POCSO Act: బాలలపై నేరాలకు పాల్పడిన కేసులలో న్యాయ, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ శాఖల సమన్వయంతో పనిచేసి నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చూడాలని ఏపీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి మజ్జి బబిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ (సీఆర్ఏఎఫ్) ఆధ్వర్యంలో విజయవాడలో రెండురోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి కన్సల్టేషన్ ఆదివారం ముగిసింది. POCSO Act
ఏపీ బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు, ఏపీఎఫ్ఎస్ఎల్ జాయింట్ డైరెక్టర్ డి.వెంకటేశ్వర్లు, ఏపీఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.ఫణిభూషణ్, ఏపీఎస్ఎల్ఎస్ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హెచ్. అమర రంగేశ్వరరావు, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ పి.ఫ్రాన్సిస్ తంబి, ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్ పర్సన్ జి.ప్రమీల రాణి, దిశ డీఎస్పీ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత మాట్లాడుతూ.. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ (పోక్సో) -2012 పై రాష్ట్రస్థాయి కన్సల్టేషన్ నిర్వహించేందుకు ప్రోత్సహించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ ఏవీ శేషసాయికి ధన్యవాదాలు తెలిపారు.
లైంగిక నేరాల నుంచి పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. లైంగిక వేధింపులు, పోక్సో చట్టంపై తల్లిదండ్రులు, పిల్లలకు చైతన్యం కలిగేలా పోలీసులతో పాటు ఆయా శాఖలు సైతం బాధ్యతతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాలలపై జరిగే లైంగిక నేరాలలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
నిరక్షరాస్యుల నుంచి అక్షరజ్ఞానం కలిగిన వారు కూడా నేడు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. బాధితుల నుంచి సకాలంలో వివరాలు సేకరించి నిందితులపై కేసులు నమోదు చేసి.. వారికి శిక్షలు పడేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆన్‌లైన్‌లో సైబర్ నేరస్తులు చాలా సందర్భాల్లో మైనర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని.. ఇటీవల క్రెడిట్ కార్డులు, ఆన్ లైన్ గేమ్స్ పేరుతో జరుగుతున్న మోసాలే ఇందుకు నిదర్శనమన్నారు. తల్లిదండ్రులు కూడా సమయం దొరికినప్పుడు పిల్లలతో కొంత సమయం గడపాలని, సైబర్ నేరాలు, మోసాలు, వివిధ రకాల లైంగిక నేరాల గురించి వారికి వివరించాలని సూచించారు.
ఏపీ బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ.. చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో అధికార యంత్రాంగం సమన్వయం చాలా ముఖ్యమన్నారు. ఏపీఎఫ్ఎస్ఎల్ జాయింట్ డైరెక్టర్ డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పోక్సో కేసుల్లో ఫోరెన్సిక్ ఇన్విస్టిగేషన్ కు డేటా సేకరణలో అసురించాల్సిన పద్ధతులను వివరించారు.
గుర్తు తెలియని వ్యక్తులతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం ద్వారా కలిగే అనర్థాల గురించి వివరించారు. లైంగిక వేధింపుల కేసుల్లో 70 శాతం ఎవిడెన్స్ గా మొబైల్ ఫోన్స్ ఉంటే, ఇతర వస్తువులు 30 శాతం ఉంటున్నాయన్నారు. సెల్ ఫోన్స్, మెయిల్స్ కు వచ్చే అపరిచిత మెసేజ్ లను పూర్తిగా చదవకుండా స్పందించకూడదని.. నిర్లక్ష్యంగా ఉంటే వ్యక్తిగత సమాచారం నిమిషాల్లోనే చోరీకి గురవుతుందన్నారు.
Read Also: Judiciary Andhra Pradesh: ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్ ఆవిష్కరణ
Child labor: 2025 కల్లా బాలకార్మికులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
Healthy Village: శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో హెల్తీ విలేజ్‌పై జాతీయ వర్క్‌షాప్
