషయాలన్నీ ఢిల్లీ బీజేపీ పెద్దలు నచ్చలేదనే చర్చ నడుస్తోంది. దీంతో అధిష్టానం తనను పట్టించుకోనందున పురందేశ్వరి గుర్రుగా ఉన్నట్లు పొలిటిల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొనడం లేదని, అసంతృప్తి కారణంగానే ప్రతిష్టాత్మక అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి ఆమె గైర్హాజరైనట్లు అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతల్లో చర్చ నడుస్తోంది.
ఇవీ చదవండి: Modi Amaravati : అమరావతిలో మోదీ ప్రసంగం.. వాహ్ వా.. వాహ్ వా!
Amaravathi Works: ప్రధాని మోదీ అమరావతి పర్యటన.. రాజధానిలో ఆసక్తికర వాతావరణం!
