Jagan on CBN Chandramukhi: ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్.. చంద్రబాబుపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాను మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద.. ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్ర గ్రహణాలు ఉండవు.. అన్నారు. లేదంటే.. చంద్రముఖి సైకిలెక్కుతుంది.. టీ గ్లాసు పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ ఇంటింటికీ వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రకోలా మాదిరిగా మీ తలుపు తడుతుంది.. గడపగడపలోనూ ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి అక్కచెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకూ, అన్నదమ్ముడికీ చెప్పండి. అని పిలుపునిచ్చారు. (Jagan on CBN Chandramukhi) ఆయన ఇంకా ఏమన్నారంటే..
* 14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చెప్పుకొనేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతోంది.
* నేను ఇది చేశా నాకు ఓటేయండి అని అడగాల్సిన వ్యక్తి.. చెప్పుకొనేందుకు ఏదీ లేదు కాబట్టి పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులతో సాగుతోంది.
* ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి, ఎన్టీ రామారావు గుర్తుకొస్తున్నాడు. వెన్నుపోటు పొడిచేదీ ఆయనే, మళ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ ను గుర్తు తెచ్చుకొనేదీ ఆయనే.
ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటున్నారు.
* ప్రజల్ని కాదు, పార్టీలను పిలుస్తున్నాడు. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు.
* వదినమ్మను పిలుస్తున్నాడు, కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలిరా అని వాళ్ల వదినమ్మను పిలుస్తున్నాడు.
* రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైయస్సార్ గారి మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా చార్జ్ షీట్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నువ్వు కూడా రా కదలిరా అని చంద్రబాబు పిలుస్తున్నాడు.
* బాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్‌కు.. ఈస్టేట్ కు, వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరు. వారంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్.
* వారికి ఏనాడైనా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారంటే, ఆ ప్రజలతో పని పడినప్పుడే.
* ఆయన సైకిల్ తొక్కడానికి ఇద్దర్ని, దాన్ని తోయటానికి మరో ఇద్దర్ని పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నాడు.
* చంద్రబాబుకు పొత్తే లేకపోతే కనీసం 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేసుకొనేందుకు అభ్యర్థులు కూడా లేరు.
* ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి.
* పేదవాడి భవిష్యత్ టార్గెట్ గా, పేద వాడి సంక్షేమం టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి.
* వీరితో యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా అని అడుగుతున్నా.
* ఈ యుద్ధం.. 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడిచారు కాబట్టి మీకూ అలవాటే.
* ఇదీ ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* ఆ కనిపిస్తున్న జెండాకు అర్థం.. ఈ ఒక్కడి మీద దేశంలోకెల్లా బలమైన 10 వ్యవస్థల్ని ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా.
* 100 బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజా క్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు, మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా.
* పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్త, నాయకుడికీ, అభిమానికీ, ప్రతి వాలంటీర్ కి, ఒక్క విషయం చెబుతున్నా, వీరితోపాటు ప్రజా ప్రతినిధులకు ఒక్కటే చెబుతున్నా. ఇది.. మీ అందరి పార్టీ.
* మీ జగన్ మీ బిడ్డ. మీ అందరికీ ఒక మంచి సేవకుడు.
* కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లను నియమించిన చరిత్ర మనది.
* నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు, చైర్మన్లు పదవులు ఇవ్వడం ఇవన్నీ కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యం.
