SLBC Meeting: రాష్ట్రంలో 2023-24 ఆర్ధిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివిధ బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా గత సమావేశ యాక్షన్ టేకెన్ రిపోర్ట్,డిశంబరు 2023 బ్యాంకింగ్ కు ఇండికేటర్స్, 2023-24 వార్షిక ఋణ ప్రణాళిక సాధించిన ప్రగతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, డిజిటల్ జిల్లాలు,కేంద్ర ప్రభుత్వ మరియు ఆర్బిఐ ఆన్ గోయింగ్ ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. SLBC Meeting
మంత్రి బుగ్గన మాట్లాడుతూ కౌలు రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి ఆదుకోవాలనేది ఈప్రభుత్వ అత్యంత ప్రాధన్యత అంశమని కావున కౌలు రైతులకు రుణాలందించుటలో వివిధ బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ణప్తి చేశారు. పాడిపరిశ్రమాభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, ఈ రంగంలో కూడా తగిన రుణాలు అందించాలని విజ్ణప్తి చేశారు. ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాల్లో డైరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఆయా జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టి డైరీ రంగం అభివృద్ధికి హితోదిక సాయం చేయాలని సూచించారు. (SLBC Meeting)
రాష్ట్రంలో కోళ్ల పెంపకం, మత్స్య పరిశ్రమ రంగాలు అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, ఈరెండు రంగాల్లోని రైతులకు అన్ని విధాలా తగిన రుణ సహాయం అందించి ప్రోత్సహించేందుకు బ్యాంకులు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఏపీ టిడ్కో కింద జగనన్న నగరాలు నిర్మాణంలో లబ్దిదారులకు మరింత చేయూతనిచ్చి వేగవంతంగా ఇళ్ళు నిర్మించుకునేందుకు తగిన సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ పధకాలు అమలులో వివిధ ప్రవేట్ బ్యాంకులు కూడా తమ వంతు తోడ్పాటును అందించాలని మంత్రి రాజేంద్రనాధ్ విజ్ణప్తి చేశారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ ఎపిలో మెరుగైన ఈ క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు.అదే విధంగా గుడ్ గవర్నెన్స్ లో ఎపి ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందని అన్నారు. వార్షిక రుణ ప్రణాళిక అమలులో వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతికి వివిధ బ్యాంకరులను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
ఎస్ఎల్బిసి కన్వీనర్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం.రవీంద్ర బాబు రాష్ట్రంలో 2023-24 వార్షిక ఋణ ప్రణాళిక అమలుకు సంబంధించి డిశంబరు నెలాఖరు వరకు వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2023-24 వార్షిక ఋణ ప్రణాళిక కింద రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా రూ.4.43 లక్షల కోట్ల రుణాలు అందించాలని లక్ష్యం కాగా డిశంబరు నెలాఖరు నాటికే 4లక్షల 77వేల 234 కోట్లు రుణాలు అందించి 108 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు.
ప్రాధాన్యత రంగం కింద 3 లక్షల 23వేల కోట్లు అందించాల్సి ఉండగా 2.88 లక్షల కోట్లు అందించి 89శాతం లక్ష్యం సాధించినట్టు తెలిపారు. అదే విధంగా 2లక్షల 31వేల కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా 2లక్షల 8వేల కోట్లు అందించి 90 శాతం లక్ష్యం సాధించినట్టు చెప్పారు.ఎంఎస్ఎంఇ రంగంలో 69వేల కోట్లకు గాను 71వేల 113కోట్లు అందించి 103 శాతం లక్ష్యం సాధించినట్టు తెలిపారు.అలాగే ప్రాధాన్యేతర రంగానికి సంబంధించి లక్షా 20వేల కోట్ల రూ.లు రుణాలు అందించాల్సి ఉండగా లక్షా 88వేల 557 కోట్ల రూ.లు అందించి 157 శాతం లక్ష్య సాధన చేయడం జరిగిందని వివరించారు.
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి కింద 35 వేల సంఘాలకు రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటికే 31వేల 699 సంఘాలకు సహాయం అందించి 91 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు యుబిఐ జియం మరియు ఎస్ఎల్బిసి కన్వీనర్ రవీంద్ర బాబు వివరించారు.కేంద్ర ప్రభుత్వ ప్రధకం స్టాండ్ అఫ్ ఇండియా కింద 13వేల 78 ఖాతాదారులకు సహాయం అందించాల్సి ఉండగా డిశంబరు నెలాఖరు నాటికి 12వేల 768 ఖాతాదారులకు సహాయం చేసి 97శాతం లక్ష్య సాధించారని తెలిపారు.
పీఎం ముద్రా యోజన కింద రూ.13 వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.14 వేల 860 కోట్లు అందించి 114 శాతం లక్ష్య సాధన చేసినట్టు పేర్కొన్నారు. పీఎం స్వనిధి కింద 4లక్షల 41వేల 903 ధరఖాస్తులు రాగా వాటిలో 4లక్షల 28వేల 678 ధరఖాస్తులకు మంజూరు ఇవ్వగా 97శాతం లక్ష్యం సాధించడం జరిగిందని తెలిపారు. ఇంకా వివిధ పధకాల కింద సాధించిన ప్రగతిని జియం రవీంద్ర బాబు వివరించారు.
ఇదీ చదవండి: Buggana Rajendranath: మా హయాంలో చేసిన అప్పు రూ.1,36,508 కోట్లే.. కాగ్ నివేదికలనూ తప్పుపడతారా? బుగ్గన ఫైర్
