Sleep: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కంటి నిండా నిద్రపోవడం (Sleep) చాలా మందికి కష్టంగా మారుతోంది. పనిఒత్తిడి, తీసుకొనే ఆహారంలో మార్పులు జరగడం వల్ల వేళకు నిద్రపోలేకపోతుంటారు. రాత్రిపూట బెడ్ మీదకు వెళ్లినా నిద్ర రాక సెల్‌ఫోన్ చూసుకుంటూ చాలా సమయం గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చూస్తుండగానే అర్ధరాత్రి అయిపోతుంది. ఉదయం అరకొర నిద్రతోనే లేచి పనులకు వెళ్లిపోవాల్సి వస్తుంది.
నిద్రలేమికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా పని ఒత్తిడి, ఇంట్లో వాతావరణం కూడా కారణాలుగా ఉంటాయి. అయితే, ఈ సమస్య కారణంగా మరో పెద్ద సమస్య వెంటాడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తారని తాజాగా జరిపిన ఓ సర్వేలో వెల్లడైందట. ఈ నేపథ్యంలో నిద్రపోవడం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
నిద్రపోవాలంటే మొదట ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే హాయిగా నిద్ర పడుతుంది. గదిలోని వాతావరణం, వెలుతురు, సౌండ్, వస్తువులు పెట్టుకోవడం లాంటివి నిద్రపై ప్రభావం చూపుతాయి. బెడ్‌పై ఎప్పటికప్పుడు దుప్పటి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నిద్రపోయే ముందు వీలైనంత వరకు శబ్దాలు లేకుండా చూసుకుంటే కాస్త డీప్ స్లీప్‌కు అవకాశం ఉంటుంది.
నిద్రలేమితో బాధపడుతున్న వారు నిరాశపూరిత వాతావరణంలో ఉంటారని సర్వేలో తేటతెల్లమైంది. సాధారణంగా అలసిపోయిన వారిలో చికాకు కనిపిస్తారు. అదే పరిస్థితి తక్కువ నిద్రపోయే వారిలోనూ ఉంటుందట. దీంతో అకారణంగా ఎదుటి వారిపై విరుచుకుపడతారని పరిశోధకులు స్పష్టం చేశారు. దాంతోపాటు పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం, ఎప్పుడూ కోపంగా ఉండటం లాంటివి ఉంటాయట.
వీలైనంత వరకు రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన శరీరం ఆటోమేటిక్‌గా నిద్రను అలవాటు చేసుకుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ లాంటి వాటిని అవాయిడ్ చేయాలి. వీటిలోని కెఫైన్ వల్ల నిద్ర రాకుండా చేస్తాయని అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. ఇక రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం వల్ల కూడా నిద్ర బాగా వస్తుందని ఎక్స్‌పర్టులు చెబుతున్నారు.
మనిషి రోజుకు కనీసం ఆరు గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరు గంటలకన్నా తక్కువ నిద్రపోతే దాన్ని తక్కువ నిద్ర అంటారు. మరోవైపు 10 గంటలకన్నా ఎక్కువ నిద్రపోతే దాన్ని ఎక్కువ నిద్ర అని చెబుతారు. అయితే, ఆరు గంటలకన్నా తక్కువ నిద్ర, పది గంటలకన్నా ఎక్కువ నిద్ర.. రెండూ మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నవజాత శిశువు రోజుకు 18 గంటలు నిద్రపోవాలి. అలాగే చిన్నారులకు 11 గంటల నిద్ర అవసరం. టీనేజీ వారికి 10 గంటల నిద్ర అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి సమస్యకు కారణాలు అనేకం ఉంటాయని, అనారోగ్యం ఒక్కటే కారణంగా చెప్పడానికి వీల్లేదని నిపుణులు అంటున్నారు. అయితే, నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని మనస్తత్వ నిపుణులు పేర్కొంటున్నారు. నిద్రలేమి వల్లనే కొన్ని రకాల అనారోగ్యాలు మనిషిని చుట్టుముడతాయని పేర్కొంటున్నారు. ఒక్కరోజు సరిగా నిద్రపోక పోయినా ఆ ప్రభావం నిత్య జీవితంలో చూపిస్తుందంటున్నారు. వీలైనంత వరకు రోజుకు 8 గంటలు పెద్దవాళ్లు నిద్రపోయేలా చూసుకోవాలట.
Read Also : The Nightmare Sleeping: పీడ కలలతో నిద్ర పట్టడం లేదా? ఈ చిట్కాలు పాటించండి