HomeAndhra PradeshDeputy CM Pawan Kalyan: కొత్త రక్తం.. నవ్య పథం.. గతితప్పిన రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తాడా?

Deputy CM Pawan Kalyan: కొత్త రక్తం.. నవ్య పథం.. గతితప్పిన రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తాడా?

Deputy CM Pawan Kalyan: రాజకీయాల్లో అనాదిగా వస్తున్న సంప్రదాయాల్ని పాటించడం ఒక పద్ధతి. కొత్త రాజకీయానికి తెర తీయడం మరో పద్ధతి. అంతిమంగా పేద ప్రజలకు తోడుగా ఉండటం, రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా అభివృద్ధి పథాన నడిపించడమే పాలకుల కర్తవ్యం కావాలి. కొన్నేళ్లుగా రాజకీయలంటే కేవలం కక్ష సాధింపులకు మార్క్‌గా నిలుస్తున్నాయని చెప్పక తప్పదు. ప్రతిపక్షాలను చావుదెబ్బ తీయాలనే తాపత్రయంలో పాలనను పక్కదోవ పట్టించేలా పాలకులు వ్యవహరిస్తున్నారనే అపవాదు వినిపిస్తోంది. కానీ.. ఇప్పుడు ఏపీలో ఓ కొత్త తరం రాజకీయం తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదీ జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ రూపంలో…

సీఎంల మార్క్ ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు అనేక మంది ముఖ్యమంత్రుల పాలన చూశాం. వీరిలో పేదలకు తోడుగా ఉన్న ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, వైయస్ఆర్, వైయస్ జగన్ నిలిచారు. అదే క్రమంలో అభివృద్ధి, ఐకానిక్ భవనాలు, ఐటీ అంటే చంద్రబాబు పేరు గుర్తుకొస్తుంది. రాష్ట్రానికి సీఈవో అన్నట్లు ఆయనను చాలా మంది చూస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, సుమారు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ సైతం సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసి చూపి చరిత్రలో నిలిచిపోయారు.

చరిత్ర గతిని మార్చిన జనసేనాని ప్రయాణం
ఇప్పుడు ఏపీలో కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు సుమారు 14 సంవత్సరాలకు పైగా కష్టపడి అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండింటినీ చూసుకుంటూ ఇక్కడిదాకా చేరుకున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. చరిత్రలో చూడని విధంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి అన్నింటినీ కైవసం చేసుకున్నారు. 2014లో సొంతంగా జనసేన పార్టీని స్థాపించిన పవన్.. అటు తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిశారు, ఆ తర్వాత విభేదించారు, అనంతరం కలిసిపోయారు. 2024 ఎన్నికల దాకా ఎన్నో ఒడిదొడుకుల మధ్య ప్రయాణం సాగించారు.

కానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల ముంగిట ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా అటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ పెద్దలతో ఎన్నో మాటలు అనిపించుకుని పొత్తు కుదిర్చారు జనసేనాని. ఇంతటి కష్టానికి తగ్గ ఫలితం రానే వచ్చింది. ఇప్పుడు ఆయన గౌరవానికి, కష్టానికి తగిన మర్యాద ఇస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ కు ఇచ్చి సాదరంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

కక్ష సాధింపుల స్థానంలో ప్రజా సంక్షేమం సాధ్యమని నిరూపించగలడా?
అనాదిగా ప్రభుత్వం స్థాపించిన వెంటనే ప్రతిపక్షాన్ని నామరూపాల్లేకుండా చేయడం చాలా మంది రాజకీయ నాయకులు చేస్తున్న పని. ఈ కోవలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ, టీడీపీ వర్సెస్ కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, వైసీపీ వర్సెస్ టీడీపీ, వైసీపీ వర్సెస్ కాంగ్రెస్, ఇప్పుడు ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ…. ఇలా ఒక్కొక్కరు అధికారం చేపట్టిన వెంటనే ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చేసిన ప్రయత్నాలు, కక్ష సాధింపులు, హత్యలు, భవనాలు, శిలా ఫలకాల కూల్చివేతలు, దాడులు, విగ్రహాల ధ్వంసం… ఇలా విధ్వంస పాలనకు తెర తీసిన ఉదంతాలను తెలుగు ప్రజలు కళ్లారా చూస్తున్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై జరుపుతున్న విధ్వంసాన్ని పవన్ ఓ కంట చూస్తూనే ఉన్నారు.

హుందాతనం పవన్ కు ప్లస్
అసెంబ్లీలోకి అడుగు పెట్టిన వెంటనే చాలా హుందాగా ప్రవర్తించడం పవన్‌కు ప్లస్ అవుతోంది. రాజకీయాల్లో కేవలం కక్ష సాధింపులు కాకుండా, మాట తీరు హుందా ఉండాలని, ఓడిన వారిపై కక్ష రాజకీయాలు కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి తమకు ముఖ్యమంటూ ఉపముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ నేతలను, విశ్లేషకులను, ఆయన అభిమానులను, సగటు ఏపీ వాసులను ఆకర్షిస్తోంది. అధికారం అన్నది సద్వినియోగం చేసుకుంటే ఎలా చేయొచ్చో తరచూ ఆయన ప్రసంగాల్లో వినిపించేది. కానీ ఇప్పుడు స్వయంగా ఆయనకు కీలకమైన పోస్టు దక్కింది. కష్టపడి సాధించుకున్నారు కూడా. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో పవన్ మార్క్ రాజకీయం ఎలా ఉంటుంది? తెలుగుదేశం చేసే రాజకీయం కన్నా జనసేనాని చేసే రాజకీయం వైపే అందరి చూపూ ఉంది.

కొత్త రాజకీయం చూస్తామా?
తరతరాలుగా వస్తున్న స్వార్థ రాజకీయానికి స్వస్తి పలికి ప్రజలు, యువత, మహిళల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా, సంక్షేమం, ఏపీ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ తీసుకోబోయే చర్యలేమిటి అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే ఆయన అసెంబ్లీలో మాట్లాడటం కావొచ్చు, ఆ తర్వాత వెంటనే బయటే ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, ఓపికగా వారి సమస్యలు వినడం చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇది రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ పరిణామమంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శత్రువులను చీల్చి చెండాడటం కేవలం ఎన్నికల దాకా మాత్రమేనని, గెలిచిన తర్వాత ప్రతిపక్షాలను పట్టించుకోకుండా పాలన, ప్రక్షాళన, అభివృద్ధి, సంక్షేమం.. వీటిపై శ్రద్ధ పెట్టేలా పవన్ కార్యాచరణ రూపొందించాలని సగటు అభిమానులు, రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వారు ఆశిస్తున్నారు.

మరి వచ్చే ఐదేళ్లలో పవన్ రాజకీయం, అధికారం.. రాష్ట్ర గతికి, గతి తప్పిన రాజకీయాల్ని బాగు చేయడానికి, తరతరాలుగా మోసపోతూ వస్తున్న కొన్ని వర్గాలకు చేయూతనందించడానికి దోహదపడుతుందా? వేచి చూడాల్సిందే మరి.

ఇవీ చదవండి: Steps: అకాల మరణ ముప్పు తప్పించుకోవాలా? రోజూ మెట్లెక్కి దిగండి చాలు!
Hindu Population: దేశంలో తగ్గిపోతున్న హిందూ జనాభా.. పెరిగిన ఇతర మతాల సెన్సస్!
AP Elections: ఎన్నికల్లో ఏకపక్ష తీర్పులు దేనికి సంకేతం?! చరిత్ర చెబుతున్న సత్యం..!
Andhra Pradesh BJP: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ’మెగా‘ ‘పవర్?’
Chandrababu Food: చంద్రబాబు బతకడానికి ఏం తింటారో తెలుసా? ఫుడ్ డైట్ ఇదీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు