Telangana Politics: ప్రధాని నరేంద్ర మోదీ నిన్న తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్బంగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ అవినీతికి అడ్డూ అదుపు లేకుండా ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థలు కన్నేసి ఉంచాయన్నారు. (Telangana Politics)
రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, (BRS Party) కాంగ్రెస్ (Congress) పార్టీలను చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, మంత్రులు స్పందించారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రధానిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి మోదీ (PM Modi) అన్యాయం చేసింది చాలక మళ్లీ ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ (Telangana) ప్రజలకు తీరని అన్యాయం చేసిన మోదీని రాష్ట్ర ప్రజలు తరిమేస్తారంటూ జోస్యం చెప్పారు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు. దీంతో రెండు పార్టీల నడుమ వార్ మొదలైందన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇదంతా ఆ రెండు పార్టీల మధ్య యుద్ధం మొదలైందన్న వాతావరణం సృష్టించే ప్రయత్నమేనని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మాటలయుద్ధం తగ్గించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. (CM KCR) ఈసారి ప్రధాని వచ్చి విమర్శలు గుప్పించినా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన సమయంలో ఏ చిన్న సమస్యపై అయినా సరే.. వెంటనే కేంద్రంపై అంతెత్తున లేచేవారు కేసీఆర్.
ఈ నేపథ్యంలో స్వయంగా ప్రధాని తెలంగాణ గడ్డపైకి వచ్చి కేసీఆర్‌ను, ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టినా సరే.. ప్రభుత్వాధినేత రియాక్షన్ ఇవ్వకపోవడం, మంత్రులు, ఇతర నేతలతో కౌంటర్ ఇప్పించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒకటేననే విమర్శలు చేస్తోంది.
గతంలోకేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు కనీసం ప్రెస్ మీట్ పెట్టి ప్రధాని విమర్శలను ఖండించలేదని పలువురు నేతలు, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రధానిపై ఇప్పుడు పల్లెత్తు మాటైనా మాట్లాడకుండా తమ నాయకుడు సైలెంట్‌గా ఉండిపోవడంపై అటు బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీపై విమర్శల జోరు తగ్గించిన కేసీఆర్
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టం. బలమైన కేడర్ ఉన్నది కేవలం అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్‌లకు మాత్రమే. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలోనే గతంలో కాంగ్రెస్ పార్టీలోంచి ఎమ్మెల్యేలను, ఏకంగా శాసనసభా పక్షాన్ని కూడా విలీనం చేసుకున్న చరిత్ర కేసీఆర్ సొంతం. అయితే, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. నేతలు పార్టీలు మారినా.. క్షేత్రస్థాయిలో కేడర్ మాత్రం అలాగే ఉంటుంది. కాంగ్రెస్‌ను తుడిచేసినంత పని చేయడంతో బీజేపీకి హైప్ ఇచ్చినట్లయింది.
అప్పటి నుంచే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్నట్లు కనిపించింది. అయితే, పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చే సత్తా బీజేపీ లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే అధికారం కోసం కొట్లాట ఉండే చాన్స్ ఉంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీపై విమర్శలను తగ్గించారనే అభిప్రాయం వెల్లడవుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో కాస్త బలపడుతోందన్నది వాస్తవం. రాహుల్ పర్యటనలు, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ లాంటి నేతల పాదయాత్రలతో, కేడర్‌లో జోష్ పెంచే ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మాణిక్‌రావు థాక్రే వచ్చిన తర్వాత నేతల మధ్య సమన్వయం పెరిగిందనే విశ్లేషణ వస్తోంది. దీంతో కాంగ్రెస్ బలపడితే తమకు నష్టం అనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి హైప్ ఇవ్వడం వృథా ప్రయాస అనే కోణంలో కేసీఆర్ రియాక్షన్ కావడం లేదనే విశ్లేషణ వస్తోంది.
ఇప్పటికే కేసీఆర్ తనయ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ చార్జ్ షీట్‌లో పేరు నమోదైంది. ఈ క్రమంలో మోదీ చెప్పినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత జోరు పెంచే చాన్స్ ఉందనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. అయితే, కవిత అరెస్టు లాంటి పరిణామాలుంటే బీఆర్‌ఎస్‌కు సానుభూతి పవనాలు వీచే ఆస్కారం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ పెద్దలు కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఇటీవలే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న టైమ్‌లో బీఆర్‌ఎస్‌పై ఓ రేంజ్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఏ మేరకు పార్టీ దూసుకెళ్తుందనేది వేచి చూడాల్సిందే.
ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బీజేపీపై ఫోకస్ తగ్గించిన కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోకుండా చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also : CM KCR: రాజ్‌భవన్‌లు బీజేపీ కార్యాలయాలుగా మారాయి.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
