TDP Janasena: మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య.. తరచూ వార్తల్లో ఉంటూ హల్‌చల్ చేస్తుంటారు. వయసు మీద పడినప్పటికీ యువ నాయకుడిలా ఆలోచనలు పంచుకుంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటే చూడాలని ఒక కాపు నాయకుడిగా పరితపిస్తుంటారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్‌పై దూకుడుగా కామెంట్స్ చేస్తుంటారు ఈ పెద్దాయన. (TDP Janasena)
ఇటీవల చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జనసేనాని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కలిసే వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం చంద్రబాబు ఆరోగ్య కారణాలతో బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, పవన్ కల్యాణ్ ప్రకటన అనంతరం టీడీపీ-జనసేన సంయుక్తంగా విలేకరుల సమావేశాలు, కీలక భేటీలు జరిపాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి మేనిఫెస్టో తెరపైకి వచ్చింది.
చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో జైలుకు వెళ్లక ముందు సూపర్ సిక్స్ పేరుతో ఆరు గ్యారెంటీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సూపర్ సిక్స్‌లో..
1. మహాశక్తి పేరుతో 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 అందజేస్తామని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. ఏడాదికి రూ.18 వేలు సాయం. అలాగే తల్లికి వందనం పేరుతో ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున సాయం. దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం.
2. యువగళం: నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే దాకా నెలకు మూడు వేల రూపాలు సాయం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.
3. అన్నదాత: రైతన్నలకు ఏడాదికి రూ. రూ.20 వేలు అందజేత.
4. ఇంటింటికీ నీరు: ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీరు ఇచ్చేలా ఇంటింటికీ కొళాయి కనెక్షన్.
5. పూర్ టు రిచ్: పేదల ఆదాయం ఐదేళ్లలో డబుల్ చేస్తూ సంపన్నులుగా చేయడం
6. బీసీలకు రక్షణ చట్టం: ప్రస్తుత ప్రభుత్వంలో బీసీలపై దాడులు పెరిగాయని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే బీసీ రక్షణ చట్టం తెచ్చి అండగా నిలుస్తామని పేర్కొన్నారు.
ఇక ఇటీవల టీడీపీ-జనసేన కూటమి హామీలు కూడా ఒకటిరెండు మినహా ఇదే సీన్. అయితే, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తాజాగా భేటీ అయిన నేపథ్యంలో తన ఆలోచనలను హరిరామజోగయ్య షేర్ చేసుకున్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఓ రిపోర్టు కూడా ఇచ్చారు. కాగా, టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో 11 అంశాలతో కూడిన సంక్షేమ పథకాల వివరాలను టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రకటించారు.
ఇందులో ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షలు అందించాలని పేర్కొన్నారు. అలాగే పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకూ వర్తింపజేయడం, గతంలో సూపర్ సిక్స్ హామీలపై, జనసేన ప్రతిపాదించిన ఐదు పథకాలపై చర్చించారు. ఉచిత ఇసుక విధానం, యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.10 లక్షల సాయం, రాజధానిగా అమరావతిగా కొనసాగింపు, ఉద్యాన, ఆక్వా, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, మన రాష్ట్రం, మన ఉద్యోగాలు తదితర పథకాలను జనసేన ప్రస్తావించింది.
సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు దీటుగా మేనిఫెస్టో తెస్తామని ప్రగల్భాలు పలికిన టీడీపీ-జనసేన.. తీవ్రంగా నిరాశపరిచాయని సొంత వర్గాల నుంచే విమర్శలు రావడం విశేషం. అందుకు ఉదాహరణగా హరిరామజోగయ్య స్పందనే కనిపిస్తోంది. టీడీపీ-జనసేన మేనిఫెస్టో తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఇలా అయితే జగన్‌ను ఢీకొట్టడం ఎలా అంటూ హరిరామజోగయ్య తీవ్రంగా నిర్వేదం వ్యక్తం చేశారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో ఆశాజనకంగా, జనరంజకంగా లేదని హరిరామజోగయ్య స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలను ఇది నెరవేర్చేలా లేదన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇది దీటుగా లేదని కుండబద్ధలు కొట్టారాయన. ఈ పరిణామం టీడీపీ-జనసేన అగ్ర నేతల్లో గుబులు పుట్టిస్తోందనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఉమ్మడి మేనిఫెస్టో తీవ్రంగా నిరాశపరిచిందన్న మాటలు బహిరంగంగా పేర్కొనడం ద్వారా అధికార పార్టీకి మరింత బలం చేకూర్చినట్లవుతోందని చెబుతున్నారు. కనీసం రానున్న రోజుల్లో 4 కోట్ల ప్రజానీకాన్ని సంతృప్తిపరిచేలా, ఆకర్షణీయంగా మ్యానిఫెస్టోను తయారు చేయాలని ఆయన హితవు చెప్పడం గమనార్హం. ఇలా ఆయన ఒక శ్రేయోభిలాషిగా సలహా ఇచ్చారు.
ఒకవైపు జగన్ సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నారంటూ టీడీపీ, జనసేన ఆరోపిస్తుంటాయి. మరోవైపు సీఎం జగన్ కంటే మెరుగైన సంక్షేమ పథకాలతో వస్తామని చెబుతాయి. అప్పులకుప్పగా మార్చారని ఆరోపిస్తూ అంతకంటే మెరుగ్గా పథకాలు ఇస్తామంటాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. ఏరోజూ ఆలోచనచేయని విధంగా ప్రస్తుతం సీఎం జగన్ అన్ని వర్గాల సంక్షేమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అమ్మ ఒడి అనే పథకం గతంలో ఎన్నడూ లేదు. కానీ ఇప్పుడు ఎంత మంది పిల్లలుంటే అందరికీ సాయం చేస్తామని చెప్పడాన్ని ప్రజలు ఏమనుకోవాలి? గతంలో అధికారాన్ని అనుభవించి ఎందుకు చేయలేదనే ప్రశ్నకు వీరి వద్ద జవాబు ఉందా?
