AP Congress: విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ (AP Congress) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపడ్డారు.
‘‘కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. 5 నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. అత్యంత దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపుతున్నారు. ఇప్పటికే రూ.6 వేల కోట్ల భారం మోపారు. ఇది చాలదు అన్నట్లు ఇంకో రూ.11వేల కోట్లు సిద్ధం చేశారు. మొత్తం రూ.17 వేలకోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారు. ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు గారు?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలపై ఎన్నో హామీలు ఇచ్చారు. వైసీపీ 9 సార్లు ఛార్జీలు పెంచిందని గగ్గోలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదంటూ ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలో వచ్చాకా మాట మార్చారు. మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ? ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా ? జగన్ మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో రూ.35 వేల కోట్లు భారం మోపితే… మీ 5 నెలల పాలనలో రూ.17 వేల కోట్లు భారమా ? ఇది న్యాయమా చంద్రబాబు ? విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి అన్నారు. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి.
గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపుతారా ? చంద్రబాబు గారూ కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. సెంట్రల్ ERC మీ చేతుల్లోనే ఉంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చి విద్యుత్ బిల్లులు మీరే చెల్లించండి. బీజేపీకి గత 10 ఏళ్లుగా ఊడిగం చేస్తున్నారు కదా. బీజేపీకి మద్దతు ఇచ్చిన మీరు నిధులు తేవాలి కదా. ప్రజల నెత్తిన విద్యుత్ భారం వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. వెంటనే సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి.
సూపర్ సిక్స్ అమలులో ఫెయిల్
ఇప్పటికే సూపర్ సిక్స్ అమలులో ఫెయిల్ అయ్యారు. సంక్షేమ పథకాలు అని చెప్పి… ఒక చేత్తో ఇస్తున్నారు. మరో చేత్తో వసూలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు.. ఇచ్చేది రూ.2,500..వసూలు చేసేది రూ.6వేల కోట్లు. ఇచ్చేది పావలా… వసూలు చేసేది రూపాయి. తప్పు చేశారు కాబట్టే ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారు. రూ.35 వేల కోట్ల భారం వేశారు కాబట్టే వైసీపీని ఘోరంగా ఓడించారు. వైసీపీ చేసింది పాపం అయితే… కూటమి పెడుతున్నది శాపం. వైసీపీకి కూటమికి తేడానే లేదు.’’ అని షర్మిల పేర్కొన్నారు.
ఇవీ చదవండి: Sharmila: సాయిరెడ్డికి షర్మిల కౌంటర్.. మీ బిడ్డలపై ప్రమాణం చేయగలరా?
YS Sharmila: షర్మిల కంట తడి.. అన్నపై హాట్ కామెంట్స్.. దౌర్భాగ్యుడు, శాడిస్ట్ అంటూ… పూర్తి ప్రసంగం ఇదీ
Sharmila: కరెంటు చార్జీల భారం ఉపసంహరించుకోవాలి
Jagan and Sharmila: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు
