హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) మెల్ల మెల్లగా కోలుకుంటోంది. ఆ నివేదిక నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అదానీ వ్యవహారం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్లోనూ భారీ కుదుపు సంభవించింది. ప్రస్తుతం అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్.. (Adani Enterprises) రికార్డు సృష్టించింది.
2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాల్లో అద్భుతం చేసింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ లాభం ఏకంగా 137.5 శాతం పెరిగిపోయింది. ఆ త్రైమాసికంలో రూ.722.48 కోట్ల లాభాన్ని చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో చూస్తే.. రూ.304.32 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఎయిర్‌పోర్టులు, హైవే వ్యాపారాలు లాభసాటిగా మారడం వల్ల భారీ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించడం సాధ్యమైందని సంస్థ పేర్కొంది.
సంస్థ ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 24,865.52 కోట్లు ఉండేది. దాంతో పోలిస్తే, 2023 మార్చి త్రైమాసికంలో 26.06 శాతం వృద్ధి నమోదు చేయడం గమనార్హం. ఈ త్రైమాసికంలో రూ. 31,346.05 కోట్లకు ఆదాయం చేరుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 7 ఎయిర్‌పోర్టుల ద్వారా 2.14 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఏడాది కిందట కంటే ఇది 74 శాతం ఎక్కువ. సరుకు రవాణాలోనూ అదానీ ఎంటర్‌ప్రైజెస్ 14 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం.
ఇక అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిర్వహిస్తున్న బొగ్గు ట్రేడింగ్ వ్యాపారంలోనూ గణనీయమైన ప్రగతి కనిపిచింది. ఏకంగా 42 శాతం పురోగతి సాధించింది. ఈ ఏడాది విపరీతమైన వేడిగాలులు వీస్తాయని అంచనా ఉన్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరిగే చాన్స్ ఉంటుందని సంస్థ వెల్లడించింది. దీంతో విద్యుత్ ప్లాంట్లు బొగ్గు నిల్వలను పెంచడం మొదలు పెట్టాయి. ఈ ప్రయోజనం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు బాగా దక్కింది. కొత్త ఇంధన వ్యాపారం సుమారు 15 శాతానికిపైగా వృద్ధి చెందింది. గనుల సేవల వ్యాపారం 7 శాతం పుంజుకుంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 207.4 శాతం పెరిగింది. దీంతో రూ. 2421.6 కోట్లకు చేరుకుందని సంస్థ తెలిపింది. 2021-22లో ఇది రూ.787.7 కోట్లుగా ఉండేది. FY22తో పోలిస్తే FY23లో ఆదాయం 96 శాతం పెరిగి రూ. 1,38,715 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో, ఈ కంపెనీ నిర్వహిస్తున్న 7 విమానాశ్రయాల ద్వారా 7.48 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకున్నారు. 2023 మార్చి నాటికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 38,320 కోట్ల అప్పుల్లో ఉంది. 2022 మార్చి చివరి నాటికి ఉన్న రూ. 41,024 కోట్ల కంటే ఇవి తగ్గడం ఊరట కలిగించే విషయం.
మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వాటాదార్లకు డివిడెండ్ కూడా ప్రకటించింది. ఒక రూపాయి ముఖ విలువున్న ఒక్కో ఈక్విటీ షేర్‌కు 120 శాతం లేదా రూ.1.20 డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక అదానీ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ ఛైర్మన్‌గా గౌతమ్ అదానీని మరో ఐదేళ్ల పాటు నియమించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమిస్తూ కంపెనీ బోర్డ్ ఆమోదం తెలపడం విశేషం. నిన్న గురువారం మార్కెట్ ముగిసే సమయానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర 3.93% లాభం నమోదు చేసింది. దీంతో షేరు ధర రూ. 1,911 వద్ద ముగిసింది.
Read Also : Zelensky: పుతిన్‌కు త్వరలో శిక్ష తప్పదు.. పాపం అనుభవిస్తాడు!