Tirumala Special Darshan Tickets: కలియుగ వైకుంఠపురి.. తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఈ వార్తను టీటీడీ అందించింది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను (Tirumala Special Darshan Tickets) ఈనెల అంటే మే 24వ తేదీన విడుదల చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. బుధవారం ఉదయం 10 గంటలకు దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది.
టికెట్ల కోసం తమ అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in లో మాత్రమే భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని, ఫేక్ వెబ్‌సైట్లను ఆశ్రయించి మోసపోవద్దని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన వెలువరించింది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు కుదించింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన టీటీడీ.. దర్శనాల కోసం సిఫార్సు లేఖలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వ్యక్తులు నేరుగా తిరుమలకు వస్తేనే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది.
సామాన్య భక్తుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు దేవస్థాన అధికారులకు సహకరించాలని కోరింది టీటీడీ. కలియుగ వైకుంఠనాధుడు కొలువైయున్న తిరుమల క్షేత్రానికి రోజూ దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇలా వచ్చిన భక్తులకు వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షణ, వయోవృద్దులు, దాతలు, సర్వదర్శనం టైం స్లాట్, దివ్యదర్శనం వంటి వివిధ పద్దతుల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు.
మరోవైపు సామాన్య భక్తులు మొదలు.. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలకు కూడా శ్రీవాని దర్శనాన్ని కల్పిస్తోంది టీటీడీ. ఆ శ్రీనివాసుడిని క్షణకాలం పాటు దర్శనం చేసుకుంటే బాధలన్నీ తీరిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే, సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రతి నెలా ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తున్నారు. ముందస్తుగా టోకెన్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సులభంగా స్వామి వారి దర్శనం చేసుకునే వీలును టీటీడీ కల్పిస్తోంది.
ప్రతి నెలలాగే సుదూర ప్రాంతాల భక్తులు, గ్రామీణ ప్రాంతాల భక్తుల సౌకర్యార్థం ఈ నెల 24వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టీటీడీ కుదించి ప్రతి రోజు 12 వేల టోకెన్ల చొప్పున విడుదల చేస్తోంది. ఇలా నెలకు మూడు లక్షల అరవై వేల టోకెన్లను విడుదల చేస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్‌సైట్ లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Also : Tirumala: తిరుమలలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? టికెట్లు దొరుకుతాయా?