Chittoor Dairy: చిత్తూరు డెయిరీ.. దీన్నే విజయా డెయిరీ అని కూడా అంటారు. ఈ డెయిరీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. చంద్రబాబు హయాంలో మూతపడిన విజయా డెయిరీ.. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో కొత్త జవసత్వాలు చేకూరుస్తున్నారు. అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో పాడి రైతులకు లాభాలు కలిగేలా చేసింది. ఇందులో భాగంగా అమూల్‌కు చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ బాధ్యతలు అప్పగించింది జగన్ సర్కార్. వేలాది మంది పాడి రైతులకు మేలు చేసేలా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి అలా ఎలా బాగు చేస్తారనే రీతిలో ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. ఈ అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. (Chittoor Dairy)
ప్రతిపక్షం వాదన ఏంటి?
చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. (CM YS Jagan) ఆ మాట తప్పారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రూ.6 వేల కోట్ల ప్రజా సంపదను అమూల్‌కు దోచి పెడుతున్నారని మండిపడుతోంది. సహకార వ్యవస్థను మూసివేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కమీషన్లు, కేసుల మాఫీ కోసమే అమూల్‌కు (Amul Milk Dairy) చిత్తూరు డెయిరీని అప్పగిస్తున్నారా? అంటూ ప్రశ్నలు గుప్పిస్తోంది. చిత్తూరు డెయిరీ వ్యవస్థాపకుడి విగ్రహం కూలగొట్టడం ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనం కాదా? అని నిలదీస్తోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అమూల్ మోసాన్ని గ్రహించి దూరం పెట్టాయని, జగన్ సర్కార్ నెత్తినపెట్టుకొని ఆదరిస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
చిత్తూరు డెయిరీ విషయంలో అసలేం జరిగింది?
1960లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీకృత పాల ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లాలో పాడి రైతులకు తోడుగా ఉండేందుకు 1969 డిసెంబర్‌లో ఇన్సెంటివ్ మిల్క్ సప్లయ్ స్కీమ్ యూనిట్‌ను చిత్తూరులో ప్రారంభించారు. గ్రామీణ పాల ఉత్పత్తిదారులకు లాభసాటి ధర అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పూనుకుంది. తొలుత రోజుకు 6 వేల లీటర్ల కెపాసిటీతో మొత్తం 60 మంది ఉద్యోగులతో ఈ డెయిరీ మొదలైంది. భారీగా పాల సేకరణతో రాష్ట్రంలోనే చిత్తూరు డెయిరీ యూనిట్ అతిపెద్దదిగా అవతరించింది. ఇలా మొదలైన ప్రస్థానం.. దినదినాభివృద్ధిగా దూసుకెళ్లింది. మిల్క్ ప్రోడక్టులు విస్తరించడంతో పాటు చిత్తూరు జిల్లాలో పాల ఉత్పత్తులు కర్మాగారం, అనుసంధానంగా మిల్క్ కూలింగ్, చిల్లింగ్ యూనిట్లు కూడా మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ 1998లో ప్రారంభించారు. 1993 వరకు ఇది విజయవంతంగా పని చేసింది. రోజుకు సగటున 2.5 లక్షల లీటర్ల పాలను సేకరించింది.
పతనం ఎందుకు? ఎలా మొదలైంది?
కాల క్రమంలో చిత్తూరు జిల్లాలో ప్రయివేటు డెయిరీలు కుప్పలు తెప్పలుగా మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పాల సేకరణ మొదలు పెట్టాయి. వివిధ కారణాలతో ప్రైవేట్ ఏజెన్సీలు, ప్రైవేట్ రంగ పాల డెయిరీల నుంచి అనారోగ్యకర పోటీని మొదలుపెట్టాయి. ఈ పోటీతో చిత్తూరు జిల్లా పాల యూనియన్ సేకరణ గణనీయంగా తగ్గిపోయింది. 1993 నుంచి యూనియన్ నష్టాలను చవిచూడటం మొదలైంది. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అన్నమాట! ఊహకు అందని విధంగా పరిస్థితి దిగజారింది. దానికితోడు.. బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 173 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం వల్ల అదనపు ఆర్థిక భారం పడింది. చంద్రబాబు హయాంలో పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది.
2017 జనవరి 23న వైయస్సార్ జిల్లాలోని పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణా జిల్లాలోని మినీ డెయిరీ, 2019 మార్చి 15న చిత్తూరు జిల్లాలోని మదనపల్లె డెయిరీ, మరో 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. రాష్ట్రంలో పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. పాల సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోయాయి. ప్రైవేటు డెయిరీలు విచ్చలవిడిగా పెరిగిపోయి, సిండికేట్‌గా మారి.. వారు నిర్ణయించిన ధరకే రైతులు పాలు పోసేలా పరిస్థితిని సృష్టించాయి. దీంతో పాడి రైతులు గణనీయంగా నష్టపోయారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఏం జరిగింది?
ప్రతిపక్ష నేతగా ఉండగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించారు. ఇందులో భాగంగా చిత్తూరు డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ 21 ఏళ్ల తర్వాత చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి జగన్ చేతులమీదుగా జూలై 4న భూమి పూజకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శంకుస్థాపన చేసిన 10 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.
చిత్తూరు డెయిరీని పునరుద్ధరించి, పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలిచే లక్ష్యంతో డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పును జగన్ సర్కార్ తీర్చింది. డెయిరీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. మొదటిగా రూ.150 కోట్ల అంచనా వ్యయంతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ ప్లాంటును నెలకొల్పనుంది. దశలవారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీరు, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు యూ.హెచ్.టీ ప్లాంటు కూడా ఏర్పాటు చేయనుంది.
25 లక్షల మందికి పాడి రైతులకు లబ్ధి
చిత్తూరు డెయిరీ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించడం ద్వారా పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు హెరిటేజ్ ఫుడ్స్‌కు బలమైన పోటీదారుగా నిలపాలని వైయస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం 2014-19 మధ్య అనుబంధ పోషకాహారం నిమిత్తం రూ.3,005.28 కోట్లు వెచ్చిస్తే.. వైయస్ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.5,701.02 కోట్లు వెచ్చించింది.
అమూల్‌తో ఒప్పందం తర్వాత మూడు జిల్లాల్లో మొదలైన పాల సేకరణ ప్రస్తుతం 17 జిల్లాల్లో దిగ్విజయంగా కొనసాగుతోంది. 30 నెలల్లోనే అమూల్ సంస్థ రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. గతంలో ప్రైవేటు డెయిరీలు రెండేళ్లకోసారి పాల సేకరణ ధర పెంచేవి. అమూల్ మూడు నెలలకోసారి పాల సేకరణ ధర సవరిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. 30 నెలల్లో 7 సార్లు ధర పెంచింది. జగనన్న పాల వెల్లువ పథకం కింద ఇప్పటికే 3.07 లక్షల మందితో 3,551 మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాల సేకరణ ద్వారా రూ.393 కోట్లు చెల్లించారు.
అమూల్ రాకతో గత రెండేళ్లలో పెంచిన పాల సేకరణ ధర వల్ల ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.3,754 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరింది. మూతపడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లె డెయిరీని అందుబాటులోకి తెచ్చారు. ఇలా పాడి రంగానికి ఎంత మేలు చేయగలుగుతారో అంతా చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అయితే, ప్రతిపక్షం మాత్రం జగన్‌కు మంచి పేరొస్తుందనే కంటగింపుతో ప్రతి కార్యక్రమాన్నీ రాజకీయానికి వాడుకుంటూ వస్తోంది. ప్రజల ఆస్తులను అమూల్‌కు కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ చేసే మేలును కూడా శంకించే పరిస్థితికి దిగజారింది.