Punganur girl murder: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత హత్యలు, మానభంగాలు, కిడ్నాప్ లు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. శాంతిభద్రతల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం మిన్నకుండిపోతోందన్న అపవాదు వినిపిస్తోంది. ముఖ్యంగా యువతులు, మహిళలు, చిన్నారులపై దాడులు, హత్యలు, మానభంగాల ఘటనలు కలవరపెడుతన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక (Punganur girl murder) కిడ్నాప్, హత్యపై ప్రభుత్వం సత్వరమే స్పందించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తొలి నెల రోజుల్లోనే 20 మంది బాలికలు, యువతులపై అత్యాచారాలు జరిగినట్లు తెలుస్తోంది. వారిలో నలుగురు హత్యకు గురయ్యారు. వేధింపులు తట్టుకోలేక 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. టెక్నాలజీ వాడకంలో చంద్రబాబును ఆద్యుడిగా చెబుతారు. కానీ ఇన్ని ఘటనలు జరుగుతున్నా కనీసం సీసీ కెమెరాల పర్యవేక్షణ సైతం కరువైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేరస్తులను పట్టుకోవడంలో, నేరాల కట్టడిలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం మారిన తర్వాత నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన బాలిక ఉదంతం కలకలం రేపింది. ముచ్చుమర్రికి చెందిన వాసంతి అనే 5వ తరగతి చదువుతున్న బాలికను 2024 జూలై 7న కొందరు అపహరించారు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. తల్లిదండ్రుల ఆందోళనతో ఒక రోజు తరువాత కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆఖరికి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేసి కృష్ణా నదిలో పడేసినట్టు తేల్చారు.
చివరకు బాలిక మృతదేహాన్ని కూడా అప్పగించలేకపోయారు. తాజాగా తమ కుమార్తె కనిపించడంలేదంటూ పుంగనూరుకు చెందిన ముస్లిం కుటుంబం మూడు రోజులపాటు వేడుకున్నా ప్రభుత్వం, పోలీసులు సరిగా స్పందించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా అభం శుభం ఎరుగని చిన్నారిని కిడ్నాప్ చేసి దుండుగలు అత్యంత పాశవికంగా హతమార్చారని చెబుతున్నారు. ఈ ఘటనలో దుండగులను పట్టుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలిక అంజుమ్ ను కొందరు 4 రోజుల క్రితం అపహరించి ఆపై హత్య చేశారు. ఆదివారం రాత్రి బాలిక అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, మూడు రోజులు గడిచాక కూడా పోలీసులు ఆచూకీ కనిపెట్టలేదని బాధితులు వాపోయారు. రాయచోటి నుంచి వచ్చిన పోలీసు జాగిలాలు బాలిక ఇంటి చెంగలాపురం రోడ్డులోని ముళ్ల పొదల వద్దకు వెళ్లి ఆగిపోయాయని చెబుతున్నారు. చివరకు బుధవారం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో అంజూమ్ మృతదేహం లభ్యమైంది. హత్య అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
బాలిక శరీరంపై గాయాలున్నాయని, రక్తస్రావం అయిందని స్థానికులు చెప్పినట్లు సమాచారం. ఆమె శరీరంపై గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారని పోలీసులు చెబుతున్నారు. మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరిగి ఫైల్స్ కాలిపోతే సీఎం చంద్రబాబు హడావుడి చేసి పోలీసు ఉన్నతాధికారులందరినీ పంపారని, ఇప్పుడు ఏడేళ్ల బాలిక హత్యపై కనీసం స్పందించలేదని వైయస్సార్ సీపీ ఆరోపిస్తోంది.
ఎన్నికలకు ముందు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 34 వేల మంది బాలికలను అపహరించారని పవన్ కల్యాణ్ దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు రాష్ట్రంలో బాలికలు, యువతులు, మహిళలపై అరాచకాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని వైయస్సార్ సీపీ మండిపడుతోంది.
ఇవీ చదవండి: Musi river: మూసీ ప్రాంత పేదలకు ప్రత్యామ్నాయం కల్పిస్తాం: రేవంత్ రెడ్డి
Peddi Reddy: చిన్నారి అంజుమ్ హత్య అత్యంత దారుణం: పెద్దిరెడ్డి
Kurasala Kannababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు విషప్రచారం ఆపాలి
YS Sharmila: సెక్యులర్ పార్టీ రైటిస్ట్ పార్టీ అయ్యింది.. పవన్‌పై వైయస్ షర్మిల ఫైర్
Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియపై కలెక్టర్ కు గంగుల నాని ఫిర్యాదు
