Andhra Pradesh: ఏపీలో రాజకీయం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. చాలా కాలంగా ఇది కొనసాగుతున్నదే అయినప్పటికీ ఇప్పుడు రూపం మరింత మార్చుకుంది. సాధారణంగా ఏదైనా నేరం జరిగినప్పుడు సదరు నిందితులు పార్టీల ముఖ్య నాయకులతో దిగిన ఫొటోలు బయటకు వస్తుంటాయి. అదేంటో ఏపీలో ఇలాంటి నిందితులు అటు వైసీపీ (YSRCP), ఇటు టీడీపీ (TDP) ముఖ్య నాయకులతో ఉన్న ఫొటోలు ఏక కాలంలో బయటకు వస్తున్నాయి.
వైయస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) లేదా ఆ పార్టీకి చెందిన ప్రముఖులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో సదరు నిందితులు ఇప్పటికే దిగిన ఫొటోలు టీడీపీకి (Telugudesam Party) చెందిన సోషల్ మీడియా బయట పెడుతుంది. అందుకు పార్లల్ గా టీడీపీ అధినేత చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), లేదా టీడీపీ ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సేమ్ నిందితులు ఉన్న ఫొటోలను వైసీపీ బయట పెడుతోంది.
ఇంతకీ నిందితులు ఏ పార్టీకి చెందిన వారు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. ఇలా ఇప్పటికే అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఇరు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులతో ఫొటోలు ఉండటంతో అటు పోలీసులు, ఇటు ప్రజలకు కన్ఫ్యూజన్ గా మారుతోంది.
ఉదాహరణకు తాజాగా విజయవాడ వరదల (Vijayawada Floods) సందర్భంగా ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్దకు కొన్ని బోట్లు కొట్టుకు వచ్చాయి. ఈ బోట్లు బ్లూ కలర్ లో ఉండటం వల్ల వైసీపీ వాళ్లకు చెందినవేనని అధికార పార్టీ నేతలంతా మూకుమ్మడిగా ఆరోపణలు గుప్పించారు. ఇందుకు సంబంధించి మూడు నాలుగు రోజుల తర్వాత ఇది కుట్ర అని టీడీపీ పేర్కొంది.
కుట్రలో పాల్గొన్నది వైసీపీ కీలక నేత తలశిల రఘురాం బంధువులు, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు అని టీడీపీ ఆరోపించింది. వరద వచ్చే ముందు రోజు ఉద్దండరాయునిపాలెం వైపు గట్టున ఉండే పడవలు, గొల్లపూడి వైపు తరలించారని, భారీ పడవలను కేవలం ప్లాస్టిక్ రోప్ లతో కట్టి లంగరు వేశారని టీడీపీ ఆరోపించింది. మూడు భారీ పడవలను కలిపి కట్టారని, ఒక్కో పడవ 40నుంచి 50 టన్నుల బరువు ఉందని టీడీపీ చెబుతోంది. మొత్తం 5 పడవలు బ్యారేజ్ ను ఢీ కొట్టేలా కుట్ర చేశారంటూ విమర్శలు చేసింది. తలశిల రఘురామ్ బంధువు కోమటి రామ్మోహన్, నందిగం సురేష్ అనుచరుడు ఉషాద్రి అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారని, తలశిల రఘురామ్ తో నిందితులు ఉన్న ఫొటోలను టీడీపీ విడుదల చేసింది.
ఇక వైసీపీ కూడా టీడీపీకి దీటుగా కౌంటర్ ఇచ్చింది. టీడీపీకి చెందిన కోమటి జయరాం బంధువు రామ్మోహన్ అని ఆరోపించింది. నిందితుడు నారా లోకేష్ తో ఉన్న ఫొటోలను రిలీజ్ చేసింది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి.
అవసరాల కోసం తరచూ పార్టీ మారే కార్యకర్తలతో వచ్చిన సమస్య ఇదేనని ఆయా పార్టీల ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. హార్డ్ కోర్ అభిమానులు అయితే తప్ప.. ఇప్పటి కాలంలో పార్టీలు మారకుండా ఉండటం కష్టమంటున్నారు. కేసులు, జైలు జీవితానికి భయపడి, లేదా వ్యాపార అవసరాల కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరే వారితో ఇలాంటి సమస్యలే వస్తాయన్న విశ్లేషణలు వస్తున్నాయి.
Read also: YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
Varikapudisela: మారనున్న పల్నాడు రూపురేఖలు.. వరికపూడిశెల ఎత్తిపోతల సాకారం దిశగా అడుగులు!
CBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!
YS Jagan: అసెంబ్లీలో ఓ మూలన జగన్.. మళ్లీ సున్నా నుంచి మొదలు….?
Akhila Priya: నాకూ ఓ రెడ్ బుక్.. 100 మంది ఇబ్బంది పడతారు: అఖిల ప్రియ
