Las Vegas: దైనందిన పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. లాస్ వేగాస్ (Las Vegas) లోని ఐటీ సర్వ్ అలయెన్స్ సినర్జీ సదస్సుకు హాజరయ్యారు.
ఫైర్ సైడ్ చాట్ లో పారిశ్రామికవేత్త రవి తొట్టెంపూడి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. 23దేశాల నుంచి 2,300 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 1992లో విడుదల చేసిన ఒక జీవో కారణంగా ఇంటర్మీడియట్ లో దివ్వాంగులు కేవలం 5 సబ్జెక్టుల్లో మాత్రమే పరీక్షలు రాసే విధానం వల్ల ఇటీవల రాష్ట్రానికి చెందిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
నీట్‌లో ప్రతిభ కనబర్చిన దివ్యాంగులు ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారని లోకేష్ తెలిపారు. వెంటనే అధికార యంత్రాంగాన్ని కదిలించి కొత్తగా ఉత్తర్వులు రిలీజ్ చేయడంతో వారికి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు లభించాయన్నారు. అధికారులు చొరవ చూపకపోతే వారి పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు. గవర్నెన్స్ లో ఇటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఏఐని వినియోగించాలని భావిస్తున్నామన్నారు. గవర్నెన్స్, ఎడ్యుకేషన్, హెల్డ్ కేర్ తదితర రంగాల్లో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
అభివృద్ధిలో పోటీపడతాం
‘‘రానున్న రోజుల్లో భారత్‌లో డాటా విప్లవం రాబోతోంది. డాటాసేవల రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు దేశంలోకి రాబోతున్నాయి. అందులో వంద బిలియన్ డాలర్లను ఎపికి రప్పించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఇతరరాష్ట్రాలతో కాకుండా ఇతర దేశాలతో పోటీపడతాం.
సవాళ్లను అవకాశాలు తీసుకుని పనిచేయడం మాకు అలవాటైంది. ఇటీవల కృష్ణానదికి గత 248 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా వరదల వచ్చాయి. ఆ సమయంలో వ్యవసాయానికి వాడే డ్రోన్లను వరదబాధితులకు సాయం అందించేందుకు ఉపయోగించాం. తమ ప్రయత్నం విజయవంతం కావడంతో డ్రోన్ల ద్వారా వివిధ రంగాల్లో సేవలు అందించడంపై దృష్టి సారించాం. ఇటీవల విజయవాడలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ లో 5 గిన్నెస్ రికార్డులు రావడం ఆనందంగా ఉంది.
ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రత్యేక డ్రోన్ పాలసీ తెచ్చాం. ఎఐ వినియోగంతో పాలనా పరమైన సమస్యలను అధిగమించడానికి త్వరలో రాష్ట్రంలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటుచేయబోతున్నాం. ఇది అంతర్జాతీయస్థాయి నిపుణలను తయారుచేస్తుంది.
అభివృద్ది వికేంద్రీకరణ
అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేస్తున్నాం. విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. త్వరలో అక్కడ టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. పారిశ్రామీకరణ నేపథ్యంలో వ్యవసాయరంగం దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయ పెట్టుబడులు, ఉత్పాదకతకు మధ్య పొంతన లేకపోవడంతో గిట్టుబాటు సమస్య ఏర్పడుతోంది. రాయలసీమలో బంగారం పండే భూములున్నాయి.
నేను పాదయాత్ర నిర్వహించే సమయంలో మామిడి, అరటి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు పండించే రైతులు నన్ను కలిసి పలు సమస్యలను తెలియజేశారు. అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న రకాలను సాగుచేయాల్సిందిగా నేను వారికి సూచించాను. ఒక్కొకసారి కిలో 10పైసలకు కూడా టమోటా రైతులు తమ పంటను తెగనమ్ముకోవడం చూసి బాధ కలిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం, మార్కెట్ ఇంటర్వెన్షన్ తో రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు మేం కృషిచేస్తున్నాం. 2017లో ఐటీ సర్వ్ సదస్సుకు వచ్చాను. మళ్లీ ఇదే సదస్సుకు హాజరై మిత్రులను కలవడం ఆనందంగా ఉంది.’’ అని మంత్రి లోకేష్ చెప్పారు.
ఇవీ చదవండి: Nara Lokesh with Satya Nadella: సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ.. ఏం మాట్లాడారంటే
Nara Lokesh in USA: ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఆహ్వానం
Nara Lokesh: ఏఐ చాన్సుల వినియోగం.. వేగంగా ఏపీ అభివృద్ధి
Nara Lokesh: 43వ రోజు ప్రజా దర్బార్.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
