Karthika Masam: ఈ ఏడాది కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక మాసం అనగానే పూజల మాసం. ఆధ్యాత్మికత వెల్లివిరిసే నెల. సాధారణంగా దీపావళి మరుసటి రోజే ఈ మాసం ఆరంభం అవుతుంది. అయితే, ఈ ఏడాది మాత్రం పండుగ ముగిసిన రెండో రోజున ప్రారంభమవుతోంది. నవంబర్ 14న తెల్లవారుజాము నుంచే పాఢ్యమి ఘడియలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో ఆరోజు నుంచే ఆకాశ దీపం కూడా ప్రారంభం అవుతోంది. మంగళవారం నుంచి పవిత్ర కార్తీక మాసం స్టార్ట్ అయినట్లు లెక్క. ఇక ఈ మాసంలో ఏ పూజలు చేస్తే ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. (Karthika Masam)
ఆధ్మాత్మిక పరిమళాల జల్లు కురిసే నెల కార్తీక మాసం. ఈ మాసం ప్రత్యేకత గురించి పూర్వం నుంచే పెద్దలు చెబుతూ వస్తున్నారు. శ్రావణ మాసంలో శుక్రవారానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో కార్తీక మాసంలో సోమవారానికి అంతటి ప్రత్యేకత విశిష్టత ఉన్నాయి. కార్తీకమాసాన వచ్చే దశమి, ఏకాదశి, ద్వాదశి లాంటి తిథులకు అంతే గొప్పదనం ఉంది. శ్రావణమాసంలో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం పూజలు చేస్తాం. అదే కార్తీక మాసంలో అయితే, ఆమె పతిదేవుడు శ్రీహరిని పూజిస్తాం. ఇక ఈ మాసంలో రెండో రోజున భగినీహస్త భోజనం చేయడం పరిపాటిగా వస్తోంది. అంటే సోదరి ఇంటికి ఆమె సోదరుడు వెళ్లి ఆమె వండిన వంటలను తిని ఆశీర్వాదం తీసుకొని, కానుకలు ఇచ్చిపుచ్చుకొని రావడం. దీన్నే భగినీహస్త భోజనం అంటారు. ఇలా చేయడం వల్ల సోదరుడికి యమగండం తొలగిపోతుందని చెబుతారు.
ఇక కార్తీక మాసంలో వచ్చే తేదీలు, తిథులు, పూజలు, ఫలాల విషయానికి వస్తే.. నవంబర్ 17వ తేదీన శుక్రవారం నాగుల చవితి పర్వదినం. ఆరోజున శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. నాగుల కట్టకు వెళ్లి పాలు పోసి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. మరుసటి రోజు పంచమి. ఈ పంచమిని జ్ఞాన పంచమిగా అభివర్ణిస్తారు. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం పూజలు, అర్చనలు చేయించుకున్న భక్తులకు జ్ఞానాభివృద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక ఇదే మాసంలో షష్టి రోజున సుబ్రహ్మణ్య షష్టిగా పిలుస్తారు. ఆరోజు కూడా నాగుల పూజ చేస్తారు. పూజ అనంతరం బ్రహ్మచారికి ఎర్ర బట్ట లేదా కండువా లేదా పంచె దానం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఇక నవంబర్ 27వ తేదీన కార్తీక మాసం రెండో సోమవారం. కార్తీక పౌర్ణమి కూడా అదే రోజు. అత్యంత పవిత్రమైన రోజుగా చెప్పొచ్చు. ఈరోజు శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేయడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని పండితులు ఉద్భోదిస్తున్నారు.
కార్తీక పౌర్ణమి నాడు యువతులు పెళ్లయిన తొలి ఏడాదిలో కార్తీక పౌర్ణమి పూజను ఆచరించడం ఆనవాయితీ. గుమ్మడి కాయ, 16 రకాల పండ్లను ఈశ్వరుని గుడిలో అందజేస్తారు. ఆరోజు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చాక అద్దంలో చంద్రుడిని చూసిన తర్వాత ఒక్కపొద్దును విడిచి భోజనం తింటారు. ఇలా చేసిన కొత్త జంటలకు సత్సంతానం కలిగి కాపురంలో కలహాలు లేకుండా సుఖసంతోషాలతో గడుపుతారని పండితులు చెబుతున్నారు. ఇక డిసెంబర్ 4న కార్తీక మాసం మూడో సోమవారం. మరోవైపు డిసెంబర్ 11వ తేదీన నాలుగో సోమవారం, అదే నెల 13వ తేదీన బుధవారం పోలిస్వర్గం ఉంటాయి. కార్తీక మాసంలో ఆఖరి రోజు చాలా విశిష్టత కలిగినది. పితృదేవతల పేరు మీద నిరుపేదలకు అన్నదానం చేసిన వారికి పితృదోషాలు తొలగి సద్గతులు కలుగుతాయని పెద్దలు చెబుతారు.
ఇలా నియమ నిష్టలతో కార్తీక మాసమంతా ఆచరిస్తే జీవితంలో మంచి మార్పులు చూస్తారు. ఈ మాసంలో మరోముఖ్య విషయం ఏంటంటే.. కేవలం శాకాహారమే తీసుకోవడం. ఇలా చేస్తే ఆలోచనలు కూడా పవిత్రంగా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. ఇక ఇది చలికాలం కాబట్టి అనాధలకు, రోడ్డు పక్కన ఉండే వారికి స్వెటర్లు, దుప్పట్లు,కంబళ్లు దానం చేసిన వరాఇకి శివకేశవుల అనుగ్రహం తప్పక సిద్ధిస్తుందట. అయితే, ఇలా దానధర్మాలు చేసే వారు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచితేనే మంచిదని పెద్దలు చెబుతున్నారు. తీవ్రమైన కోరికలు కలిగించేలా చేసే మద్యం, మాసం, ఉల్లి, వెల్లుల్లి లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ కార్తీక మాసంలో పవిత్రమైన రోజులుగా భావించే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, సోమవారాల్లో నిష్టాగరిష్టులై పూజలాచరిస్తే శతకోటి పుణ్య ఫలాలు మీ సొంతమవుతాయని పెద్దలు సూచిస్తున్నారు. ప్రతి రోజూ దీపారాధన, శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి, శివయ్యను పూజించడం, దానధర్మాలు చేయడంతో ఈ మాసాన్ని గడిపితే సకలశుభప్రదమని పండితులు స్పష్టం చేస్తున్నారు.
Read Also : Karthika masam: మీకు తెలుసా? కార్తీక మాసం శుక్రవారం నాడు ఇలా చేస్తే ధనవంతులవుతారట..!