HomeAndhra PradeshGudivada Amarnath: వరదలపై ముందే సమాచారమున్నా ప్రజలను అలర్ట్ చేయలేదు

Gudivada Amarnath: వరదలపై ముందే సమాచారమున్నా ప్రజలను అలర్ట్ చేయలేదు

Gudivada Amarnath: వరదలపై ప్రభుత్వానికి ముందే సమాచారం ఉన్నా ప్రజలను అప్రమత్తం చేయలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. విశాఖపట్నం వైయస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. విజయవాడను ముంచెత్తిన వరదల్లో చనిపోయిన వారివి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని దుయ్యబట్టారు.

నగరాన్ని వరద ముంచెత్తబోతోందని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉన్నా, ప్రజలను అప్రమత్తం చేయలేదని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని, మరోవైపు వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. కావాలనే ప్రజల ప్రాణాలను ప్రభుత్వం గాలికొదిలేసిన ప్రభుత్వానిది కచ్చితంగా క్రిమినల్ నెగ్లిజెన్సే అని ధ్వజమెత్తారు.

విజయవాడ వరదలు ఏ మాత్రం ప్రకృతి వైపరీత్యం కాదని, అది ప్రభుత్వం సృష్టించిన వైపరీత్యం అన్నారు. సీఎం పబ్లిసిటీ యావకు పరాకాష్ట ఇదని చెప్పారు. అందుకే వరద మరణాలకు సీఎం, మంత్రివర్గంతో సహా, సంబంధిత శాఖల అధికారులంతా బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు.

బుడమేరు వరదపై నీటి పారుదల శాఖ డీఈ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా.. భిన్న ప్రకటనలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నాయన్నారు. విజయవాడలో వందలాది ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలు అందుబాటులో ఉన్నా, బాధితులను ఎందుకు తరలించలేక పోయారని ప్రశ్నించారు.

వరద ముంచెత్తినప్పటి నుంచి రోజూ ఒక్కో విధంగా మందీ మార్బలంతో అట్టహాసంగా పర్యటిస్తూ.. పగలు, రాత్రి తేడా లేకుండా మీడియాతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, ఆ వరదలపై స్పష్టంగా ముందస్తు సమాచారం ఉన్నా, ప్రజలను ఎందుకు అలర్ట్ చేయలేదన్న దానిపై సమాధానాన్ని దాటేస్తున్నారన్నారు. ఇలాంటి విపత్తులను పబ్లిసిటీకి వాడుకోవడానికే తప్ప, ప్రజలను ఆపద నుంచి గట్టెక్కించాలన్న ఆలోచన సీఎం చంద్రబాబుకు ఏ మాత్రం లేదన్నారు.

గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో శబరి, గోదావరి నదులకు భారీ వరదలు వచ్చినప్పుడు సుమారు 250 ఏజెన్సీ గ్రామాలకు చెందిన 18 వేల కుటుంబాలను 102 పునరావాస కేంద్రాలకు తరలించామని మాజీ మంత్రి గుర్తు చేశారు. కనీస రహదారి లేని చోట్ల లాంచీలు ఏర్పాటు చేసి, అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, అన్ని రకాలుగా అండగా నిలబడ్డంతో పాటు, ఒక్క ప్రాణనష్టం కూడా జరక్కుండా బాధ్యత తీసుకున్నామని వెల్లడించారు.

విజయవాడ నడిబొడ్డున వరదలు వస్తే, కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 45 మందికి పైగా చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం కోసం, ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టారు. ఆ దిశలోనే ప్రతి అంశాన్ని తమ పార్టీకి అన్వయిస్తున్నారని ఆక్షేపించారు.

తమ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ కృష్ణా రిటైనింగ్ వాల్ నిర్మించక పోయి ఉంటే, కృష్ణలంకతో సహా, నగరంలో ఇంకా ఎలాంటి విపత్తు జరిగి ఉండేదో, విజయవాడ వాసులు ఆలోచించాలని గుడివాడ అమర్నాథ్ అన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా చేసిన తప్పిదాలు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, బాధితులను ఆదుకోవాలని కోరారు.

ఇవీ చదవండి: Akhila Priya: చెప్పినట్టుగానే చేస్తున్న అఖిలప్రియ.. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం
Akhila Priya: నాకూ ఓ రెడ్ బుక్.. 100 మంది ఇబ్బంది పడతారు: అఖిల ప్రియ
Koneti Adimulam: టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు
Koneti Adimulam: టీడీపీ ఎమ్మెల్యే సెక్స్ వీడియో కలకలం.. వెంటనే సస్పెండ్.. అసలేం జరిగింది?
Devara: దేవర నుంచి మరో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌తో జాన్వీ పోటీ పడిందా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు