Family Star Movie Review: విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం విడుదల సందర్బంగా నేడు అటు ట్విట్టర్‌లోనూ, ఇటు థియేటర్లలోనూ సందడి వాతావరణం ఏర్పడింది. ఈ మూవీ రివ్యూపై ఓ లుక్కేద్దాం.
మూవీ : ఫ్యామిలీ స్టార్
నటీనటులు: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, అభినయ, ప్రభాస్ శ్రీను తదితరులు
సినిమాటోగ్రఫర్: మోహనన్
సంగీతం: గోపీ సుందర్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
కథ, కథనం, మాటలు, దర్శకుడు: పరశురాం పెట్ల
నిర్మాత: దిల్ రాజు
కొంత కాలంగా టాలీవుడ్‌లో ఫ్యామిలీ స్టార్ పేరు పాపులర్ అయ్యింది. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు భారీగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. యువతలో క్రేజీ హీరోగా స్థానం సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తనకు కలిసొచ్చిన ఫ్యామిలీ జోనర్‌లో సినిమా చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి.
కథ విషయానికి వస్తే..
సాధారణ మధ్య తరగతి కుటుంబంతో కథ మొదలవుతుంది. అందులో ముగ్గురు సోదరులు, ఇద్దరు వదినలు, వారి పిల్లలు, బామ్మ, వీళ్లందర్నీ ఒక్కడే పోషించే వ్యక్తి గోవర్ధన్. ఇతడే మన హీరో విజయ్ దేవరకొండ. సాధారణ మధ్య తరగతి కుటుంబం ఎలా ఉంటుందో, అన్ని క్యారెక్టర్లూ ఇందులో ఉన్నాయి. తన కుటుంబంపై చిన్న ఈగ వాలినా అతడు భరించలేడు. చిన్న మాట కూడా పడే రకం కాదు. ఫ్యామిలీ అంటే అంత ప్రాణంగా చూసుకుంటాడు హీరో.
ఇలాంటి వ్యక్తి జీవితంలోకి సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే ఇందు.. ఈమే కథానాయిక మృణాల్ థాకూర్.. చేరుతుంది. లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగానే ఆమెకు గోవర్ధన్ కనెక్ట్ అయిపోతాడు. సాఫీగా సాగిపోతున్న క్రమంలో ఇందు చేసిన ఓ పనికి గోవర్దన్‌కు డిప్రెషన్ వస్తుంది. పట్టుదలతో అన్నీ సాధించాలనే ఉద్దేశంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరుతాడు. ఈ కంపెనీ జగపతిబాబుది. అనంతరం యూఎస్ కూడా వెళ్తాడు. అయితే, గోవర్దన్ జీవితంలోకి ఇందు ఎందుకొచ్చింది? ఎలాంటి తప్పు చేస్తుంది? ఎందుకు ఆమెను హీరో తీవ్రంగా ద్వేషిస్తాడన్నది మిగతా కథ.
ఫ్యామిలీ మూవీస్‌లో అన్నీ సాధారణంగానే ఉన్నా కొన్ని సీన్లలో మ్యాజిక్ ఉంటుంది. అలాంటి మ్యాజిక్కే ఫ్యామిలీ స్టార్‌లో కూడా చూపించాడు దర్శకుడు. చాలా సినిమాల్లో ఉన్నట్లుగానే మిడిల్ క్లాస్ సరిగమలన్నీ ఈ చిత్రంలో పొందుపరిచారు. ఒక్కడే ఫ్యామిలీ మొత్తాన్ని లాగే హీరో, కుటుంబం జోలికొస్తే ఆవేశం రావడం లాంటి సీన్లతో మొదటి సగం సినిమా నింపేశాడు దర్శకుడు. కాస్తంత ఫన్నీ సీన్లతో అలరిస్తుంది ఫస్ట్ హాఫ్ మూవీ.
ఇంటర్వెల్ సీన్ వరకు ఎమోషన్, ఫన్నీ సీన్లు అలరించాయి. కుటుంబంతో పాటు విజయ్ దేవరకొండ బాగా నటనా చాతుర్యం కనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ వచ్చాక సన్నివేశాలన్నీ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో మూవీ కాస్త పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది. మూవీ స్లోగా నెరేట్ అవడం ఫ్యామిలీ స్టార్‌కు మైనస్‌గా మారింది. యూఎస్ వెళ్లిన సీన్లలో విజయ్ పంచ్ డైలాగులు అలరించాయి. అయితే అక్కడక్కడా గీతా గోవిందం సీన్లను తలపించింది.
మూవీ చివర్లో ఓ సీన్ మొత్తం గీతా గోవిందం సినిమాను అచ్చం దింపేసినట్లు అనిపిస్తుంది. కుటుంబం గొప్పతనం గురించి చెప్పే సీన్లు రొటీన్ అనిపించాయి. అమెరికాలో ఎపిసోడ్‌లో తీసిన సీన్లలో కాస్త వినోదం మేళవించింది. క్లైమాక్స్ రొటీనే అనిపించేలా ఉంటుంది. ఇది మూవీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్‌గా చూస్తే.. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ మొత్తం కలిసి ఫ్యామిలీ స్టార్‌ను ఓసారి చూసేయొచ్చు.
ఇవీ చదవండి: Family Star: ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్.. మృణాల్, విజయ్ దేవరకొండ హిట్ గ్యారెంటీనా?
Raasi career: రాశి కెరీర్‌ను దెబ్బ తీసిన సినిమా అదేనా? తర్వాత కోలుకోలేకపోయిన ఫ్యామిలీ హీరోయిన్!
Rashi Singh: రాశి సింగ్ హాట్ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్ పిక్స్!!
