Vasireddy Padma: స్వలాభం కోసం పార్టీని వీడిన వాసిరెడ్డి పద్మ, ఇప్పుడు జగన్ పై బురద చల్లడం ఎంత వరకు సబబు అని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఉన్నత పదవులు అనుభవించిన వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma), రాజకీయ ప్రయోజనాల కోసం ఆత్మవంచన చేసుకోవద్దని ఆమె హితవు చెప్పారు.
క్యాబినెట్ హోదాతో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పని చేసిన వాసిరెడ్డి పద్మ.. ఇటీవల ఒక నియోజకవర్గాన్ని అడిగారని, అది ప్రస్తుతానికి వీలు కాదని చెప్పడంతో, ఆమె పార్టీని వీడారని ఎమ్మెల్సీ చెప్పారు.
రాజకీయాలు చేయడానికి మహిళలే దొరికారా? అని వాసిరెడ్డి పద్మ అంటున్నారన్న వరుదు కళ్యాణి, కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మీద దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే వారి పక్షాన నిలబడి న్యాయం చేయాలని చూడటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజకీయం చేయడమా? బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం రాజకీయమా?. అని నిలదీశారు.
‘మీ సొంత రాజకీయ ఎజెండాతో జగన్ పై బురద జల్లడం ఎంత వరకు సమంజసం? పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్ద పదవులు అనుభవించిన మీరు నైతిక విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదం’ అని చురకలంటించారు.
దిశ గురించి గతంలో మాటలకు, ఇప్పటి మాటలు ఎంత భిన్నంగా ఉన్నాయో చూసుకోవాలని, ఎవరి ప్రోద్భలంతో విమర్శలు చేస్తున్నారో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని, స్వలాభం కోసం ఆత్మవంచన చేసుకోవద్దని హితవు చెప్పారు. మహిళల రక్షణ, భద్రత కోసం ఇంతగా పోరాడుతున్న జగన్ పై బురద చల్లడం సమంజసం కాదని, దాన్ని ఎవ్వరూ హర్షించరని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు.
కాగా, వైయస్సార్ సీపీకి వాసిరెడ్డి పద్మ గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాజీనామాను మాజీ సీఎం జగన్ కు పంపారు. పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ ‘గుడ్ బుక్’, ప్రమోషన్లు అంటున్నారన్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “ గుండె బుక్ ” అని పేర్కొన్నారు. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదని, జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్.. ‘గుడ్ బుక్’ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
పార్టీని నడిపించడంలో జగన్ కు బాధ్యత లేదన్నారు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదన్నారు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని దుయ్యబట్టారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందన్నారు.
వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశానన్నారు. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మథనం చెంది వైయస్సార్ సీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఇవీ చదవండి: Varudu Kalyani: పోలీస్ ఫ్యామిలీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?
Varudu Kalyani: రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ కరువు
Andhra Political News: యాసిడ్ బాధితురాలికీ పరిహారం ఇవ్వని చంద్రబాబు
Tenali Crime News: తెనాలిలో బాధిత యువతి పరిస్థితి విషమం
Guntur Crime: దాష్టీకానికి మరో అమ్మాయి బలి… తెనాలి యువతి కన్నుమూత
