Pothina Mahesh: రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రూ.4 కోట్ల అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని వైయస్సార్‌సీపీ నాయకుడు పోతిన మహేష్ ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న తన బినామీకి ఆలయ పార్కింగ్, టోల్ కాంట్రాక్టు కట్టబెట్టారని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే దుర్గమ్మ ఆలయంలో బుద్ధా వెంకన్న పెత్తనం పెరిగిపోయిందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆలయ అధికారులను బెదిరించి ఆయన అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. మరోవైపు ఆలయ అధికారులు కూడా బుద్దా వెంకన్నకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆలయ ఈఓ, దేవాదాయ కమిషనర్.. ఇద్దరూ నిబంధనలు కాలరాసి ఆయన బినామీ అయిన మహేష్‌కు కాంట్రాక్ట్ కట్టబెట్టారన్నారు.
గత ఏడాది జూన్‌లో ఆలయం పార్కింగ్, టోల్‌ఫీజు కాంట్రాక్ట్‌ను రూ.1.87 కోట్లకు అప్పగించారని, నిబంధనల ప్రకారం రెండో ఏడాది పొడిగించాలంటే కాంట్రాక్ట్ మొత్తాన్ని 10 శాతం పెంచడంతో పాటు, ఆ డబ్బులు కూడా నెల ముందుగానే చెల్లించాల్సి ఉంటుందని పోతిన మహేష్ గుర్తు చేశారు. అయితే అవన్నీ తుంగలో తొక్కిన దేవాదాయ కమిషనర్ కాంట్రాక్ట్‌ను పొడిగిస్తూ, ఈనెల 9న ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. అంతే కాకుండా ఆరు నెలల పాటు ఆలయానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండానే పార్కింగ్, టోల్ వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారని తెలిపారు.
మరోవైపు ఆలయ ఆవరణలో కొత్త నిర్మాణం నేపథ్యంలో మరో వైపునకు మార్చిన 24 షాపుల విషయంలోనూ అవినీతి చోటు చేసుకుందన్నారు. ఒక్కో షాప్‌కు రూ.1.06 లక్షల అద్దె చెల్లిస్తుండగా, వాటిని మార్చడం వల్ల నష్టపోయారన్న సాకు చూపి, అద్దె 40 శాతం తగ్గించడంతో పాటు, అగ్రిమెంట్‌ను మూడేళ్లు పొడిగించారని, ఇది కూడా నిబంధనలకు విరుద్ధమన్నారు. ఒక్కో షాపు నుంచి బుద్ధా వెంకన్న రూ.5 లక్షల చొప్పున వసూలు చేశారని ఆరోపణలున్నాయన్నారు.
గతంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, ప్రతి పథకాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అమలు చేస్తే, టీడీపీ ప్రభుత్వం యథేచ్ఛగా దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అమలు చేస్తోందని పోతిన మహేష్ విమర్శించారు. ఆలయ అన్నదానంలో వినియోగించే స్టీల్ టేబుళ్ల సేకరణలో కూడా నిబంధనలు పట్టించుకోకుండా, బుద్దా వెంకన్న బినామీకే కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపారు. రూ.1.35 కోట్ల విలువైన మరో కాంట్రాక్ట్‌ను టెండర్ పిలవకుండానే నామినేషన్ విధానంలో ఇచ్చారని దుయ్యబట్టారు.
Read also: Seediri Appalaraju: మెడికల్ సీట్లు వదులుకోవడం దారుణం: సీదిరి అప్పలరాజు
Lifestyle: మనిషి రోజుకు ఎన్ని గంటలు నిల్చుకోవాలి? కూర్చోవాలి?
Liquor: అత్యంత కిక్కు ఇచ్చే లిక్కర్ ఏదో తెలుసా?
Koneti Adimulam: కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో ట్విస్ట్
YSRCP: వైయస్సార్ సీపీ నేతలకు సుప్రీం కోర్టులో ఊరట
