Colorful days: హామ్ తుమ్ ఏక్ కమరేమే బంద్ హో… నువ్వు–నేను ఒక గదిలో బందీ అయ్యాం. తాళం వేసుకున్నాం. ఆ తాళం కూడ ఎక్కడో పోగొట్టుకున్నాం– బాబీ చిత్రంలోని ఈ రొమాంటిక్ పాటకు– ఇప్పటి మన బందీ జీవితం పూర్తి విరుద్ధం. పైన పేర్కొన్న శీర్షికలో ధ్వనించే వైరుధ్యం లాంటి నిజం!!
వంద కిలో మీటర్లకు పైగా వేగంతో దూసుకు వెళ్లే బండికి ఒక్కసారి సడన్ బ్రేక్ పడినట్టు – కాలం ఆగింది. గడియారం నిలిచిపోయింది. పాత సిన్మాలో ఫ్లాష్ బ్యాక్‌కి చక్రాలు..చక్రాలు తిరిగినటు,్ట ఇంటి హాలులో కూర్చునే చాలామంది– చిన్నపుడు అమ్మమ్మ ఇంటికి పల్లెటూరు వెళుతున్నారు. భోజనాలు అయిన తరువాత మిట్ట మధ్యాహ్నాం పెద్దలు అందరూ నిద్రిస్తోంటే– ఈత వనంలో ముళ్లు గుచ్చుకున్నా లెక్కచేయక పళ్ల గెలలు కోస్తున్నారు.
కలల కుచ్చిళ్లు ధరించి పంట కాల్వలలో ఈదులాడుతున్నారు. తోటల వెంట– ఆకు పచ్చ మైదానాల్లో పరుగులు పెడుతున్నారు. ఒళ్లంతా దుమ్ము–ధూళి అయినా జీవితం ఎంత పరిమళవంతం! మామిడి తోపులోని ఊయల– మునిమాపు పాలెకాపు పాటలా గిరికీలు కొట్టేది. కొండవతల ఒంటరి నక్షత్రం చీకటికంటే ముందే తళుక్కుమనేది. ఆరుబయట వెన్నెల్లో పడుకుంటే అమ్మమ్మ చెప్పే కథలా కాలం కరిగిపోయేది. బాల్యం– వరం!!
వీధి చివర మలుపు– వలపు తలపు– కలల మెరుపు– ఆ… ఆలోచనల మైమరుపు– ఎంత అందమైన లోకం అది. ప్రతి క్షణం పాటలా సాగేది… హృదయం సెలయేటిలో పడవలా అదీ వెన్నెల రాత్రి – ఊగిసలాడేది. జీవితం ఉర్ధూ ఖవ్వాలీలా – లేచి మరీ హుషారుగా చప్పట్లు కొట్టేది!! ఓ లక్ష్యం– ఓ గమ్యం కోసం ఉద్యమాల ఊరేగింపూ పెళ్లి బరాత్ లా సాగేది.
ఇప్పుడు.. లాక్ డౌన్– నిజమే– అన్నీ బంద్… అయినా.. ఎవరి పనులు ఆగడంలేదు. వర్క్ ఫ్రం హోం నడుస్తోంది …అత్యవసర సర్వీసులు వారు ఆఫీసుకు వెళ్ళటం తప్పటం లేదు ..వ్యవసాయ పనులు మెల్లగా మొదలయ్యాయి ..కాలచక్రం వేగం పుంజుకుంటుంది ..కరోనా సంకెళ్లు తెగడం ఖాయం. ప్రతి అస్తమయం.. రేపటి ఉదయానికి వాగ్దానం.. ఆగిన కాలం… ఆ పాత మధురాలను గాలం వేసి మరీ మన కళ్ల ముందు ఉంచింది.
శతమానం భవతి సినిమాలో టీవీ …ఇంటర్నెట్ లేకపోతే ఆరుబయట కుటుంబం అంతా కూర్చుని పాత ఆల్బం తిరగేసినట్టు ఆ దృశ్యం… అనుభవం అయ్యింది .మళ్లీ జీవితం రేపు మామూలుగా బిజీ బిజీగా మారిపోతుంది .అయితే… కరోనా కాస్త కఠినంగా అయినా ప్రతి వారికి నేర్పిన కొత్త అనుబంధాలు… అనుభూతులు.. ఆ రంగు.. రుచి వాసన జీవితంలో మిగులుతాయా వేచి చూడాల్సిందే.

– గురునాథ్ సర్వశుద్ధి, సీనియర్ జర్నలిస్ట్, విశాఖపట్నం
ఇవీ చదవండి: YS Jagan in Mydukur: ఓ బాబూ.. మీకు, మీ బ్యాచ్ సంస్కారానికి ఓ నమస్కారం: మైదుకూరులో సీఎం జగన్
Kancha Ilaiah: ఏపీలో చదువుల విప్లవం మరో ఐదేళ్లు కొనసాగాలి.. జగన్ రాజకీయాలను మార్చేశారు: కంచ ఐలయ్య
Kancha ilaiah: జగన్‌మోహన్‌రెడ్డి ఓడితే ఆయనకు నష్టం లేదు.. నష్టపోయేది పేదలే.. కంచె ఐలయ్య ప్రసంగం తప్పక చదవాల్సిందే..
Botcha Satyanarayana: నాకు తండ్రిలాంటి వాడు.. సీఎం జగన్ వ్యాఖ్యలతో మంత్రి బొత్స భావోద్వేగం!
