T10 Cricket: టీ20 క్రికెట్ లో సంచలనాలు నమోదు కావడం మామూలు విషయమే. అయితే, టీ10 క్రికెట్ అంటే ఇంకెంత మజా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా టీ10 క్రికెట్ టోర్నీలో ఓ సంచలనం నమోదైంది. జిమ్ ఆఫ్రో లీగ్-2024లో స్కాట్లాండ్ బ్యాటర్ జార్జ్ మున్సే రికార్డు సెంచరీ చేశాడు. సుడిగాలి బ్యాటింగ్ తో శతక్కొట్టుడు కొట్టాడు.
డర్బన్ వోల్వ్స్‌తో జరిగిన టీ10 టోర్నీలోని ఓ మ్యాచ్‌లో మున్సే (హరారే బోల్ట్స్) 38 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఈ సెంచరీలె 6 ఫోర్లు, 10 సిక్సర్లు బాదేశాడు. జిమ్ ఆఫ్రో లీగ్ చరిత్రలో ఇదే తొలి సెంచరీ, తక్కువ బంతుల్లో సెంచరీ కావడం విశేషం.
మున్సే శతక్కొట్టి రెచ్చిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హరారే బోల్ట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోరు చేసింది. బోల్ట్స్ ఇన్నింగ్స్‌లో మున్సే సెంచరీ తర్వాత ఎక్స్‌ట్రాల రూపంలో (29) పరుగులు ఇచ్చుకున్నారు. జనిష్క పెరీరా 24, లహీరు మిలంత 13, దసున్ షనక 7 రన్స్ రాబట్టారు. వోల్వ్స్ బౌలర్లలో దౌలత్ జద్రాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
174 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన వోల్వ్స్.. ఏ దశలో గెలుపు దిశగా స్కోర్ బోర్డు కదల్లేదు. ఆ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 116 పరుగులకే చతికిలబడింది. 54 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. కొలిన్ మున్రో (32), షర్జీల్ ఖాన్ (25), విల్ స్మీడ్ (16), ఇన్నోసెంట్ కాలా (16), రిచ్‌మండ్ ముతుంబామి (15) మాత్రమే స్కోర్ బోర్డును కదిలించారు.
