Tirumala Samacharam 29-08-2023: కలియుగ వైకుంఠపురి శ్రీహరి నివాసం చెంత భక్తుల రద్దీ కొనసాగుతోంది. 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,263 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు చేకూరిందని టీటీడీ వెల్లడించింది. (Tirumala Samacharam 29-08-2023)
ఆ విమర్శలకు భయపడను: టీటీడీ చైర్మన్ భూమన స్పష్టీకరణ
తాను క్రిస్టియన్ అని, నాస్తికుడినంటూ కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి విమర్శలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను విమర్శలకు భయపడేవాడిని కానన్నారు. నేను క్రిస్టియన్ అని, నాస్తికుడినని విమర్శలు చేసేవారికి ఇదే నా సమాధానం అంటూ జవాబిచ్చారు. 17 సంవత్సరాల క్రితమే తాను టీటీడీ ఛైర్మన్ అయిన వ్యక్తినని గుర్తు చేశారు.
30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని తెలిపారు. తిరుమల ఆలయ మాడ వీధుల్లో చెప్పులతో వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది తానేనని గుర్తు చేశారు. అన్నమయ్య 600వ వర్ధంతి ఉత్సవాలు చేసింది కూడా తానేనని పునరుద్ఘాటించారు.
దళిత వాడల్లో శ్రీవేంకటేశ్వర కళ్యాణం చేయించానని తెలిపారు. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపేవాడిని కాదని స్పష్టీకరించారు. పోరాటాల నుంచి పైకి వచ్చిన వక్తిగా ఇలాంటి బెదిరింపులు, ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. శ్రీవారి దయతో హిందూధర్మం వ్యాప్తికి కృషి చేస్తానని భూమన మరోసారి కుండబద్ధలు కొట్టారు.
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, టీటీడీపై రమణ దీక్షితులు ట్వీట్
సీఎం జగన్ ను ట్యాగ్ చేస్తూ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. గతంలో ద్వేషం, ప్రతీకారంతో టీటీడీలో వంశపారంపర్య అర్చక వ్యవస్థను నాశనం చేశారని గుర్తు చేశారు. జస్టిస్ శివశంకర్ కమిటీ రిపోర్ట్ ని అమలు చేసేందుకు ఇదే సరైన సమయం అంటూ ట్వీట్‌లో రమణ దీక్షితులు పేర్కొన్నారు. అర్చకులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చాలని రమణ దీక్షితులు ట్వీట్ లో కోరారు.