YS Jagan at Chittoor: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరులో విజయా డెయిరీని పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరిస్తానని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన జగన్.. ఇవాళ సాకారం చేశారు. పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేసిన సీఎం జగన్.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆ తర్వాత బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. (YS Jagan at Chittoor) తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు డెయిరీ మూతపడేలా చేసిన నాటి పరిస్థితులు, డెయిరీ పునఃప్రారంభం తర్వాత కలిగే ఉపాధి, పాడి రైతులు, అక్కచెల్లెమ్మలకు చేకూరే లాభాన్ని వివరించారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం జగన్. (YS Jagan at Chittoor)
ఏనాడో మూతబడిన అతి పెద్ద డెయిరీ.. చిత్తూరు డెయిరీని ఈ రోజు తెరిపించేందుకు నాంది పలుకుతున్నానని జగన్ చెప్పారు. దేశంలోనే టాప్ 3 మెడికల్ కాలేజీల్లో ఒకటైన వెల్లూర్ సీఎంసీ, వెల్లూర్ మెడికల్ కాలేజీకి ఆనాడు దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు స్థలాన్ని కేటాయించి ఇక్కడ ఆ మెడికల్ కాలేజీని తీసుకొచ్చేందుకు స్వప్నం కన్నారని తెలిపారు. ఆ మెడికల్ కాలేజీ నిర్మాణానికి 14 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయన బిడ్డ ఈ రోజు పునాది రాయి వేస్తున్నాడని తెలిపారు. ఇదే చిత్తూరు జిల్లాలో తన పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఒకప్పుడు ఇక్కడ చిత్తూరు డెయిరీ ద్వారా రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించేవన్నారు. అదే చిత్తూరు డెయిరీని 2022లో కుట్ర పూరితంగా మూసేశారన్నా అని చెప్పిన మాటలు తనకు ఈరోజుకూ గుర్తున్నాయని చెప్పారు.
“1945లో చిల్లింగ్ ప్లాంట్‌గా ఏర్పాటైన చిత్తూరు డెయిరీ 1988లో రోజుకు ఏకంగా 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రాసెసింగ్ చేస్తున్న పరిస్థితులు కనిపించాయి. 1989-1993 మధ్యలో చిత్తూరు డెయిరీలో సగటున రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే స్థాయికి చిత్తూరు డెయిరీ చేరుకుంది. 1993 వచ్చేసరికి సరిగ్గా అదే సమయంలో ఈ జిల్లా ఖర్మ కొద్దీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కళ్లు పడ్డాయి. 1992లో తన సొంత డెయిరీ హెరిటేజ్ డెయిరీ పురుడు పోసుకున్న తర్వాత చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టేస్తూ పోయారు. చిత్తూరు డెయిరీని చెప్పా పెట్టకుండా 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీసు ఇవ్వకుండా మూత వేసే స్థాయికి తీసుకెళ్లారు. రైతులకే కాకుండా ఉద్యోగులకు కూడా వందల కోట్ల బకాయిలు పెట్టారు. 2003 నవంబర్ 27న లిక్విడేషన్ ప్రకటించేశారు. ఇదంతా తన సొంత డెయిరీ పాల కోసం జరిగిన కార్యక్రమం.
హెరిటేజ్ కోసం నిలువునా ముంచేశారు..
హెరిటేజ్ డెయిరీ, చంద్రబాబు లాభాల కోసం సొంత జిల్లా రైతుల్ని నిలువునా ముంచేసిన పరిస్థితులు చూశాం. సహకార రంగంలోని అతి పెద్ద డెయిరీ.. చిత్తూరు డెయిరీ నష్టాల్లోకి వెళ్తుంటే.. ప్రైవేట్ హెరిటేజ్ డెయిరీ మాత్రం ఇదే కాలంలో లాభాల్లోకి పరుగెత్తుకుంటూ పోయింది. చిత్తూరు డెయిరీ స్థాయిలోనే అమూల్ డెయిరీ కూడా ఉండేది. అమూల్ డెయిరీ అక్కడి నుంచి మొదలు పెడితే ప్రపంచంలోనే అతి పెద్ద కోఆపరేటివ్ డెయిరీగా మారింది. 20 ఏళ్లుగా మూత పడ్డ ఈ చిత్తూరు డెయిరీని చూసి దానికి జీవం పోస్తానని హామీ ఇచ్చాను. నేను విన్నాను… నేను ఉన్నాను… అని చెప్పి ఆరోజు అన్నా.. ఇచ్చిన మాట ప్రకారం ఇదే డెయిరీని 185 కోట్ల బకాయిలు తీర్చి నేడు తలుపులు తెరుచుకుంటున్నాయి. అమూల్ వారు 385 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని చెప్పడానికి సంతోషపడుతున్నా.
లాభాలను ప్రతి ఆరు నెలలకోసారి బోనస్‌ఇచ్చి డెయిరీకి పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలకు లాభాలను పంచిపెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రూ.150 కోట్లతో తొలి దశలో పనులు మొదలవుతున్నాయి. మరో 10 నెలల కాలంలోనే పాల ప్రాసెసింగ్ మొదలవుతుంది.
– 5 నుంచి ఏడెనిమిదేళ్ల కాలంలో 10 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే స్థాయికి పోతుంది. లక్షల మంది రైతన్నలు, అక్కచెల్లెమ్మలకు ఈ చిత్తూరు జిల్లానే కాక, రాయలసీమ చుట్టుపక్కల జిల్లాలు, నెల్లూరు జిల్లాలో వాళ్ల పాలకు రేటు వస్తుంది. సహకార రంగాన్ని పునరుద్ధరిస్తూ దేశంలోని అతి పెద్ద కోఆపరేటివ్ డెయిరీ అయిన అమూల్‌ను తీసుకొచ్చాం. వారితో కలిసి 2020 డిసెంబర్ 2న జగనన్న పాల వెల్లువను ప్రారంభించాం.
పొదుపు మహిళా డెయిరీ సంఘాలకు పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలకు అమూల్ రాక ముందు 2020 డిసెంబర్ 2న గేదె పాల రేటు 67 ఉంటే అమూల్ వచ్చాక 8 సార్లు రేటు పెంచుకుంటూ పోయింది. ఈరోజు గేదె పాలు 89.76 రూపాయలు. అంటే ఏకంగా 22 రూపాయలు పెరిగింది. ఆవు పాలు లీటర్ అమూల్ రాక ముందు రూ.32 కూడా సరిగ్గా ఉండేది కాదు. అమూల్ వచ్చిన తర్వాత 43.69 రూపాయలు.. ఏకంగా 11 రూపాయలు పెరిగింది. మోసం చేయడానికి అలవాటు పడ్డ డెయిరీలకు అమూల్ వచ్చిన తర్వాత రేట్లు పెంచడం మొదలు కావడంతో వాళ్లకు జ్వరం రావడం మొదలైంది. అప్పుడు వాళ్లు కూడా రేటు పెంచక తప్పని పరిస్థితి వచ్చిందనేదానికి కారణం.. మీ బిడ్డ ప్రభుత్వం.
ఒక నీతి మాలిన రాజకీయ నాయకుడి కథ…
మనం తీసుకున్న చర్యల వల్ల అక్కచెల్లెమ్మలకు, పాడి రైతన్నలకు అక్షరాలా 4,243 కోట్ల అదనపులబ్ధి చేకూరింది. చిత్త శుద్ధితో ఈ రంగంపై మనం చూపిన మమకారానికి ఇది నిదర్శనం. తాను పెట్టుకున్న డెయిరీ కోసం అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ మనిషి సొంత లాభం కోసం కూతురిని ఇచ్చిన మామనైనా, సొంత లాభం కోసం సొంత జిల్లా రైతునైనా బలి పెట్టేస్తాడని చెప్పే ఒక మనీ మనిషి కథ ఇది. ఒక నీతి మాలిన రాజకీయ నాయకుడి కథ ఇది. వెల్లూర్ సీఎంసీ, వెల్లూర్ మెడికల్ కాలేజీ మన చిత్తూరుకు వస్తుంటే అడ్డుకుంటున్నది సాక్షాత్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి గజదొంగల ముఠాలోని సభ్యుడు.. ఈనాడు రామోజీ రావుగారి వియ్యంకుడు. స్థలాలివ్వకుండా ఈ గడ్డ మీదకి మంచి మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్న చరిత్ర. ఈ అన్యాయాలను పూర్తిగా సరిదిద్దుతూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తున్నా.
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు చిత్తూరు జిల్లాకు ఎన్ని అన్యాయాలు చేశాడని అడిగితే.. చెప్పడానికి కోకొల్లలుగా కథలు కథలు చెబుతారు. ఇదే చిత్తూరు జిల్లాకు ఏం మేలు చేశాడు చంద్రబాబు అని అడిగితే.. చెప్పేందుకు, చెప్పుకొనేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. చంద్రగిరిలో గెలవను అని కుప్పానికి వలస వెళ్లాల్సి వచ్చింది ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆ కుప్పంలో ప్రజలు కూడా ఇప్పుడు బైబై బాబు అంటున్నారు. రాజకీయ జీవనం ముగిసిపోతున్న ఈ దశలో కుప్పంలో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాను అని మరో డ్రామా ఆడుతున్నాడు. అక్కడా చిత్తశుద్ధి లేదు. దానికి మనం పర్మిషన్ ఇవ్వడం లేదని ఆ నెపాన్ని మనపై వేస్తున్నాడు. కుప్పంలో పేదలకు ఇల్లు కట్టిస్తోంది మన ప్రభుత్వం అయితే, 35 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకుంటా అనేది బాబు మనస్తత్వం.
భజన బృందంగా మారిన పార్టీలు గుర్తు తెచ్చుకోవాలి…
చిత్తూరు డెయిరీ ఒక్కటే కాదు.. రాష్ట్రంలో 1995 నుంచి 2004, తొమ్మిదేళ్లలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశాడో బాబు భజన బృందంగా మారిన ఇతర పార్టీల వారు కూడా గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసి తనకు నచ్చిన వారికి నచ్చిన రేటుకు అమ్మేసి, వాటి అన్నింటిలో కూడా పని చేస్తున్న వేల మంది కార్మికులకు ఉద్యోగాల్ని కూడా బలి తీసుకున్నది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు. పరిశ్రమలన్నీ కూడా ఎవరికి అమ్మాడంటే.. అమ్మింది దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వరరావు.. అంతా తన వాళ్లకే, తన చుట్టూ ఉన్న వాళ్లకే. ఎంతకు అమ్మాడయ్య అంటే అది కూడా పప్పూ బెల్లాలకే.. కనీసం ప్రభుత్వానికి కూడా మంచి జరగలేదు.
పప్పూ బెల్లాలకు అమ్మేశారు..
తనవారికి అమ్మేందుకు, పప్పూ బెల్లాలకు అమ్మేందుకు ముడుపులు తీసుకున్నందుకు ఆయన ప్రభుత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. మనమేమే ప్రజల కోసం గ్రామ, వార్డు సెక్రటేరియట్ తెరిస్తే.. ఈ పెద్ద మనిషి మాత్రం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర సెక్రటేరియట్‌లో మరో సెక్రటేరియట్ తెరిచాడు. ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగ సంస్థలు ఏవి ఎవరు కొనుక్కుంటారంటే వాళ్ల దగ్గర నుంచి ముడుపులు గుంజుకొని కారు చౌకగా పప్పులు, బెల్లాలకు అమ్మేసే పరిస్థితి. ఆయన హయాంలో మూసినవి, అమ్మేసినవి ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలు.. అక్షరాలా రాష్ట్రంలో 54.
2004లో ఈయనగానీ పోకపోయి ఉంటే ఆర్టీసీ ఉండేది కాదు. హాస్పిటళ్లు, గవర్నమెంట్ రంగంలో ఉండేవి కాదు. పిల్లలు చదువుకుంటున్న స్కూళ్లు కూడా గవర్నమెంట్ రంగంలో ఉండేవి కాదు. అన్నీ కాసినేని నానికో, నారాయణకో, చైతన్నకో.. లేదా హాస్పిటల్లయితే తనకు నచ్చిన ఇంకొకల్లకు హోల్ సేల్‌గా అమ్మేసేవాడు. ఉద్యోగాలు ఊడగొట్టడం, ప్రభుత్వరంగాన్ని తన స్వార్థం కోసం కూల్చేయడాన్ని గొప్ప విషయంగా చిత్రీకరించేవారు. అప్పట్లో ఓ పుస్తకం కూడా రాశాడు. “ప్రైవేటైజేషన్ ఎ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్” అని పుస్తకాన్ని రిలీజ్ చేశాడు.
అదే చంద్రబాబు నమ్మకం, ధైర్యం…
ఎన్నికలు వస్తే మాత్రం మోసం చేయడానికి విశాఖపట్నం పోయి అక్కడ స్టీల్ ప్లాంట్ ముందు ధర్నా చేస్తానంటాడు. ఈ మనిషి మనస్తత్వం ఎలాంటిదో ఆలోచన చేయాలి. ఇవన్నీ అందరికీ తెలియదు. ఎప్పుడో మరిచిపోతారనేది బాబు ధైర్యం. తన మేనిఫెస్టో కూడా తాను ఎన్ని మోసాలు చేసినతా ప్రజలు మరిచిపోతారనేది నమ్మకం. అధికారం కోసం సొంత మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడం కూడా ఇప్పటి తరానికి అది తెలీదనేది తన ధైర్యం. నమ్మకం. తనకు మద్దతుగా నిలిచిన ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారి పాత్ర కూడా ఎవరికీ గుర్తుండదు అనేది ఆయన ధైర్యం, నమ్మకం.
వెన్నుపోటు వీరుడు.. ప్యాకేజీ శూరుడు..
చివరికి దత్త పుత్రుడిని కూడా తాను ఏ ఎన్నికల్లో, ఎందుకు, ఎప్పుడు ఎలా ప్రజలమీదకు వదులుతాడో తెలియదనేది కూడా చంద్రబాబు నమ్మకం. మనలాగా ఇంటింటికీ వెళ్లడం గానీ, ఫలానా మంచి చేశాం, మంచిని చూసి మాకు ఓటేయండని గడప గడపకూ వెళ్లే పరిస్థితి వీళ్లకెవరికీ లేదు. చక్రాల్లేని సైకిల్ ఎక్కలేని ఆయన ఒక నాయకుడు. ఎవరైనా తైలం పోస్తే గానీ గ్లాసు నిండని వ్యక్తి మరో నాయకుడు. ఒకరు వెన్నుపోటు వీరుడు. మరొకరు ప్యాకేజీ శూరుడు. వీరిద్దరికీ పేదల బతుకుల గురించి, ప్రజల కష్టాలు, మాట ఇస్తే విలువ గురించి గానీ వీళ్లెవరికీ ఏ మాత్రం తెలియదు. అలా బ్రతకాలన్న ఆలోచన లేదు.
ఇద్దరూ కలిసి ప్రతి వర్గాన్నీ మోసం చేశారు..
ఇద్దరూ కలిసి ప్రజల్ని మోసం చేస్తూ 2014-2019 మధ్య ఇద్దరూ ఈ రాష్ట్రాన్ని ఏలారు. ఇద్దరూ కలిసి రైతులను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, చిన్న పిల్లలను, సామాజిక వర్గాలను ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడిచారు. ఏకంగా 2.23 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. ఈమాదిరిగా మనలా డీబీటీ చేతకాదు. వీరికి తెలిసిందల్లా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం.అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పుడు కూడా పెరుగుదల శాతం ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు. అప్పట్లో చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదని అడుగుతున్నా.
అప్పట్లో బటన్లు, లేవు, నొక్కాలన్న మనసూ లేదు. జన్మభూమి కమిటీల నుంచి మొదలు పెడితే పైన ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు.. చంద్రబాబుతో కలవడం, అందరూ కలిసి దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, తినుకోవడం. ఈ చంద్రబాబుకుగానీ, దత్తపుత్రుడు గానీ ఇద్దరూ కూడా నాన్ రెసిడెంట్ నాయకులు. ఇద్దరూ కూడా కనీసం మన రాష్ట్రంలో కూడా ఉండరు. ఇద్దరి కోసం హైదరాబాద్‌కు పోవాల్సిందే. ఇద్దరికీ సామాజిక న్యాయం అసలే తెలియదు. బాగా తెలిసింది మాత్రం సామాజిక అన్యాయం.
పేదలకు గవర్నమెంట్‌బ డుల్లో ఇంగ్లిష్ మీడియం తెస్తామంటే అడ్డుకుంటారు. పేదలకు ఇళ్లపట్టాలిస్తామంటే దాన్నీ అడ్డుకుంటారు. సంక్షేమ పథకాలు ఇస్తామంటే దాన్ని కూడా అడ్డుకొనే కార్యక్రమం చేస్తారు. వీళ్లకు సామాజిక న్యాయం తెలుసా? ఇలాంటి దుర్మార్గులతో, అన్యాయస్తులతో యుద్ధం చేస్తున్నాం. చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేద వాడి గుండెల్లో ఉండటం కోసం మీ బిడ్డ అధికారం కోసం తపన పడుతున్నాడు. ఈరోజు యుద్ధం జరుగుతోంది పేదవాడితో, పెత్తందార్లకు యుద్ధం జరుగుతోంది. వీళ్ల మాదిరిగా నేను అబద్ధాలు చెప్పలేను, మోసాలు చేయలేను.
నేను నమ్ముకుంది పైన దేవుడిని, ప్రజలను మాత్రమే…
నాకు పొత్తులుండవు, తోడేళ్లన్నీ ఏకమవుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెబుతారు. అన్యాయం చేస్తారు. వీళ్లుచెబుతున్న అబద్ధాలు, విషప్రచారాలు నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అనేదిమాత్రమే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని కోరుతున్నా..” అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.