Medical news: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త మెడికల్ కాలేజీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు, నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలపై కౌన్సిల్‌లో మంత్రి సత్యకుమార్ చేసిన ఆరోపణలు, విమర్శలపై ఆ శాఖ మాజీ మంత్రి విడదల రజని మంగళవారం గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. (Medical news) మంత్రి ఆరోపణలు, విమర్శలకు ఆమె ధీటుగా బదులిచ్చారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి విడదల రజని ఏమన్నారంటే..:
మూడు విడతల్లో 17 మెడికల్ కాలేజీలు:
– రూ.8,500 కోట్ల వ్యయంతో ఒకేసారి 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రక్రియను తీసుకొచ్చిన ఘనత జగన్ ది. ఒక్కో కాలేజీకి రూ.500 కోట్లు వ్యయం చేస్తూ మూడు విడతల్లో కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.
– తొలి విడతలో 2023–24 లో విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాలలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి, ఒక్కో కాలేజీకి 150 సీట్ల చొప్పను మొత్తం 750 సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చాం.
– రెండో విడతలో అదోని, పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి మెడికల్ కాలేజీలు మొదలుపెట్టాం.
అవి ఈ ఏడాది ప్రారంభించాల్సి ఉందంటూ.. వాటి నిర్మాణానికి సంబంధించి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల ఫోటోలు చూపారు.
ఆయా కాలేజీల హాస్పిటల్స్, కాలేజీ బ్లాక్‌లు, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టళ్ల భవనాల ఫోటోలు చూపారు.
జగన్ కి క్రెడిట్ రావొద్దనే..:
– మా ప్రభుత్వ హయాంలో అంత వేగంగా పనులు కొనసాగినా, మంత్రి సత్యకుమార్ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారు. పనులు ఎలాగూ ఆపేయాలని చూస్తున్నారు కాబట్టి, కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారనిపిస్తోంది.
– అంతే కాకుండా ముందుగా నిర్దేశించుకున్నట్లు కొత్త మెడికల్ కాలేజీలు మొదలైతే, ఆ క్రెడిట్ మొత్తం జగన్ కి వస్తుందన్న ఆలోచనతో, మంత్రి ఈ విమర్శలు చేస్తున్నారని భావిస్తున్నాం.
– హాస్టళ్లు కట్టలేదు కాబట్టి మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రాలేదని మండలిలో మంత్రి తప్పుడు ప్రకటన చేశారు. నిజానికి పులివెందుల మెడికల్ కాలేజీలో ఈ ఏడాది కొత్తగా 50 సీట్లకు అనుమతి ఇస్తూ, జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ప్రభుత్వానికి లేఖ రాస్తే, తాము అవి నిర్వహించలేమంటూ, ప్రభుత్వం రిప్లై రాసింది.
– దీంతో ఆగస్టు 16న పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇంత ఘోరమైన పని ఏ ప్రభుత్వం చేయదు. కానీ కూటమి ప్రభుత్వం చేసింది.
కేవలం జగన్ మీద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారు.
ప్రైవేటీకరణ కుట్ర:
– కొత్త మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేయాలన్న కుట్రతోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
– నిజానికి ఇప్పుడు జగనన్న ఉండి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన ఈ 5 మెడికల్ కాలేజీలు పూర్తయి ఉండేవని ప్రజలే అంటున్నారు.
– అందుకే కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగంగా పూర్తి చేసి, మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.
కేంద్ర సాయం నామమాత్రం:
– కొత్త మెడికల్ కాలేజీల్లో పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలకు మాత్రమే రూ.194 కోట్ల చొప్పున కేంద్రం సహాయం అందిస్తోంది. మిగిలిన మొత్తం బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసి నిర్మించాం.
– దశల వారీగా ఏయే కాలేజీలకు ఎంత ఖర్చు చేయాలో ఆ మేరకు కేటాయింపులు చేశాం. ఆ విధంగానే మొదటి దశలో 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి, వాటిలో సీట్లు అందుబాటులోకి తెచ్చి నిరూపించాం.
వైద్య ఆరోగ్య రంగం నిర్వీర్యం:
– రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లోనే వైద్య ఆరోగ్య రంగం నిర్వీర్యం అయింది. నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో, అవి వైద్యానికి నిరాకరిస్తున్నాయి. ఆరోగ్య ఆసరా లేదు. ఫ్యామిలీ డాక్టర్లు లేరు, మెడికల్ కాలేజీలు లేవు. 108, 104 సర్వీసులు మూలన పడ్డాయి. ఆ సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు.
ఇంకా నాడు–నేడు పనులకు మంగళం పాడారు.
– వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108, 104 అంబులెన్స్‌లను, ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేశారు. అలాంటి వాటి కోసం మరో రెండడుగులు ముందుకేసి 976 కొత్త వాహనాలు కొనుగోలు చేశాం.
– మా ప్రభుత్వ హయాంలో 104 సర్వీస్ వాహనాలు 531 నుంచి 768కి పెంచడం జరిగింది. అత్యాధునిక వసతులు, టెక్నాలజీతో వాటిని తీర్చిదద్దాం.
– ఫోన్ చేసిన 15 నిమిషాల్లో వాహనం వెళ్లేది. ఈరోజు గంటలు గడిచినా వాహనాలు వెళ్లడం లేదు.
– బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడాలన్న లక్ష్యంతో గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేకమైన 108, 104 వాహనాలను కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చాం.
– అలాంటి సర్వీసులపై మంత్రి సత్యకుమార్ అసత్య ఆరోపణలు చేశారు. బాధితులకు మంచి చేసే ఆలోచన పక్కన పెట్టి, వాటి నిర్వహణ బాధ్యత వేరే సంస్థకు అప్పగించేందుకే మంత్రి ఆ ఆరోపణలు చేశారన్న అనుమానం కలగుతోందని మాజీ మంత్రి విడదల రజని తెలిపారు.
ఇవీ చదవండి: Medical Recruitment AP: 185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టుల పోస్టులకు వాకిన్ రిక్రూట్మెంట్
AP Medical News: ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి వాకిన్ రిక్రూట్‌మెంట్
Vizag: రైల్లో అసౌకర్యం.. విశాఖ ప్రయాణికుడికి రూ.30 వేలు చెల్లించాలని ఆదేశం
