Aam Aadmi Bima Yojana: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన లాంటి సామాజిక భద్రద పథకాలను విలీనం చేసింది. ఈ రెండింటికీ కలిపి ఆమ్ ఆద్మీ బీమా యోజన అని పేరు మార్చింది కేంద్ర ప్రభుత్వం. 2013 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. పథకం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, లబ్ధిదారులు ఎలాంటి ఫలితాలు పొందవచ్చు, తదితర వివరాలు ఇవీ.. Aam (Aadmi Bima Yojana)
ఈ పథకంలో చేరాలంటే వయసు రుజువు చేసే ధ్రువపత్రం తప్పనిసరిగా ఉండాలి. అంటే రేషన్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్, పాఠశాల ధ్రువపత్రం నుంచి తీసుకున్నది, ఓటరు జాబితా, ప్రముఖ సంస్థ/ప్రభుత్వ శాఖ జారీ చేసిన గుర్తింపు కార్డు, ప్రత్యేక గుర్తింపు కార్డ్ (ఆధార్ కార్డు) లాంటివి ఏదో ఒకటి కలిగి ఉండాలి. ఈ పథకం ప్రారంభంలో గరిష్ట పరిమితి రూ .30,000 బీమా కోసం సభ్యుడు ప్రతి ఏడాదికి 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 50% సామాజిక భద్రత నిధి నుంచి సబ్సిడీ కూడా ఉంటుంది. (Aam Aadmi Bima Yojana)
18 సంవత్సరాలు పూర్తయి 59 ఏళ్లు మించకుండా ఉండే వారు ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకానికి ప్రాథమిక అర్హత కలిగిన వారు అవుతారు. సాధారణంగా ఈ పథకంలో చేరదల్చుకొనే వారు ఇంటి పెద్ద అయి ఉండాలి. లేదా దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న కుటుంబాలై ఉండాలి. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్పీని నియమించింది. నోడల్ ఏజన్సీ అంటే కేంద్ర మంత్రివర్గ శాఖ/రాష్ట్ర ప్రభుత్వం/ భారత కేంద్ర పాలిత ప్రాంతాలు/ఇతర సంస్థాగతమైన ఏర్పాట్లు/ఏదైనా నమోదిత ఎన్జీవో నిబంధనల ప్రకారం పథకం అమలు జరిపేందుకు కేంద్రం నియమించిన సంస్థ. ఇళ్లు లేని గ్రామీణ ప్రాంతాల ప్రజల విషయంలో, నోడల్ ఏజెన్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వం/పథకం అమలు జరిపేందుకు నియమించిన కేంద్ర పాలిత ప్రాంతం అని అర్థం.
ఇళ్లు లేని గ్రామీణ ప్రజల విషయంలో మిగిలిన 50% ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం/కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తాయి. ఇతర వృత్తి సమూహాల విషయంలో మిగిలిన 50% ప్రీమియాన్ని నోడల్ ఏజన్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఈ బీమా తీసుకున్న సభ్యుడు సహజ మరణం పొందితే బీమా కాలంలో గరిష్ట పరిమితి 30 వేలు హామీ మొత్తం నామినీకి చెల్లిస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తూ మరణిస్తే పొందే ప్రయోజనాలు వేరుగా ఉంటాయి.
దుర్ఘటన కారణంగా మృత్యువాత పడితే రూ.75 వేలు, ప్రమాదంలో శాశ్వత వైకల్యం చేకూరితే రూ.75 వేలు, కళ్లు లేదా అవయవాలు పోతే రూ.37,500 లబ్ధిదారులు పొందవచ్చు. ఈ పథకంలో చేరిన వారికి ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. లబ్ధిదారుని ఇద్దరు పిల్లలకు నెలకు రూ.100 చొప్పున ఆరు నెలలకోసారి అందుతుంది. జనవరి, జూలై ఒకటో తేదీన అందజేస్తారు. బీమా ప్రీమియం దారు చనిపోయిన సందర్భాల్లో ధృవీకరించిన కాపీతో పాటు అసలు మరణ దృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ప్రమాద బీమా ప్రయోజనం విషయంలో ఎఫ్ఐఆర్ కాపీ, శవ పరీక్ష నివేదిక, పోలీసు విచారణ నివేదిక, పోలీసు తీర్మానం నివేదిక/పోలీసు తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
Read Also: YSR Yantra Seva: వైఎస్సార్ యంత్రసేవ పథకం.. ప్రభుత్వం ఏం ఇస్తుంది?