HomeAndhra PradeshAP BJP News: ఏపీ బీజేపీలో టీడీపీ ముద్ర.. కేండేట్ల ఎంపికలో అన్యాయంపై కేంద్ర పెద్దలకు...

AP BJP News: ఏపీ బీజేపీలో టీడీపీ ముద్ర.. కేండేట్ల ఎంపికలో అన్యాయంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ!

AP BJP News: ఏపీ బీజేపీలో కలకలం రేగుతోంది. ఇప్పటికే టీడీపీ అనుకూల వ్యక్తులతో నిండిపోయిన రాష్ట్ర బీజేపీ శాఖ.. ఉన్న అరకొర అసలైన బీజేపీ నేతలకు ఇప్పుడు కూటమిలో టికెట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు అనుకూలమైన వ్యక్తులు కాకుండా అసలైన కాషాయదళంలో ఇప్పుడు గుబులు మొదలైంది. టికెట్లన్నీ టీడీపీ అనుకూలురైన బీజేపీ నేతలకు వెళ్లిపోతున్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. అంతేకాదు.. ఈ మేరకు కేంద్ర బీజేపీ పెద్దలకు ఫిర్యాదులుసైతం వెళ్లడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ శాఖలో కూటమి పొత్తు చిచ్చు రేపింది. బీజేపీకి కేటాయించిన సీట్లకు అభ్యర్థుల ఎంపికలోనూ టీడీపీ అధినేత వేలు పెట్టడం ఇప్పుడు కాకరేపుతోంది. అసలైన బీజేపీ నేతల్లో తీవ్ర అసహనం, అసంతృప్తి పెల్లుబుకుతున్నాయి. ఓడిపోయే సీట్లను పొత్తులో భాగంగా బీజేపీకి కట్టబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లను బీజేపీకి కేటాయించారు.

2014లో బీజేపీ, మోదీ హవాతో నెగ్గిన టీడీపీ.. ఇప్పుడు ఆ రేంజ్‌లో వేవ్‌ లేకపోవడంతో గుబులు పట్టుకుంది. ముఖ్యంగా ఏపీలో సీఎం జగన్‌ సంక్షేమ పథకాల ప్రభావం రూరల్‌లో అధికంగా ఉండటం, అర్బన్‌ ప్రాంతాలకే టీడీపీ పరిమితం కావడం ఇప్పుడు రాజకీయం ఆసక్తికరంగా మారింది. కేవలం ఒక శాతం లోపు ఓటు బ్యాంకు ఉన్న బీజేపీకి.. ఈ రేంజ్‌లో సీట్లు ఇవ్వడం, కేసుల విషయంలో రాజీ కోసం సాగిలపడటం టీడీపీ కేడర్‌లోనే చాలా మందిని కలవరపెడుతోంది. మైనార్టీ ఓట్లపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని విశ్లేషణలు వస్తున్నాయి.

మరోవైపు ఓటు ట్రాన్స్‌ఫర్‌ విషయంలోనూ మూడు పార్టీలదీ మేకపోతు గాంభీర్యమే. ఈ ఎన్నికల్లో కూటమిలో టీడీపీ ఇప్పటివరకు మూడు జాబితాలను విడుదల చేసింది. బీజేపీ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎంపీ స్థానాల కోసం అంతా టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన నేతలుగానీ లేక చంద్రబాబుకు సానుకూలంగా ఉన్న వారు గానీ పోటీలో ఉండేలా కసరత్తు చేయడంపై రాష్ట్ర బీజేపీలో తీవ్ర దుమారం రేపుతోంది.

తొలుత విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, ఒంగోలు, రాజంపేట, హిందూపురం ఎంపీ స్థానాలను బీజేపీ కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన 13 ఎంపీ స్థానాల్లో విశాఖపట్నం, హిందూపురం ఎంపీ స్థానాలు ఉన్నాయి. విశాఖపట్నం టీడీపీ అభ్యర్థిగా మాత్కుమిల్లి భరత్‌, హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథిని టీడీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాము కోరిన సీట్లు రాలేదని బీజేపీ గుర్రుమంటోందట.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసేందుకు చాలా కాలంగా గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు. కేంద్ర పెద్దలతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. టీడీపీతో పొత్తు కారణంగా విశాఖ ఎంపీ సీటును బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌కు ఇవ్వడంతో జీవీఎల్‌కు ఆశాభంగం తప్పలేదు. ఈ నేపథ్యంలోనే తనకు లోక్‌సభ టికెట్‌ రాదనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏలూరు ఎంపీ సీటు కోసం చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కూడా టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేశ్‌ యాదవ్‌ను ప్రకటించారు చంద్రబాబు. దీంతో అక్కడ బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.

రఘురామకృష్ణంరాజుకు చుక్కెదురు?
నరసాపురం సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ అధికార పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం పొత్తుల్లో భాగంగా టీడీపీ లేదా, బీజేపీలో ఎవ్వరికి ఖరారైనా తానే పోటీలో ఉంటానని చెప్పుకుంటున్నారు. నరసాపురం ఎంపీ స్థానం అసలైన బీజేపీ నేతలకు ఇవ్వాలని, చంద్రబాబు అనుకూలురైన వారికి కట్టబెట్టకూడదంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. రఘురామ కృష్ణ్రంజుకు సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.

వైయస్సార్‌ సీపీ నుంచి గెలిచిన కొన్నాళ్లకే చంద్రబాబు పంచన చేరిన రఘురామకృష్ణంరాజు.. నియోజకవర్గంలో దాదాపు అడుగు పెట్టిందే లేదు. నాలుగున్నరేళ్లు రాష్ట్రానికి రాకుండా హైదరాబాద్‌ లేదా ఢిల్లీలో చక్కర్లు కొడుతూ కాలం గడిపేశారు. ఈ నేపథ్యంలో స్థానిక సమస్యలను పట్టించుకోకుండా టీడీపీ భజన చేసిన రఘురామకృష్ణంరాజుకు టికెట్‌ ఇస్తే ఓటమిపాలు కావడం తథ్యమనే లెక్కలేసుకుంటున్నాయి అటు బీజేపీ, ఇటు టీడీపీ. ఇప్పటికే నరసాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమా బాలను (బీసీ మహిళ) సీఎం జగన్‌ ఖరారు చేశారు.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్‌ వ్యవహారం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అనకాపల్లి నుంచి ఎంపీ సీటు బరిలో దిగేందుకు సీఎం రమేష్‌ ఆసక్తి చూపుతున్నారు. అధికారికంగా ఆయన బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ బాబుకు సన్నిహితుడేనన్న విషయం బహిరంగ సత్యం. అయితే, అనకాపల్లి టికెట్‌ ఇవ్వడంపై బీజేపీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల సీఎం రమేష్‌పై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో సినీ నటుడు వేణు ఫిర్యాదు చేశారు.

వేణుకు చెందిన పీసీఎల్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో రూ.450 కోట్ల మొత్తానికి రమేష్‌ ఫోర్జరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక బీజేపీలో పురందేశ్వరి, సోము వీర్రాజు రాజమండ్రి పార్లమెంటు సీటును ఆశిస్తున్నారు. ఇక రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నేత సత్యకుమార్‌ పేర్లు కూడా వినపడుతున్నాయి. వైయస్సార్‌ సీపీకి కంచుకోటగా ఉన్న రాజంపేటలో ఎవరు పోటీ చేసిన మిధున్‌రెడ్డిపై ఓటమి ఖాయమనే విశ్లేషణలు వస్తున్నాయి.

ఇలా అసలైన బీజేపీ నేతలు, టీడీపీ అనుకూల బీజేపీ నేతల తీరుతో రాష్ట్రంలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. మరోవైపు జనసేనలోకి తమ నేతలను పంపి అక్కడి టికెట్లు ఇవ్వడంపైనా జనసైనికుల్లో తీవ్రంగా అసహనం వ్యక్తమవుతోంది. మూడు పార్టీల కలయిక, కూటమి ఓటు బదిలీపై సవాలక్ష ప్రశ్నలు, సందేహాలు ఏర్పడుతున్నాయి.

ఇవీ చదవండి: BJP 2nd List: బీజేపీ రెండో జాబితా విడుదల.. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి డీకే అరుణ పోటీ
Perni Nani Comments: మోదీజీ.. వెనుక నుంచి చంద్రబాబు రాకుండా చూసుకోండి: పేర్ని నాని
CBN Comments on Modi: అబ్బబ్బ.. అవేం పొగడ్తలు.. తిట్టిన నోటితోనే ప్రధాని మోదీపై చంద్రబాబు పొగడ్తల వర్షం!!
PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని కామెంట్స్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు