Tirumala Darshanam: కలియుగ వైకుంఠ నాథుడు శ్రీవేంకటేశ్వర స్వామి (Lord Sri venkateswara) వారి దర్శనానికి భారీగా భక్తజనం వస్తున్నారు. భక్తులతో తిరుమల కొండలు కిక్కిరిసిపోతున్నాయి. అటు నడక దారిలోనూ, ఇటు సర్వదర్శనం క్యూల్లోనూ భారీ సంఖ్యలో జనం కనిపిస్తున్నారు. పిల్లాపాపలతో తిరుమల (Tirumala) కొండపైకి చేరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం తిరుమలలో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. (Tirumala Darshanam)

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్లు వెలుపలకు కూడా వచ్చేశాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చింది. నిన్న శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,483 మంది. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 32,459 మంది. శుక్ర, శని వారాల్లోనూ ఇదే తరహా భక్తుల తాకిడి కనిపించింది. శనివారం రోజు తెల్లవారుజామున స్వామి వారిని దర్శించుకోవడం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అందుకోసమే శుక్రవారమే క్యూలైన్‌లోకి వెళ్లిపోతుంటారు.

ఈ క్రమంలో శుక్ర, శని వారాల్లో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలలో కనిపిస్తుంటారు. ప్రస్తుతం ఆదివారం కూడా భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. నడక దారి భక్తులు అలిపిరి వద్దే టికెట్లు తీసుకొని నడుస్తున్నారు. నడిచి వెళ్లే భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీటీడీ పేర్కొంటోంది. అయితే, భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో క్యూలైన్లలో, కాంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే సమయం పెరుగుతోంది. దీంతో భక్తులు ఇంకెంత సమయం వేచి ఉండాలి భగవంతుడా.. అంటూ స్వామిని తలచుకుంటున్నారు.
Read Also : Sri Venkateswara: కలియుగ వైకుంఠ నాథునికి ఎన్ని కోట్ల ఆస్తులంటే..
రూ.300 దర్శనం టికెట్లు ఉన్న వారికి కాస్త త్వరగానే దర్శనం పూర్తవుతోంది. సర్వదర్శనం, నడకదారి భక్తులకు వేచి ఉండే సమయం కాస్త ఎక్కువగా తీసుకుంటోంది. సిఫార్సు లేఖలతో దర్శనానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దాంతోపాటు వీఐపీ దర్శనం, ప్రముఖులు వచ్చిన సందర్భాల్లో సాధారణ భక్తులకు కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. సర్వదర్శనం భక్తులకు మరింత వేగంగా శ్రీవారి దర్శనం కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకొనే భక్తులు అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. దళారీలను, మధ్య వర్తులను, ఫేక్ వెబ్‌సైట్లను ఆశ్రయించి మోసపోవద్దని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తిరుమలలో ఎల్లుండి శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 11న వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు. 10న సిఫార్సు లేఖలు స్వీకరించబోరని టీటీడీ వెల్లడించింది.
