Venkaiah Naidu: అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయ భవన పనులతో రాజధాని నిర్మాణానికి తిరిగి శ్రీకారం చుట్టడం సంతోషించదగిన, ఆహ్వానించదగిన అంశమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన మంత్రివర్గానికి, అధికారులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఇది అమరావతి పునర్నిర్మాణం కంటే అమరావతి పునరుజ్జీవంగా తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
’’రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని నేను ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నాను. అసెంబ్లీ, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల కార్యాలయాలు, కోర్టు భవనాలు… ఇలా అన్నీ ఒకే చోట ఏర్పాటు చేయటం ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేయటం మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నది నా ఉద్దేశం. అదే మార్గంలో పదేళ్ల క్రితం అమరావతికి శ్రీకారం చుట్టిన సందర్భం చారిత్రకం. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులతో కలిసి ప్రజా రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం మరువలేనిది.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న నేను రాజధాని లేకుండా ఏర్పడిన కొత్త రాష్ట్రం అభివృద్ధిని ఆకాంక్షించి అమరావతి పట్టణ మౌళిక సదుపాయ కల్పనకు రూ.1000 కోట్లు కేటాయించాను. అదే సమయంలో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమరావతిలో కోర్ కేపిటల్ నిర్మాణానికి 2018 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. అంతకంటే ముందు అంటే 2017 బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి స్వచ్ఛంగా భూములు ఇవ్వటానికి ముందుకు వచ్చిన రాజధాని రైతుల భూములకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపులు ఇచ్చేలా చొరవ తీసుకున్నాను.
కారణాలు ఏవైనా గత ఐదేళ్లలో రాజధాని విషయంలో సందిగ్ధతలు, ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోవటం వంటివి ఒకింత బాధ కలిగించాయి. అయితే ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణానికి మార్గం సుగమం కావటం, కేంద్ర ప్రభుత్వం సైతం తిరిగి సహకారం అందించేందుకు ముందుకు రావటం ఆనందదాయకం. ఈ సందర్భంలో అమరావతి రైతుల పట్టుదలను ప్రశంసించకుండా ఉండలేము. పట్టు వదలకుండా, బెదరకుండా, అణచివేతలను ఎదుర్కొంటూ అమరావతి రైతులు సాగించిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. భవిష్యత్ తరాల అభివృద్ధి దిశగా వారి త్యాగాలు చిరస్మరణీయం.
ఈ సందర్భంగా అమరావతి కోసం సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణం త్వరితగతిన పూర్తై, ప్రజలకు అందుబాటులోకి రావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దేశానికి ఆదర్శంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: AP Cheap Liquor: రూ.99 మద్యం కాంట్రాక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
CBN in Party Meeting: ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: సీఎం చంద్రబాబు
CBN on YSRCP: జగన్ నిర్ణయాలపై చంద్రబాబు ఆగ్రహం.. కేబినెట్ తర్వాత ఏమన్నారంటే..
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!
Andhra News: చంద్రబాబు అలా మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది!
