Semi Jamili: దేశంలో ఓ వైపు జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. అదే సమయంలో సెమీ జమిలికి సిద్ధమవుతోంది కేంద్రం. లోక్ సభతో పాటు 13 రాష్ట్రాల ఎన్నికలతో సెమీ జమిలిగా మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. లోక్ సభకు ముందు 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభతో పాటు 4 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. లోక్ సభ తర్వాత 3 రాష్ట్రాలకు ఎన్నికలు ఉంటాయి. జమ్ముకశ్మీర్ ఎన్నికలనూ కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా లోక్ సభతో పాటు 13 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయని సంకేతాలు వెలువడుతున్నాయి. జమిలి బిల్లుతో సంబంధం లేకుండా సెమీ జమిలి నిర్వహించే అవకాశం ఉంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటనతో ముందస్తు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. (Semi Jamili)
ముందుస్తును సెమీ జమిలిగా మలిచే వ్యూహంలో కేంద్రం ఉంది. ఇప్పటికే రాజకీయ సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఓటమి తర్వాత బీజేపీలో అంతర్మథనం మొదలైనట్లు వినికిడి. మోదీ గ్రాఫ్ పడిపోతుందనే అంచనాలు బీజేపీ పెద్దలను కలవరపెడుతున్నాయట. ప్రతిపక్షాలు పూర్తిగా బలపడకముందే ఎన్నికల యోచన చేయాలని సన్నద్ధమవుతున్నారట. లోక్ సభకు ముందస్తు వస్తే… తెలుగు రాష్ట్రాలకు అప్పుడే ఎన్నికలు ఉండే అవకాశం ఉంది.
తెలంగాణ ఎన్నికలు రెండు నెలలు వాయిదా?
తెలంగాణ ఎన్నికలు 2 నెలలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ. 5 నెలల పాటు ఎన్నికల మూడ్ హోల్డ్ చేయాల్సిన స్థితి నెలకొననుంది. ఏపీలో 2 నెలలు ముందుగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ముందస్తు అధికార పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. తెలుగు రాష్ట్రాల సీఎంలకు సెమీ జమిలి సంకేతాలున్నాయనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కొంతకాలంగా సెమీ జమిలికి బీజేపీ సన్నద్ధమవుతోంది.
కొత్త పార్లమెంట్ ప్రారంభ సమయంలోనే బీజేపీ సీఎంలకు ప్రధాని మోదీ సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. తెరపైకి దేశం పేరు మార్పు లాంటి భావోద్వేగ అంశం రావడంతో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. అట్టహాసంగా జీ-20 సమావేశాలు నిర్వహణ కూడా ఓ ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. ఎర్రకోట నుంచి ప్రజాకర్షక పథకాల ప్రకటన చేసి ఎన్నికలకు వెళ్లాలని మోదీ ప్లాన్ చేస్తున్నారట. జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలకు కేంద్రం కసరత్తు చేస్తోందనేది కేంద్ర వర్గాల సారాంశం.
Read Also : Janasena fake news: ప్రభుత్వ బడి పిల్లల మరణాలపై జనసేన దుష్ప్రచారం.. వాస్తవాలు ఏంటి?