Arunachaleswara Temple Tragedy: తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గిరిప్రదక్షిణ (గిరివలం) మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ గుహలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 36 ఏళ్ల భక్తుడు మణికుమార్ ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబంతో కలిసి దర్శనానికి వెళ్లిన భక్తుడు
సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ (36) తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరువణ్ణామలైలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం రాత్రి సమయంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి గుహ మార్గంలో ప్రవేశించిన సమయంలో ఈ విషాదం జరిగింది.
గుహ మధ్యలోనే ఇరుక్కుపోయిన మణికుమార్
ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయంలోని గుహ చాలా ఇరుకుగా ఉంటుంది. భక్తులు వెనుకవైపు ప్రవేశ ద్వారం నుంచి పడుకుని లోపలికి వెళ్లి, చేతులు, మోకాళ్ల సాయంతో నెమ్మదిగా ముందుకు పాకుతూ ఎదురువైపు ద్వారం గుండా బయటకు వస్తారు. అయితే మణికుమార్ శరీరాకృతి లావుగా ఉండటంతో గుహ మధ్యలోనే ఇరుక్కుపోయారు. కుటుంబ సభ్యులు, అక్కడున్న ఇతర భక్తులు ఎంత ప్రయత్నించినా ఆయనను వెంటనే బయటకు తీయలేకపోయారు. కొంతసేపటికే ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టమై అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం తీవ్ర శ్రమతో గుహ నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై కేసు నమోదు
ఘటన సమాచారం అందుకున్న తిరువణ్ణామలై తాలూకా పోలీసులు ఆలయానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సమాచారం.
ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయం ప్రత్యేకత ఏమిటి?
గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయం భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. తెలుగులో చాలామంది దీనిని “మోక్ష మార్గం” అని పిలుస్తారు. ఈ గుహలోకి ప్రవేశించి ఇరుకైన మార్గాన్ని దాటి బయటకు వస్తే పాపాలు తొలగి, ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుందనే విశ్వాసంతో వేలాది మంది భక్తులు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు. గుహ నుంచి బయటకు వచ్చిన తర్వాత నంది, ఇడుక్కు పిల్లయ్యార్‌ను దర్శించుకోవడం అక్కడి సంప్రదాయం.
భక్తులకు అధికారులు సూచనలు
ఈ విషాద ఘటన నేపథ్యంలో శరీరాకృతి ఎక్కువగా ఉన్నవారు, శ్వాస సంబంధిత సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు గుహలో ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక అధికారులు సూచించినట్లు తమిళ మీడియా పేర్కొంది. ఆలయాన్ని సందర్శించే భక్తులు తమ శారీరక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Arunachaleswara Temple: చిత్ర పౌర్ణమి నాడు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే సంచలన ఫలితాలు!
Arunachala Giri Pradakshina : ఫిబ్రవరిలో పౌర్ణమి రోజున అరుణాచల గిరిప్రదక్షిణ
Arunachalam: అరుణాచలం టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవీ..






