BRS Party : మహారాష్ట్రలో సై.. కర్ణాటకలో నై.. బీఆర్ఎస్‌ విస్తరణలో కేసీఆర్‌ ప్లాన్‌ ఏంటి?

బీఆర్ఎస్‌ పార్టీ (BRS Party) అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. (CM KCR) ప్రస్తుతం జాతీయ పార్టీగా మార్చాక విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రపై దృష్టి పెట్టారు. సరిహద్దు ప్రాంతాల్లో తెలుగు వారి ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో మూడుసార్లు బీఆర్ఎస్ (BRS Party) బహిరంగ సభలు నిర్వహించిన సీఎం కేసీఆర్.. అక్కడ రాజకీయ నేతలను పార్టీలో చేర్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సర్పంచులు.. ఇలా ముఖ్య నేతలను ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో గణనీయమైన ఓట్లు, సీట్లు సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకొని ముందుకెళ్తున్నారు. అయితే, మరో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ మాత్రం బీఆర్ఎస్‌ (BRS Party) తరఫున పోటీకి నై అంటున్నారు కేసీఆర్. ఇంతకీ ఆయన మదిలో ఏముంది?

టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. లక్షలాదిగా జనం తరలి వచ్చారు. జనంతో పాటు జాతీయ నేతలు, ముఖ్యమంత్రులు కూడా విచ్చేశారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మూజీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ సహా పలువురు పేరుమోసిన జాతీయ నేతలు కేసీఆర్ సభకు తరలి వచ్చారు. దీంతో జాతీయ పార్టీకి బూస్ట్‌ వచ్చినట్లయింది. ఇదే ఊపులో మహారాష్ట్ర నాందేడ్‌ సభ నిర్వహించిన సీఎం కేసీఆర్.. తదుపరి కార్యాచరణను ప్రకటించారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు.. దేశ వ్యాప్తంగా రాబోయేది భారత రాష్ట్ర సమితేనంటూ జోస్యం చెబుతున్నారు కేసీఆర్.

పోటీ చేస్తామని చెప్పి.. ఇప్పుడు సైలెంట్‌ అయిన కేసీఆర్..

కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఖమ్మం సభలో చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం ఆ దిశగా ముందడుగు వేయడం లేదు. దీంతో బీఆర్ఎస్‌ శ్రేణులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి.. కేసీఆర్‌కు సన్నిహితుడు. జేడీఎస్‌కు మద్దతుగా కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారు. మరోసారి కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేద్దామని కేసీఆర్ గతంలో పిలుపునిచ్చారు. అయితే, ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. కుమారస్వామికి మద్దతుగా కనీసం ప్రచారంలో పాల్గొనలేదు కేసీఆర్. బీఆర్ఎస్ పోటీకి కూడా దూరంగా ఉంది. ఇందులో మతలబేంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్ అయ్యింది. మిత్రపక్షం అని చెప్పి దూరంగా ఉండటంతో జాతీయ స్థాయిలో పార్టీ పెట్టిన జోష్‌ అంతా బూడిదపాలయ్యిందని చర్చ జరుగుతోంది.

కర్ణాటకలో చెప్పినట్లుగానే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే హైదరాబాద్‌ నగరం తరహాలో బెంగళూరులో కూడా బీఆర్ఎస్ అభిమానులు ఉన్నారు. కనీసం తక్కువలో తక్కువ అంటే దాదాపు 30 స్థానాల్లో కేసీఆర్‌ ప్రచారం చేసి ప్రభావితం చేయగల సత్తా ఉందని అందరూ అనుకున్నారు. అయితే, ఇంతలోనే పోటీకి దూరంగా ఉండటంతో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అక్కడ కూడా బీఆర్ఎస్‌తో కలిసి పని చేయడానికి జేడీఎస్ సిద్ధంగా ఉంది. కుమారస్వామి ఎప్పుడు పిలిచినా కేసీఆర్ కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే, ఖమ్మం సభ తర్వాత వీరి మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయనే వాదన వినిపిస్తోంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసింది లేదు. కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు.

మహారాష్ట్రలో వేగం.. కర్ణాటకలో కదలికే లేదు..

మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు బహిరంగ సభలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా నేతలను బరిలోకి దింపేలా ప్లాన్‌ చేస్తున్నారు. అయితే, మొదటి టార్గెట్‌ ఎన్నికలుగా కర్ణాటకను భావించి ఇప్పుడు కేసీఆర్‌ సైలెంట్‌ కావడం వెనుక ఆంతర్యం ఏమిటనేది అంతుచిక్కడం లేదని నిపుణులు అంటున్నారు. ఇక కర్ణాటకలో ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పాత్ర జీరో అని నిర్ధారణ అయ్యింది. అలాగని కుమార స్వామి కూడా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్‌ మా మార్గనిర్దేశకుడని మాత్రమే చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో కూడా ఎక్కడా కేసీఆర్, బీఆర్ఎస్‌ పార్టీ పేరు ఎత్తడం లేదు జేడీఎస్ నేతలు.

మరోవైపు కేసీఆర్‌తో కలిసి వేదిక పంచుకున్న సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా ప్రస్తుతం కేసీఆర్‌కు దూరంగా ఉంటున్నారని చెప్పొచ్చు. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చాలన్న ప్రతి సమావేశంలోనూ ప్రకాశ్‌ రాజ్‌ పక్కనే కనిపించేవారు. ప్రకాశ్‌ రాజ్‌ కన్నడిగుడు కావడంతో ఆయనను రాజకీయంగా వాడుకోవచ్చనే ఆలోచనతో కేసీఆర్‌ ఉండేవారని చెబుతున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా ప్రకాశ్‌ రాజ్‌ కూడా సైలెంట్‌ అయిపోయారు. గత ఎన్నికల్లో కర్ణాటకలో పోటీ చేసి ఓటమిపాలైన ప్రకాశ్‌ రాజ్.. ప్రస్తుత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జస్ట్‌ ఆస్కింగ్‌ పేరుతో ట్యాగ్‌లు చేస్తూ బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో ప్రకాశ్‌ రాజ్‌ను బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా చేసినా ప్రభావం పెద్దగా ఉండదని కేసీఆర్‌ భావిస్తున్నట్లు భోగట్టా. అందుకే ఇరు వర్గాలూ సైలెట్‌ అయిపోయాయని తెలుస్తోంది.

స్టీల్‌ ప్లాంట్‌ అంశంలోనూ రాజకీయంగా వాడుకున్న బీఆర్ఎస్

ఇక బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది. ఏపీలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబును కూడా పార్టీలో చేర్చుకున్న కేసీఆర్‌.. ఏపీలో బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాల్సిందిగా సూచించారు. అందులో భాగంగా ఇప్పటికే వైజాగ్‌ స్టీల్ ప్లాంటును తామే కొంటామని ప్రకటన ఇచ్చింది తెలంగాణ సర్కారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ, ప్రభుత్వరంగ సంస్థలుగానీ, బిడ్డింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం కండిషన్లు పెట్టింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొన ఏపీ సర్కార్‌ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

అయితే, మొన్నామధ్య ఉక్కు శాఖ సహాయ మంత్రి ఏపీలో పర్యటించి స్టీల్‌ప్లాంట్‌పై ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. దీంతో ఈ క్రెడిట్‌ అంతా తమదేనని, తమ ప్రకటనతోనే కేంద్రం వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. ఆ మరుసటి రోజే కేంద్రం దీనిపై వెనక్కి తగ్గేదే లేదని క్లారిటీ ఇచ్చింది. మొత్తంగా తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్రలోనే ప్రస్తుతానికి బీఆర్ఎస్‌ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి కేసీఆర్‌ నేతృత్వంలోనే ముందుకెళ్తారా అనేది ప్రశ్నార్థకమే. ఎవరు కలిసి వస్తారు? ఎవరు దూరంగా ఉంటారనేది కూడా ఎన్నికల నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read Also : Vizag Steel : విశాఖ ఉక్కు వివాదాన్ని బీఆర్ఎస్ వాడుకుంటోందా? కేంద్రం వెనకడుగు క్రెడిట్ ఎవరికి దక్కుతుంది?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles