అగ్రరాజ్యం అమెరికాలో (America) సంపన్నులపై భారం పెరగనుంది. పెంచిన ట్యాక్స్ ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు ఆ దేశ (America) అధ్యక్షుడు జో బైడెన్ తమ దేశ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ ఫెడరల్ ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్‌లో 6.9 లక్షల కోట్ల డాలర్ల ఖర్చు ప్రతిపాదనలను బైడెన్ చేశారు. వచ్చే దశాబ్ద కాలంలో ద్రవ్యలోటు 2.9 లక్షల కోట్ల డాలర్ల మేర తగ్గించే కార్యాచరణను అందులో పొందుపరిచారు. ఇక తాజా బడ్జెట్‌లోని ప్రతిపాదనల నేపథ్యంలో ఆ దేశంలో సంపన్నులపై ట్యాక్స్ భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
సంపన్నుల కేటగిరీలో పన్నులు పెంచేందుకు బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏటా వార్షిక ఆదాయం పది కోట్ల డాలర్లకుపైగా ఆర్జించే వ్యక్తులకు కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు. సంవత్సరానికి నాలుగు లక్షల డాలర్లకుపైగా ఆదాయం చేకూరుతున్న పౌరులు చెల్లించే పన్నులను తగ్గిస్తూ 2017లో నాటి ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన ఉపశమనాలను ప్రస్తుతం బైడెన్ సర్కార్ వెనక్కు తీసుకోనుండటం గమనార్హం. అమెరికా ప్రజా ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లదే మెజార్టీ ఉంది. అయితే, వారు బైడెన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలనను ఎంత మేరకు ఆమోదిస్తారనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు ఇండో-పసిఫిక్ కోసం 2,500 కోట్ల డాలర్లను కేటాయించింది బైడెన్ సర్కార్. వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దేశం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా దుందుడుకు చర్యలను అడ్డుకొనేందుకు, వారికి గట్టిగా సమాధానం చెప్పేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కీలక ముందడుగు వేసింది అగ్ర రాజ్యం. ఆ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన మెరుగు పరిచేందుకు, తమ దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది.
చైనా దేశం దూకుడు చర్యలకు కళ్లెం వేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రస్తుత బడ్జెట్‌లో ఏకంగా రెండున్నర కోట్ల డాలర్ల నిధులు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. చైనా చర్యలను అడ్డుకొనేందుకు, అమెరికా సురక్షితంగా ఉండేందుకు ఈ నిధులు దోహదపడతాయని అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. చైనా చర్యలను ఇప్పటికే ఎండగడుతున్నారు బైడెన్.
బెలూన్లు పేల్చేసిన తర్వాత వ్యూహాలకు పదును..
ఇటీవల చైనా స్పై బెలూన్ వ్యవహారం ప్రపంచ దేశాలను కలవరపెట్టింది. అమెరికాపై ప్రయోగించిన ఈ స్పై బెలూన్‌ను చైనా నుంచి ఆపరేట్ చేస్తూ ఇక్కడి రక్షణ, నిఘా విభాగాలపై కన్నేసింది చైనా. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు జో బైడెన్ సూచనల మేరకు నిఘా బెలూన్‌ను అమెరికా సైనిక బలగాలు పేల్చేశాయి. సముద్రంలో కుప్ప కూలిన ఆ బెలూన్‌ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో నిఘాకు సంబంధించిన పలు చిప్‌లు, సామగ్రి దొరికాయని అమెరికా వెల్లడించింది. మరోవైపు అమెరికా చర్యలపై చైనా మండిపడింది. తమ దేశ పౌర సేవల కోసమే బెలూన్‌ను వినియోగిస్తున్నామని, బెలూన్ శకలాలను తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. అయితే, చైనా చర్యలను అమెరికా ఖండించింది.
అమెరికాతో పాటు అనేక దేశాలపై చైనా నిఘా బెలూన్లు ప్రయోగించిందని అనేక వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే జో బైడెన్ ప్రభుత్వం చైనా కవ్వింపు చర్యలపై సీరియస్ అయ్యారు. ఈ బడ్జెట్‌లో నిధులు పెంచడాన్ని బట్టి పరిశీలిస్తే.. ఆయన మరింత పట్టు బిగించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
Read Also : Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్ రికార్డు.. మార్చి త్రైమాసికంలో 137.5 శాతం లాభం