Weather Latest Update: దాదాపు 20 రోజులపాటు ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు.. వస్తూ వస్తూ వర్షాలను తీసుకొచ్చాయి. కేరళలో ప్రవేశించిన తర్వాత నెమ్మదిగా కదులుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది స్థిరంగా కొనసాగుతోంది. (Weather Latest Update)
అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుగా వంపు తిరిగింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు అన్ని ప్రాంతాల్లోకీ విస్తరించాయి. ఈ కారణంగా రాయలసీమలోని జిల్లాలతో పాటు యానాం ప్రాంతంలోనూ రెండు రోజులుగా వర్షాలు బాగా పడుతున్నాయి. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. తాజాగా అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఉత్తర కోస్తా జిల్లాలైన ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. దాంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
ఇక తెలంగాణ వెదర్ విషయానికి వస్తే.. తెలంగాణలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపల్‌పల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, కొత్తగూడెం జిల్లాల్లో అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లా, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇక కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయన్నారు. నేడు, రేపు ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. మరో ఆరు జిల్లాలకు వర్ష సూచన లేదని, మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇక ఎల్లుండి బుధవారం వాతావరణం కూడాపెద్దగా మార్పు ఉండబోదని, పది జిల్లాలకు వర్షం కురిసే చాన్స్ లేదని అధికారులు అంచనా వేశారు. ఏడు జిల్లాల్లోని కొన్ని ఏరియాల్లో మోస్తరు వానలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల వానలు పడతాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ జలమయం.. జోరుగా వానలు..
ఇక హైదరాబాద్ నగరంలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. నగరం అంతా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. నేడు, రేపు కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. ఇక కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు తప్పవని పేర్కొంది.
Read Also : Gold Price Today (26-06-2023): ఈరోజు బంగారం, వెండి ధరలు.. స్థిరంగా పసిడి!