Times Now Navbharat Survey: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి మాంచి కిక్ ఇచ్చే వార్త.. 9 నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని లేటెస్ట్ సర్వే ఒకటి తేల్చింది. ఆ పార్టీ ఏపీలో ఏకంగా 24 నుంచి 25 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికలపై టైమ్స్ నౌ నవభారత్ సర్వే ఈ మేరకు సంచలన వివరాలు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని తట్టుకోవడం ఏ పార్టీకీ సాధ్యం కాదని టౌమ్స్ నౌ నవభారత్ సర్వే (Times Now Navbharat Survey) తేల్చి చెప్పింది. ఇప్పటికే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు ఈ వార్త రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందనడంలో సందేహమే లేదు.
రెండు నెలల క్రితం కూడా దాదాపు ఇలాంటి సర్వేనే సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడు, ఇప్పుడు కూడా ఏపీలో అధికార పార్టీకి తిరుగులేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఏపీలో క్షేత్రస్థాయిలో బలంగా నాటుకుపోయేలా వైఎస్సార్‌సీపీ అధినేత ప్రతి గడపకూ తిరగాల్సిందేనని ఎమ్మెల్యేలకు చాలా కాలంగా సూచిస్తున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటి తలుపూ తడుతున్నారు ఎమ్మెల్యేలు. ఒకటి రెండు చోట్ల ప్రతిపక్ష పార్టీలు, ఇతర పార్టీలకు చెందిన సానుభూతిపరులు వ్యతిరేకించినప్పటికీ మెజార్టీ ప్రజలు అధికార పార్టీకి, జగన్‌కు ఓటేస్తున్నారు.
సర్వేలో ఇంకా ఏం తేలిందంటే…
టైమ్స్ నౌ నవభారత్ సర్వేలో కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయమని తేలింది. మోదీ ప్రభుత్వానికి 285-325 సీట్లు వస్తాయని సర్వే తేల్చి చెప్పింది. ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం చాలా కష్టమని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 111-149 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. ఇక తృణమూల్ కాంగ్రెస్‌కు 20-22 ఎంపీ సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. బీజేడీకి 12-14 ఎంపీ సీట్లు, తెలంగాణలో కేసీఆర్ పార్టీ భారత రాష్ట్ర సమితికి 9-11 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి 4-7 ఎంపీ సీట్లు, అఖిలేష్ యాదవ్ పార్టీ ఎస్పీకి 4-8 సీట్లు, ఇతరులకు 18-38 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది.
జగన్‌కు ఎందుకింత ప్రజాదరణ?
2019లో సంచలన విజయాన్ని అందుకొని ఎవరూ ఊహించని విధంగా 151 సీట్లు, 50 శాతానికిపైగా ఓట్ షేరింగ్‌తో రికార్డులు తిరగరాశారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వచ్చీ రాగానే తాను ఇచ్చిన హామీల అమలుకు వేగంగా అడుగులు వేశారు. తొలుత గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్.. తర్వాత వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను డోర్ డెలివరీ చేసేలా ప్లాన్ చేశారు. గ్రామ సచివాలయాల్లోనే పది మందికి గవర్నమెంట్ ఉద్యోగాలిచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1.45 లక్షల శాశ్వత ఉద్యోగుల నియామకం, 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించారు. ప్రతి గడపకూ సేవలందేలా చేస్తున్నారు.
ఏ ఊర్లోకి వెళ్లి చూసినా సరే.. 2 వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. రైతన్నలకు విత్తనం నుంచి పంట అమ్ముకొనే దాకా అన్నీ దగ్గరుండి చూసుకొనేలా రైతు భరోసా కేంద్రాలు దర్శనమిస్తాయి. చాలా గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. నాడు-నేడు కింద ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. డిజిటల్ చదువులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటు, ఇంగ్లిష్ మీడియం చదువులు, సీబీఎస్‌ఈ సిలబస్, డిజిటల్ లైబ్రరీలు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఉచిత వైద్యం, ఆరోగ్య ఆసరా, రైతు భరోసా-పీఎం కిసాన్, పింఛన్లు తెల్లవారకనే ఇంటికే వెళ్లి ఇవ్వడం, ఫీజు రీయింబర్స్ మెంట్‌లో భాగంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి…. ఇలా చెప్పుకుంటూ పోతే భారీ సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు సీఎం జగన్. పౌరుడు ఊరు తన సేవల కోసం ఊరు దాటాల్సిన పని లేకుండా సేవలన్నీ అందుతున్నాయి. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత, సేవలందకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం లాంటివి తప్ప.. మెజార్టీ ప్రజలకు అందుతున్నాయనేది వాస్తవం.
ఇక కేవలం సంక్షేమమే కాదు.. అభివృద్ధిలోనూ సీఎం జగన్ తగ్గడం లేదు. రాష్ట్రంలో కొత్త పోర్టులు నాలుగు నిర్మాణం చేపట్టారు. కర్నూలు ఎయిర్‌పోర్టు నిర్మాణం, భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన, పోలవరం పనులు పరుగులు పెట్టించడం, వైయస్సార్ జిల్లాలో కడప స్టీల్ ప్లాంటు, కొప్పర్తి పారిశ్రామికవాడ.. ఇలా అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టారు.
ప్రతిపక్షం వైఖరి మారకపోవడం అతి పెద్ద మైనస్..
జగన్ చేస్తున్న కార్యక్రమాలు అన్నింటినీ గుడ్డిగా వ్యతిరేకించడం ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అది పెద్ద మిస్టేక్ అనే అభిప్రాయం వెల్లడవుతోంది. న్యూట్రల్ ప్రజలు కూడా ఇదే మాట చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్.. తన ప్రతి ప్రసంగంలోనూ ఒక మాట చెబుతుంటారు. గత ప్రభుత్వం చేయలేనిది, తాము చేసింది ఇదీ.. మీకు మంచి జరిగి ఉంటే నాకు అండగా, నాకు సైనికులుగా మీరే నిలవండి… అని చెబుతుంటారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి చేయలేనివి నాలుగేళ్లలో తాను చేశానని చెబుతుంటారు. ఈ విషయం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మింగుడు పడటం లేదు. జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ప్రతిపక్షం, వారికి సపోర్ట్ చేసే మీడియా, పత్రికలు, సోషల్ మీడియా… అందరూ కలిసి ఒకటే పంథా అవలంభిస్తున్నారు. గుడ్డిగా జగన్ ఏమీ చేయలేదు. రాష్ట్రం వెనక్కు వెళ్లిపోతోంది.. తాము అధికారంలో ఉంటే తప్ప రాష్ట్రం బతికి బట్ట కట్టలేదనే రీతిలో ప్రతిపక్ష పార్టీ తీరు ఉంటోంది. దీంతో ఆ పార్టీ హార్డ్ కోర్ అభిమానులు తప్ప న్యూట్రల్‌గా ఉండేవారు ఆమడదూరం వెళ్లిపోతున్నారు.
ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా అంగీకరించలేకపోవడం, ప్రతి కార్యక్రమం, పథకాన్ని కూడా విమర్శించడం, ప్రతిపక్ష పార్టీ ఓర్వలేని తనం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయం వెల్లడవుతోంది. ముఖ్యంగా ప్రసంగాల సమయంలోనూ విరక్తి కలిగేలా జుగుప్సాకర రీతిలో మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష పార్టీకి ప్రజాదరణ తగ్గడానికి ఇది కూడా ఓ కారణం అని చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ప్రజల్లో తిరగకపోవడం కూడా పెద్ద మైనస్‌గా మారే ప్రమాదం ఉంది.
Read Also : MSME Andhra Pradesh: 2023-24లో 1.50 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు.. 7.50 లక్షల మందికి ఉపాధి లక్ష్యం!
