UK Inheritance Dispute: బ్యాంకు ఖాతాలో తండ్రితో పాటు తన పేరు ఉందని, భారత్‌లోని లాకర్‌లో బంగారాన్ని కూడా తండ్రి తనకే బహుమతిగా ఇచ్చారని సోనీ గ్రోవర్ వాదించారు. ఆ రెండు ఆస్తులపైనా తమకు వాటా ఉందంటూ ఆయన ముగ్గురు సోదరీమణులు లండన్‌లో కోర్టును ఆశ్రయించారు. సుమారు 16 లక్షల పౌండ్ల కుటుంబ సంపద చుట్టూ సాగిన ఈ వివాదంలో న్యాయమూర్తి నికోలస్ పార్ఫిట్ కుమారుడి వాదనలను తిరస్కరించారు. తండ్రి పొదుపు సొమ్ము వారసత్వ ఆస్తిలో భాగమని, లాకర్‌లోని విలువైన వస్తువులను కుటుంబం తరఫున భద్రపరిచే బాధ్యతను సోనీకి అప్పగించారని తేల్చారు.
ఇంగ్లండ్‌లో ఇంటి లెక్కతో మొదలైన వివాదం
హరి గ్రోవర్ 85 ఏళ్ల వయసులో 2024 సెప్టెంబర్‌లో వీలునామా లేకుండా మరణించారు. ఆయన ఆస్తుల నిర్వహణ బాధ్యతను కుమారుడు సోనీ గ్రోవర్ చేపట్టారు. పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌లో ఉన్న ఇంటితో కలిపి ఇంగ్లండ్‌లోని ఆస్తుల విలువను తొలుత 8.65 లక్షల పౌండ్లుగా చూపించారు. అయితే అక్కడి ఆస్తుల విలువే దాదాపు 11.5 లక్షల పౌండ్లు ఉంటుందని కుమార్తెలు ఐరన్ గ్రోవర్-జోన్స్, కిరణ్ కాటెరెల్, కెల్లీ పురి వాదించారు. తండ్రి పొదుపు సొమ్ము, భారత్‌లోని బంగారం ఎవరి వాటాలోకి వెళ్తాయన్న ప్రశ్నతో వివాదం లండన్‌లోని మేయర్స్ అండ్ సిటీ కౌంటీ కోర్టుకు చేరింది.
దుస్తుల మధ్య పాస్‌బుక్ ఎందుకు కీలకమైంది?
దాదాపు 3 లక్షల పౌండ్ల పొదుపు ఖాతాలో తండ్రి తన పేరును జాయింట్ హోల్డర్‌గా చేర్చారని, తాను కూడా అందులో డబ్బు జమ చేశానని సోనీ చెప్పారు. అయితే ఆయన సొంత డబ్బు జమ చేసినట్లు ఆధారాలు లభించలేదు. హరి గ్రోవర్ పాస్‌బుక్‌ను తన దుస్తుల మధ్య దాచిపెట్టుకునేవారన్న అంశాన్నీ న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. ఖాతాలోని సొమ్ముపై తండ్రి తన నియంత్రణను కొనసాగించారనే అభిప్రాయానికి వచ్చి, ఆ మొత్తాన్ని వారసత్వ ఆస్తిలో చేర్చాలని నిర్ణయించారు. The Independent
భారత్‌లోని బంగారం బహుమతిగా ఇచ్చారా?
భారత్‌లోని సేఫ్ డిపాజిట్ లాకర్‌లో 5 లక్షల పౌండ్ల వరకు విలువ చేసే బంగారు కడ్డీలు, ఆభరణాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. 2017లోనే తండ్రి వాటిని తనకు బహుమతిగా ఇచ్చారని సోనీ వాదించారు. ఆస్తులను సోదరుడు అందరికీ సమానంగా పంచుతాడని తండ్రి తమకు చెప్పారని అక్కాచెల్లెళ్లు కోర్టుకు వివరించారు. లాకర్‌లోని వస్తువులను సోనీ, ఆయన భార్య కుటుంబం తరఫున భద్రపరిచేందుకు ఉంచుకున్నారని న్యాయమూర్తి తేల్చారు. లాకర్ బాధ్యతలు తీసుకున్న సమయంలో అందులో ఏమేం ఉన్నాయో వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
పంపకాలకు ఆరు నెలలు.. న్యాయ ఖర్చులు సొంత వాటా నుంచే
ఆస్తుల నిర్వాహకుడిగా సోనీని కొనసాగిస్తూ, తోబుట్టువులతో కలిసి పంపకాల వ్యవహారాన్ని పరిష్కరించేందుకు కోర్టు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఈలోగా వారసత్వ ఆస్తులపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది. ముగ్గురు సోదరీమణుల న్యాయ ఖర్చుల కోసం సుమారు 80 వేల పౌండ్లను సోనీ తన వారసత్వ వాటా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్, వేల్స్‌లో వీలునామా లేకుండా మరణించిన వ్యక్తి ఆస్తి పంపకాలకు ఇంటెస్టసీ నిబంధనలు వర్తిస్తాయి. జీవిత భాగస్వామి లేదా సివిల్ పార్ట్‌నర్‌కు వర్తించే హక్కులకు లోబడి పిల్లలకు సమాన వాటాలు దక్కుతాయి. thetimes.com
అధికారిక సమాచారం
వీలునామా లేనప్పుడు ఆస్తి పంపకాలపై బ్రిటన్ ప్రభుత్వ మార్గదర్శకాలు
ఇవీ చదవండి: UK Scholarships: యూకే స్కాలర్‌షిప్‌లతో విదేశీ చదువు కల నిజం.. భారతీయ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్!
UK PM: హిందువుల మనోభావాలను కించపర్చిన యూకే ప్రధాని!






