Pawan Kalyan: ఏపీలో ఈరోజు గ్రామ సభలు నిర్వహించారు. రికార్డు స్థాయిలో కూటమి ప్రభుత్వం ఒకే రోజు 13,326 గ్రామ సభలను నిర్వహించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలో నిర్వహించిన గ్రామ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు పవన్.
ప్రగతితో ‘స్వర్ణ పంచాయతీ’ సాకారం కావాలని పవన్ తెలిపారు. మన గ్రామంలో ఏం చేసుకోవాలి.. ఏ పనులు పూర్తి కావాలి.. ఎలా పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకోవాలి? అనే ఆలోచన ఆయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి ఉండాలన్నారు. గ్రామ సభల్లో గ్రామానికి అవసరం అయ్యే పనుల మీద గ్రామస్తులంతా సమగ్రంగా చర్చించాలన్నారు. అంతా ఒక్కటిగా తీర్మానాలు చేసుకొని గ్రామ అభివృద్ధిని, ప్రగతికి ముందుకు నడిపించే చైతన్యం ఉన్నప్పుడే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తాయయన్నారు.
స్వర్ణ పంచాయతీలుగా మారి సంపన్న ఆర్థిక, అభివృద్ధి ప్రగతి సాధించేలా పటిష్టమైన ప్రణాళికను గ్రామస్తులే రూపొందించుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. గ్రామ పంచాయతీ మొదటి పౌరుడు అయిన సర్పంచులకు విశిష్టమైన శక్తి, అధికారాలు ఉన్నాయని, దానిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ప్రతి గ్రామం రాలేగావ్ సిద్ధిగా మారుతుందని అభిలషించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామపంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరువారి పల్లె గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
పంచాయతీలో రూ.38.46 లక్షలతో చేయాల్సిన 43 రకాల పనులు గురించి తీర్మానాలను చేశారు. గ్రామస్తులు ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఎవరు పోటీలో నిలబడలేని, ప్రతికూల పరిస్థితులను ఎదిరించి ఓ ఆర్మీ జవాన్ భార్యగా శ్రీమతి కారుమంచి సంయుక్త గారు పోటీలో నిలవడమే కాకుండా గెలవడం ఆమె తెగువకు నిదర్శనం. ఆమె ధైర్యం నన్ను కదిలించింది. అందుకే గ్రామ సభను ఇక్కడ నిర్వహించాలని భావించాం. ఇంట్లో ఆడపిల్ల చదివితే ఆ ఇంటికి వెలుగు అంటారు. అదే ఆడ పిల్ల చదివితే దేశానికి కూడా వెలుగు. పంచాయతీల నుంచే భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగిన శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. గ్రామ పంచాయతీల నుంచి బలమైన నాయకులు దేశానికి తయారవుతారు. అందుకే గ్రామాల నుంచి దేశభక్తి ఉప్పొంగాలనే ఉద్దేశంతో జాతీయ పండుగలను వైభవంగా జరిపేందుకు మేజర్, మైనర్ పంచాయతీలకు నిధులను భారీగా పెంచాం.’’ అన్నారు.
’’అన్ని పంచాయతీలకు నిధులు అందేలా చూసాం. ప్రస్తుతం కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 991 కోట్లు వచ్చాయి. ఎలాంటి కోతలు, మళ్లింపులు లేకుండా పంచాయతీల అకౌంట్లో నిధులను జమ చేశాం. స్వర్ణ పంచాయతీలు చేయడానికి ఆర్థికంగా వాటికి బలాన్ని అందించే కార్యక్రమాన్ని, పంచాయతీల్లోని వనరులను ఉపయోగించుకుని ముందుకు వెళ్లే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదుగానీ బలమైన సంకల్ప బలం, చిత్తశుద్ధితో కూడిన పాలన ఉంది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే ఆలోచనతో, గ్రామాలకు మళ్లీ పునర్ వైభవం రావాలని బలమైన ఆశయంతో పని చేస్తున్నాం.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.41 వేల కోట్ల పనులు చేశారు. అయితే వీటికి లెక్కాపత్రం లేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే కేవలం రూ.15 వేల కోట్ల పనులు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన నిధులు ఏమయ్యాయో, ఎలా ఖర్చు చేశారో కూడా తెలీదు. దీనికి కారణం ఒక్కటే. గ్రామసభలను నిర్వహించకుండానే ఇష్టానుసారం పనులు చేయడం వల్ల గ్రామాల్లో జరిగిన పనులే చాలా చోట్ల సర్పంచులకు కూడా తెలీని పరిస్థితి ఉంది. రోడ్లు, మౌలిక వసతులు తప్ప ఇతర పనుల జాడ లభించడం లేదు. గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లో చేసుకోవాల్సిన పనులు, వాటి ప్రాధాన్యం గురించి చర్చించి తీర్మానాలు చేసినప్పుడే నిధుల వినియోగం మీద స్పష్టత వస్తుంది.’’ అని పవన్ కామెంట్ చేశారు.
ఇవీ చదవండి: Pawan Kalyan: పవన్.. ఏపీ రాజకీయాల్లో తుఫాన్ కావడానికి కారణాలేంటి?
Akira nandhan: పవన్‌తో కలిసి అకీరా నందన్ మోదీని కలవడంపై రేణు ఎమోషనల్
Modi Pawan Kalyan: జనసేనానిపై మోదీ పొగడ్తలు.. పవన్ కాదు.. తుఫాన్
Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట భావోద్వేగం.. అన్నయ్య కాళ్లు మొక్కి కౌగిలిలో ఒదిగిపోయిన పవన్
Nagababu: పవన్ కల్యాణ్ పై నమ్మకంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు: నాగబాబు
