YS Jagan Bus Yatra: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జనంలోకి రాబోతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల వస్తున్న తరుణంలో ఇకపై జనంలోనే ఉండేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. తొలుత ఈనెల 18వతేదీ నుంచి ప్రచారం మొదలు పెడతారని అనుకున్నప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు ఊహించిన విధంగా రాకపోవడంతో.. ఓ వారం వెనక్కి జరిపి ఈనెల 26 లేదా 27వ తేదీ నుంచి బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు బస్సు యాత్ర (YS Jagan Bus Yatra) సాగనుంది.
ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్.. మేనిఫెస్టో కూడా త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 16న ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్.. అక్కడ తన తండ్రి వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఎంపీ నందిగం సురేష్ ద్వారా 25 మంది ఎంపీ అభ్యర్థుల్ని, 175 అసెంబ్లీ అభ్యర్థులను సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు ద్వారా చదివి వినిపించారు. సామాజిక సమతూకం పాటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగభాగం అంటే 200 సీట్లలో ఈ వర్గాలకు 100 సీట్లను జగన్ కేటాయించడం సరికొత్త చరిత్రకు దారి తీసింది.
ఇక మిగిలిందల్లా ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం మాత్రమే. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. భారీ ఎన్నికల ప్రచారానికి సీఎం తెరతీస్తున్నారు. దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంటు స్థానం పరిధిలోని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుందని సమాచారం.
రోజుకో జిల్లాలో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బస్సు యాత్రలో భాగంగా ఉదయంపూట ముఖాముఖి, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా ప్రజలతో మమేకమైనట్లు ఉంటుందని, ప్రజల నుంచి సలహాలు కూడా తీసుకునేలా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేలా జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే నాలుగు సిద్ధం సభలు సక్సెస్
భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు భారీగా సక్సెస్ అయ్యాయి. లక్షలాది మంది జనం తరలి వచ్చారు. జగన్ ప్రసంగాలు సైతం కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాయి. లబ్ధి పొందిన ప్రతి కుటుంబం నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని జగన్ పిలుపునిచ్చారు. ఇక ఎన్నికల కోడ్ వచ్చేసినందున మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించనున్నారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఇవీ చదవండి: PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని కామెంట్స్
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
