ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఖాళీలు (AP DSC 2023) భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టే ముందే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల సంఖ్య ఎంత? ఎన్ని పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనిపై మాట్లాడారు. త్వరలో డీఎస్సీ (AP DSC 2023) నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనేది (AP DSC 2023) మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. డీఎస్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.
2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు డీఎస్సీ ప్రకటించలేదు. గతేడాది ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించిన జగన్ సర్కార్.. తర్వాత త్వరలోనే డీఎస్సీ కూడా ఉంటుందని పేర్కొంది. తాజాగా మంత్రి బొత్స కూడా ఇదే ప్రకటన చేశారు. ఇక వచ్చే సంవత్సరం 2024లో ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు నిరుద్యోగుల నుంచి వచ్చే అసంతృప్తిని తట్టుకొని ఎన్నికల్లో నెగ్గాలంటే తప్పనిసరిగా డీఎస్సీ ప్రకటించాల్సిందే. లేదంటే అంసతృప్తి జ్వాల రగిలే ప్రమాదం ఉంది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు గ్రహించారు. అందుకే త్వరలో డీఎస్సీ ఉంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 15 వేల పోస్టులు ఖాళీలున్నాయని తెలుస్తోంది. అయితే, వాస్తవంగా చూస్తే.. కొన్ని స్కూళ్లు విలీనం చేసిన తర్వాత, రేషనలైజేషన్ పేరిట కొన్నిసూళ్లు మూత పడిన తర్వాత ఖాళీల సంఖ్యపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న విద్యాసంవత్సరానికి ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లలో 39,008 పోస్టులు, సెకండరీ స్కూల్ స్థాయిలో 6,347 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయని, వీటిని ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సి ఉంటుందని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆమోదిత మండలిలో కేంద్రం వెల్లడించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై కేంద్రానికి వివరణ కూడా ఇచ్చింది.
గందరగోళానికి త్వరలో తెర పడేనా?
ఇప్పటికే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. డీఎస్సీ-2018కి సంబంధించి 7,254, ప్రత్యేక డీఎస్సీ-2019లో 602, డీఎస్సీ-2008కు సంబంధించి 1,910, డీఎస్సీ-1998కి సంబంధించి 4,534 పోస్టులు భర్తీ చేసినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 2022 ఆగస్టులో 507 పోస్టుల పరిమిత డీఎస్సీ వేశామని, అయితే, దీనిపై కోర్టులో కేసు నడుస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం 717 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జగన్ సర్కార్ చెబుతోంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖకు వివరణ కూడా ఇచ్చింది.
ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్ని, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరిస్తే భర్తీ చేసే పోస్టులు ఎన్ని అనే అంశంపై ఇప్పుడు నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఓవైపు గగ్గోలు పెడుతున్నాయి. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్.. ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నాయి. ఉపాధ్యాయ ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదని నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళానికి తెరదించుతూ త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
మనబడి నాడు-నేడు, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన భేష్..
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూళ్ల రూపు రేఖలు మారుస్తానంటూ ప్రకటన చేశారు. ఈ విషయంలో చెప్పినట్లుగానే చేస్తున్నారు. స్కూళ్లు ప్రస్తుత దశలో ఎలా ఉన్నాయో ఫొటోలు తీసి పంపండి.. వాటిని నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు దశల్లో స్కూళ్లను బాగు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే తొలి దశ పూర్తయింది. రెండో దశ కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అమ్మఒడి పథకానికి 2023-24 వార్షిక బడ్జెట్‌లో రూ.6,500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. విద్యార్థులను తల్లులు బడికి పంపితే చాలు.. తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తోంది ప్రభుత్వం. నాడు-నేడు కింద స్కూళ్ల అభివృద్ధి, విద్యా దీవెన, వసతి దీవెన, యూనిఫాం అందజేత.. ఇలా జగన్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేసేందుకు వీల్లేకుండా చేశారు ముఖ్యమంత్రి.
Read Also : BRS Party : మహారాష్ట్రలో సై.. కర్ణాటకలో నై.. బీఆర్ఎస్ విస్తరణలో కేసీఆర్ ప్లాన్ ఏంటి?